27, ఆగస్టు 2008, బుధవారం

EMI కట్టి చూడు

పాత కాలంలో కాబట్టి "ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు" అన్నారు. ఇల్లు కట్టటం చాలా కష్టం. పెళ్ళి చేయడం ఇంకా కష్టం అని అర్ధం. కాబట్టే పెళ్ళి చేయడం ఇల్లు కట్టటం తర్వాత వరుసలో వచ్చింది. అదే ఆ సామెత చెప్పిన మహానుభావుడు గనక ఇప్పుడు ఉండుంటే, వీటికన్న హోం లోన్ కి EMI కట్టటం చాలా కష్టం అని అర్ధం అయ్యి "EMI కట్టి చూడు" అనే వాడు. మనిషికి కావల్సిన రోటి, కపడా, మకాన్ ల లో చివరిదానిని సంపాదించడం ఎంత కష్టమో తెలియజేసేవాడు.

అసలు ఇల్లు కొన్నప్పుడయితే నా ఆనందానికి అవధులు లేవు. ప్రైం లొకేషన్ లో మంచి ఇల్లు కొనేసానన్న సంతోషం నన్ను నిలవనీయలేదు. మన ముందు తరం వాళ్ళకి ఇల్లు కొనేసరికి రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసేది, అదే నేనైతే పిన్న వయసులోనే ఇల్లు కొనేసి ఒక ఇంటి వాడినయిపోయాను అని గొప్పగా ఫీల్ అయిపోయి, కొన్నాళ్ళు నేల మీద కాకుండా గాల్లోనే నడిచా. కాని పైన దేవుడు ఉంటాడు, కింద చిదంబరం, RBI వాళ్ళు కూడా ఉంటారు కదా. వీడు ఇంత ఆనందంగా ఎందుకు ఉండాలి అని అనుకున్నారేమో, RBI వాడు వడ్డీ రేటు పెంచుదాం అనుకున్నాడు. పైనుంచి దేవుడు కూడ "తధాస్తు" అన్నాడు. అంతే లోన్ మొదలయిన 4 నెలలకే వడ్డీ రేటు 1% పెరిగి, EMI రెండు వేలు పెరిగింది. మొదటి సారి EMI దెబ్బ రుచి చూసా. అంతే గాల్లో ఉన్న నా కాళ్ళు గబుక్కున నేల మీదకి వచ్చేసాయి (తరవాత క్రమ క్రమంగా భూమిలో కూరుకుపోయాయి).

అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకోసారి (కొన్ని సార్లు 4 నెలలకే) వడ్డీ రేట్లు పెరగయి. దాంతో పాటు EMI, లోన్ తీర్చాల్సిన సమయం రెండూ కూడా కొండవీటి చేంతాడులా, హనుమంతుడి తోకలా పెరిగిపోయాయి. ఇప్పటికి ఇంటికి తీసుకొన్న అప్పు వడ్డీ రేటు 5% పెరిగి, తీర్చాల్సిన సమయం 20 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళకి పెరిగి నా "కొంప" ని కొల్లేరు చేసాయి. ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. నేను ఇల్లు తీసుకొన్న కొత్తలో ఇంటి అద్దె EMI కి దాదాపుగా సరిపోయేది, ఇప్పుడు అది అద్దె లో సగానికి పడిపోయింది. నా సహోద్యుగులు కొంతమందికి హో లోన్ తీర్చాల్సిన సమయం 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళకి కూడా పెరిగిపోయింది. వాళ్ళతో పోల్చుకుంటె నా పరిస్థితి చాలా చాలా బెటరేమో! గుడ్డిలో మెల్ల, చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఇదే!! ఇప్పుడు అర్ధం అయింది నాకు మన ముందు తరానికి ఇల్లు కొనటానికి అంత సమయం ఎందుకు పట్టిందో. కాకపోతే వాళ్ళు డబ్బు దాచుకొని కొంచెం ఆలస్యంగా ఇల్లు కట్టుకొనే వాళ్ళు. మనం కొంచెం ముందు ఇల్లు కట్టుకొని డబ్బంతా వడ్డీ రూపంలో బేంకులకి దోచి పెడుతున్నాం. అంతే తేడా.

నేను చేసిన మొదటి తప్పు ఇల్లు కొనాలి అనుకోవడం. అదీ లోను తీసుకొని మరీ కొనాలనుకోవడం. "ఒన్ ఫైన్ మార్నింగ్" ఎందుకనిపించిందో ఏమో తెలియదు కాని ఇల్లు కొనాలి అనిపించింది. అంటే అప్పటినుండి నాక్కావల్సిన విధంగా ఉండే ఇంటి కోసం వేట మొదలెట్టా. ప్రతి వారాంతంలోను ఇలా వేటాడగా, వేటాడగా 4 నెలలకి నాకు అన్ని విధాల నచ్చిన నా కలల ఇల్లు నా బడ్జెట్ కి కూడా సరిపోయే ఇల్లు దొరికింది. నేను "సాప్ట్ వేర్ ఇంజినీర్" ని అని చెప్పగానే బిల్డర్ కళ్ళల్లో కొత్త మెరుపులు. డొనాల్డ్ డక్ కార్టూన్ షో లో "అంకుల్ స్క్రూచ్" కళ్ళల్లో డాలర్స్ కనపడతాయే అలాంటి మెరుపులన్నమాట. "సాప్ట్ వేర్ ఇంజినీర్" అనగానే వాడు రేటు అమాంతం పెంచేసాడు. పైగా "మీకేంటి సార్ సాప్ట్ వేర్ ఇంజినీర్లు" అని బోనస్ గా సెటైర్ ఒకటి. అక్కడికేదో నేనేదో బిల్ గేట్స్ కి అళ్ళుణ్ణయినట్లు లేకపొతే మా ఆఫీస్ వాళ్ళు నాకు ఫ్రీ గా జీతం ఇస్తునట్లు. సాప్ట్ వేర్ ఇంజినీర్లంటే ఈ "పెద్ద చూపు" ఎప్పుదు పోతుందో ఏంటో. వాడు చెప్పిన రేటుకి ఇల్లు నా బడ్జెట్ దాటిపోయింది కదా, ఇక కొంచెం లోను ఎక్కువ ఇచ్చెవాడి కోసం వేట మొదలెట్టా. తొందరగా పని అయిపోతుంది కదా అని ఒక ప్రైవేటు బేంకుకి లోను అప్ప్లై చేసా. వాడు కూడా అనుకున్న దానికంటె తొందరగా ఎడం చేత్తో లోను అప్లికేషన్ తీసుకొని, వెంటనే కుడిచేత్తో లోన్ శాంక్షన్ చేసేసాడు. తీసుకున్న తర్వాత నిజంగానే నా పని అయిపోయిందని నాకు తర్వాత మెల్లగా అర్ధమయింది. అది నేను చేసిన రెండో తప్పు. ఈ బేంకు వాళ్ళు చాలా అంటే చాలా ఫాస్టుగా ఉంటారు. చిదబరం గాని, RBI గాని "వడ్డీ రేట్లు పె" అంటే చాలు, "వడ్డీ రేట్లు పెంచుతున్నాం" అన్న వాక్యం పూర్తి కాకుండానే ఇక్కడ "వడ్డీ రేట్లు పెంచేసాం" అని మనకి లేఖలు కూడ పంపించేస్తారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మాత్రం, తగ్గిన తర్వాత 1-2 సంవత్సరాలు చూసి, నిజంగా తగ్గాయి అని అనుకుంటే అప్పుడు తగ్గిస్తారు అన్నమాట. నా అదృష్టం బాగుండి, నేను లోన్ తీసుకున్న తర్వాత పెరగడమే కాని తగ్గడం లేదు కాబట్టి EMI తగ్గడం అనే మహద్భాగ్యాన్ని కళ్ళారా చూడలేకపోయాను. ఇక ముందు చూస్తాను అనే నమ్మకం కూడా నాకు లేదు.

పడ్డ వాళ్ళెప్పుడు చెడ్డ వాళ్ళు కారు అని సరి పెట్టేసుకుంటున్నా కాని, వడ్డీ రేట్లు ఇలా హైదరబాద్ ఆటో మీటర్ లా పెరుగుకుంటూ పోతే, పేద సాప్ట్ వేర్ ఇంజినీర్ ని ఇంత EMI నేను కట్టలేను. అందుకే అంటున్నా "EMI కట్టి చూడు, పెళ్ళి చేసుకొని చూడు అని".

మరి ఇల్లే ఇంత కష్టం అయితె పెళ్ళి ఇంకెంత కష్టమో. వా :(( నాకేడుపొస్తుంది.. వా.. వా .. వా :((

20, ఆగస్టు 2008, బుధవారం

అమ్మ, బామ్మ, బెండకాయ పులుసు

పూత రేకులకి ఆత్రేయపురం ఫేమస్. కాజాలకి కాకినాడ ఫేమస్. లడ్డూలకి బందరు ఫేమస్. బిర్యానికి మన భాగ్యనగరం ఫేమస్. బిసి బేళి బాత్ కి బెంగుళూరు ఫేమస్. ఇలా కొన్ని కొన్ని పదార్ధాలకి కొన్ని కొన్ని ప్రాంతాలు ఎలా ఫేమస్సో మా బామ్మ (మా నాయనమ్మ) బెండకాయ పులుసుకి అంత ఫేమస్సు. ఇప్పుడు ఏ లోకాన బెండ కాయ పులుసు వండుతుందో తెలియదు కాని, బెండ కాయ పులుసు మాత్రం కత్తిలా చేసేది. చూడగానే నొట్లో నీళ్ళూరేవి (కొంచెం కారంగా ఉండేది కాబట్టి తింటే కంట్లో కూడా నీళ్ళొచ్చేవి).

బిర్యాని, బొమ్మిడాయల పులుసు, బిసి బేళి బాత్, బందరు లడ్డు, మా నానమ్మ చేసిన బెండకాయ పులుసు అన్ని ముందు పెట్టి ఏది కావాలని అడిగితే చటుక్కున బెండకాయ పులుసుకే నా వోటు వేసే వాడిని. అంత బాగుండేది. ఆ పులుసు వెనక ఏ రహస్య ఫార్ములా ఉందో తెలియదు గాని అంత బాగా వండటం ఇంకెవ్వరి వల్లా అయ్యేది కాదు. మా అత్తలకి, మా అమ్మ కి, మా పిన్నులెవ్వరికి కూడా అంత బాగా వండటం వారసత్వంగా అన్నా రాలేదు.

నా పేరు మా నానమ్మ పేరుతో కలిపి పెట్టటం వల్లనో, లేక వంశోధ్ధారకుడనో, మొత్తానికి మా నానమ్మకి నేనంటే చాలా ఇష్టం. బెండకాయ పులుసు వండినప్పుడల్లా మనకి "స్పెషల్" గా మా ఇంటికి పార్సిల్ వచ్చేది. ఇలా సంతోషంగా మూడు బెండకాయలు ఆరు పులుసులుగా రోజులు గడిపేస్తున్నాను.

అయితే - అన్ని రోజులు ఒకేలా ఉండవు

నేను కాలేజ్ చదువుల కోసం వేరే ఊరు వెళ్ళవలిసి వచ్చింది. రెసిడెన్షియల్ కాలేజ్ కాబట్టి హాస్టల్ లోనె ఉండేవాళ్ళం. మా హాస్టల్లో తిండి మాత్రం భలే అద్భుతం గా ఉండేది. ఆ తిండికి మా నాలుక మీదున్న రుచి మొగ్గలన్ని అంతరించి పోయాయి. రుచికరమైన తిండికి బాగా మొహం వాచిపోయాం. ఎంతగా మొహం వాచిపోయామంటే ఎవడైనా ఇంటి దగ్గర నుంచి వచ్చాడనే తెలిస్తే చాలు, కరువొచ్చినప్పుడు దుకాణాల మీద పడి దోచుకునే వాళ్ళ లాగా వాడి మీద దాడి చేసి, ఇంటి దగ్గర నుంచి ఏమి తెస్తే అది క్షణాల్లొ గుటుక్కుమనిపించే వాళ్ళం. అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి. (ఏంటో ఈ మధ్య మా ఆఫీస్ కేంటీన్ వాడు కూడ మా హాస్టల్ ని పదే పదే గుర్తు తెస్తున్నాడు). ఈ బాధ పడలేక ఒక సారి ఇంటికి చెక్కేసాను. డైరెక్ట్ గా మా నానమ్మ దగ్గరికి వెళ్ళి బెండకాయ పులుసు వండించుకున్నా. వరదల్లో పులిహోర పొట్లం సంపాందించి తింటున్న వాడిలా, వారం రోజుల నుంచి అన్నం తిననని వాడిలా కంగారు కంగారు గా తినేసా. తినేసి సంతోషంగా ఊరు మీదకి బలాదూరు బయలుదేరా.

బొత్తిగా అత్తా కోడళ్ళ సీరియల్సు చూసే అలవాటు లేకపోవడం వల్లా, అజ్ఞానం తోను నేను చేసిన చారిత్రాత్మక తప్పిదం ఏంటో నాకు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అర్ధం అయింది. నాయనమ్మ ఇంటికి వచ్చి మా అమ్మతో నువ్వు నా మనవడికి సరిగా వండి పెట్టడం లేదు అందుకే నా దగ్గరికి వచ్చి బెండకాయ పులుసు చేయమని అడిగాడు అని దెప్పింది. అంతే మాట మాట పెరిగింది ఇద్దరి మధ్య పచ్చని బెండకాయ వేస్తే బగ్గున మండింది. యుధ్ధ నగారా మోగింది. చరిత్రలో ఒకటవ బెండకాయ యుధ్ధం మొదలయింది.

నానమ్మకు తోడుగా 2 మిత్ర దేశాలు(ఆ పక్కింటి వాళ్ళు), అమ్మకు తోడుగా 2 మిత్ర దేశాలు (ఈ పక్కింటి వాళ్ళు) సైన్యాన్ని మొహరించాయి. ఒకరి మీద ఒకరు యుద్ధాస్త్రాలు సంధిస్తున్నారు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. "బెండకాయ పులుసులో తుఫాను" అంటే ఇదేనేమో? వెంటనే ఇటువంటి విషయాలు పరిష్కరించడం లో ఆరితేరిన ఐక్య రాజ్య సమితి (మా నాన్న) ని రంగలో దించా. ఐ.రా.స. జ్యోక్యంతో ఇరు పక్షాలు యుధ్ధాన్ని విరమించాయి. ఆ విధంగా ఒకటవ బెండకాయ యుధ్ధానికి తెరపడింది.

ఆ తర్వాత తినాలనిపిస్తే నన్ను అడగచ్చు కదాని మా అమ్మ నాకు "ఫుల్లు" క్లాసు .అలాంటి తప్పు మళ్ళీ ఇంకెప్పుడు చేయకుండా మరిన్ని యుధ్ధాలు జరగకుండా జాగ్రత్తపడ్డాను. కాని బామ్మ వండిన బెండకాయ పులుసుని మనం వదుల్తామా? ఈ సారి తినాలనిపించినపుడు మా తాతతో బజారుకు వెళ్ళి బెండకాయలు కొనిపించేవాడిని. అంతే. యధావిధిగా మన "స్పెషల్ పార్సిల్" రెడీ !!

అలా నాకు మా నానమ్మ వండిన బెండకాయ పులుసు ఎంత ఇష్టం ఏర్పడిపోయింది అంటే. మా నానమ్మ లోకాన్ని వదిలి వెల్లిపోయిన తర్వాత నేను కూడా బెండకాయ పులుసుని వదిలేసాను. ఇంకెప్పుడు తినలేదు.

7, ఆగస్టు 2008, గురువారం

తుఫాను

వర్షం పడుతున్నప్పుడు చూస్తే మీకేమనిపిస్తుంది? తడవాలనిపిస్తుందా? పడవలు చేసి ఆడుకోవాలి అనిపిస్తుందా? కిటికీ లోంచి వర్షాన్ని చూస్తూ వేడి వేడి వేరు శెనక్కాయులు తింటూ ఏదైనా పుస్తకం చదుకోవాలి అనిపిస్తోందా?

నాకు మాత్రం .......

****************************************************************************************************************************

అప్పుడు నేను 8 వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడంటె తగ్గిపోయింది కాని, నాకు అప్పట్లో క్రికెట్ పిచ్చి బాగానే ఉండేది ( నిజం చెప్పాలంటే అప్పట్లో మన వాళ్ళు బాగానే ఆడేవాళ్ళు). మన వాళ్ళు "టైటాన్ కప్" ఫైనల్ కి వచ్చారు. ఫైనల్ లో ప్రత్యర్ధి సౌత్ ఆఫ్రికా.

ఆ రోజు 1996 నవంబర్ 6. నేను, నాతో పాటు నా సహ క్రికెట్ పిచ్చోడు మా బాబాయి, వాళ్ళింట్లో మ్యాచ్ చూస్తున్నాం (పిచ్చి వాళ్ళలో సమైఖ్యత ఎక్కువుంటుంది !!!). మా బాబాయి వాళ్ళ ఇంటి వెనకాలే మా ఇల్లు కూడా ఉండేది. మ్యాచ్ ప్రారంభం అయింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు మొదట బ్యాటింగ్ చేసారు. ఎంత కొట్టారో గుర్తు లేదు కాని బాగానే కొట్టారు. మన వాళ్ళ బ్యాటింగ్ మొదలయింది. దాంతో పాటు బయట వర్షం కూడా మొదలయింది. వర్షం చినుకులు రాలినట్టు వికెట్లు కూడా టపా టపా రాలిపోతున్నాయి. కొట్టవలసిన స్కోరు ఇంకా చాలా ఉంది. బ్యాట్స్ మెన్ అందరు అవుతయిపోయారు. క్రీసులో కుంబ్లే, శ్రీనాథ్ ఉన్నారు. ఏమవుతుందో అన్న టెన్షన్. వర్షం ఇంకా పెద్దదయింది. కుంబ్లే, శ్రీనాథ్ ఇంకా ఆడుతున్నారు. అప్పుడె కరెంట్ కూడా పోయింది. గెలుస్తారన్న నమ్మకం లేకపోయినా మ్యాచ్ ఏమయిపోయిందో అన్న టెన్షన్. టి.వి. చూద్దామంటే కరెంట్ లేకుండా పోయింది. మేము వదులుతామా? రేడియో పెట్టి కామెంట్రీ వింటున్నాం. ఇక్కడ వర్షం ఇంకా విజృభించింది. అక్కడ కుంబ్లే, శ్రీనాథ్ పరుగుల వరద పారించారు. హుర్రే!! మనం ఫైనల్ గెలిచేసాం. "టైటాన్ కప్" మనదే.

మన వాళ్ళు ఫైనల్ గెలిచారో లేదో ప్రకృతి వైపరీత్యాలు మొదలయ్యాయి. వర్షం భారీ వర్షం గా, భారీ వర్షం తుఫాను గా మారింది. ఆ గాలికి మా బాబాయి వాళ్ళ ఇంటి పైన పెంకులు టపా టపా ఎగిరిపడసాగాయి. దీపావళికి 1000 వాలా బాంబులు పేల్చినట్టు గా ఉంది ఆ శబ్దం. కిటికి లోంచి చూస్తే సినిమాల్లో చుపించినట్టు చెట్లు గాలికి ఒక పక్కకి వంగిపోయి భయంకరంగా వూగుతున్నాయి. చాలా భయం వేసింది. ఎంత భయపడ్డానంటే మా బాబాయి వాళ్ళ ఇంటికి 4 అడుగుల దూరం లో ఉన్న మా ఇంటికి వెళ్ళడానికి కూడా నేను చాలా భయపడ్డాను. 2 గంటల తర్వాత వర్షం, గాలి కొంచెం తగ్గాయి. మా బాబాయి నన్ను ఇంట్లో దిగబెట్టాడు.

వర్షం బాగా తగ్గిన తర్వాత మా వీధి లో ఉన్న బాషా మేష్టారు నా వయసు కుర్రాళ్ళని కొంతమందిని పిలుచుకెళ్ళారు. పిలిచారు కాబట్టి వెళ్ళాం ఎందుకో నాకో తెలియదు. మేష్టారి వెనకాల మేమందరం టార్చి లైట్లు పట్టుకొని వీది మొదట్ళో ఉన్న "సూరమ్మ" గారింటికి వెళ్ళాం. మేష్టారు సూరమ్మ గారిని "ఏమ్మా ఇంట్లో అందరు బాగానే ఉన్నారు కదా? ఎవరికి ఏమి కాలేదు కదా?" అని వాకబు చేసారు. "అందరు బతికే ఉన్నారు కదామ్మా?" అనే అర్ధం ధ్వనించింది ఆ మాటల్లో. పరిస్థితి అంత సీరియస్ గా ఉన్న విషయం నాకప్పటికి వరకు అర్ధం కాలేదు. నా లాంటి పిల్ల కాకికేం తెలుసు తుఫాను దెబ్బ. అలా మా వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాని కనుక్కొని వచ్చాం. అదృష్టవశాత్తు మా వీధిలొ ఎవరికి ఏమి కాలేదు కాని ఇద్దరు గల్లంతయ్యారు.

మిగతా ప్రపంచం తో కమ్యూనికేషన్ తెగిపోయింది. వారం రోజులు కరెంట్ లేదు. కరెంట్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు సైతం ఎక్కడిక్కడ రోడ్డుకడ్డంగా పడిపోయాయి. నేను పెంచుకున్న మామిడి చెట్టు కూడా కూలిపోయింది. వర్షానికి ఇంట్లోకి నీళ్ళొచ్చాయి. 2 రోజులు నీళ్ళు అలాగే నిలిచిపోయాయి. నీళ్ళలో అక్కడక్కడ పాములు తిరుగుతున్నాయి. పురుగు, పుట్ర వస్తాయేమో అన్న భయం తో ఆ 2 రోజులు మా అమ్మ, నాన్న నిద్రపోకుండా కాపలా కాసారు. కిరోసిన్ దీపాలతో, ఇంట్లో ఉన్న కొద్ది పాటి వంట సామాగ్రి తో నెట్టుకొచ్చాం. ఇంట్లో ఉన్న సామాను కొద్ది రోజులకే సరిపోతుంది. అన్నీ పొదుపు గా వాడవలసి వచ్చింది. 4-5 రోజుల తర్వాత రేషన్ షాపులో కిరోసిన్, బియ్యం ఇచ్చారు.

2 రోజుల తర్వాత కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత నేను, మా బాబాయి వూరు ఎలా ఉందో చూడటనికి వెళ్ళాం. ఏ వీదిలో చూసినా మోకాలు లోతు నీళ్ళు, పడిపోయిన చెట్లు. తలకోన అడవి లో ఉన్నామా అనిపించింది. వందల ఏళ్ళ నాటి పెద్ద పెద్ద మర్రి చెట్లు కూడ కూలిపోయాయి. 10 రోజులు పరిస్థితి అలాగే ఉంది. 10 రోజుల తర్వాత స్కూలుకు వెళ్ళా. మా స్కూలు చూడగానే నిజంగా ఏడుపొచ్చింది. అప్పటికి 100 ఏళ్ళు నిండిన మా స్కూలు లో 1500 మంది విద్యార్ధులతో, 10 ఎకరాల్లో ఉండేది. తుఫాను దెబ్బతో తరగతి గదుల రేకులన్ని ఎగిరిపోయి, క్లాసు రూములు నిండా బురద, చెత్త చెదారం.. అబ్బా. అలాంటి స్కూలు ఎలా అయిపోయిందో తలుచుకుంటే ఇప్పటికీ అదోలా ఉంటుంది.

****************************************************************************************************************************

అందుకే వర్షాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. నవంబర్ 6 వస్తే నాకు వణుకు పుడుతుంది.

కొసమెరుపు: తుఫాను వచ్చిన 3 రోజుల తర్వాత మా తాతయ్య నాకు పదేళ్ళ కిందటి "కృష్ణా పత్రిక" ఒకటి చూపించారు. ఖచ్చింతంగా పదేళ్ళ కిందటిది అంటే 1986, నవంబర్ 6 తేదిన వచ్చిన పేపర్. ఆ పేపర్ చూడగానే నా భయం ఇంకా రెట్టింపయింది. ఆ రోజు పేపర్ హెడ్ లైన్ "దివి సీమ లో ఉప్పెన".

5, ఆగస్టు 2008, మంగళవారం

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందా!!

ఒక రోజు ఉదయం ఆఫీస్ కి బయలుదేరాను. అప్పటికి ఒన్-వే టైం దాటిపోవడం తో, అమృత ఘడియలు అంతం అయిపోయి, రాహుకాలం & దుర్మూహర్తం కలసి కట్ట కట్టుకొని మొదలయ్యాయి. మా ఆఫీస్ కి వెళ్ళాలి అంటే దారిలో హైటెక్ సిటీ లోకల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సొరంగం దాటాలి. ఇక్కడికి రాగానే నాకు ఫ్లాష్-బాక్ లో వైజాగ్ నుంచి అరకు రైలు లో వెళ్ళినప్పుడు దారిలో వచ్చే సొరంగాలు గుర్తుకు వస్తాయి. ఆ సొరంగాలే కొంచెం నయమేమో, ఈ సొరంగం దాటడానికి ఎంత టైం పడుతుందో ఆ బ్రహ్మకి, ఈ బ్రహ్మికీ కూడా తెలియదు. భాగ్యనగరంలో ఏ మూలన చిన్న చినుకు పడినా ఇక్కడ పెద్ద ఈత కొలను తయారవుతుంది. అందులో కార్లు, బైకులు ఈదుకుంటూ వెళ్ళాలి.

ఈ పద్మవ్యూహం లో ద్విచక్ర వాహనంతో దూరటానికి నాకే కంత లేదంటె నా మెడకో డోలు అదనం. ఈ డోలునే మా ఆఫీస్ లో లాప్ టాప్ అంటూ ఉంటారు. ఎలగోలాగా కష్టపడి ఈ సొరంగాన్ని తొందరగా ఒక గంటలోనే దాటేసా. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, క్లచ్ తోను, బ్రేక్ తోను, లాప్ టాప్ బేలన్స్ చేస్తూ బిజీగా ముందుకు వెళ్తూండగా, నా ఆనదాన్ని భగ్నం చేస్తూ అకస్మాత్తుగా గా వర్షం మొదలయింది. ఏ చెట్టు కిందన్న నిలబడదాం అనుకున్నా ఆ రోడ్డులో ఒక్క చెట్టు కూడా ఉండదు. సగం పూర్తి అయినా ఓవర్ బ్రిడ్జ్ కూడా, మోడరన్ ఆర్ట్ లా, ఎక్కడ మొదలయ్యి, ఎక్కడ దిగుతుందో అర్ధం కాకుండా ఉంటుంది. ఇలా ముందుకు, వెనకకు కదలలేక లాప్ టాప్ తడవకుండా అవస్థ పడుతున్న సమయం లో, నా మనసు ఎంత వద్దంటున్న వినకుండా "దున్నపోతు మీద వర్షం పడినట్టు" లాంటి సామెతలన్ని గుర్తు చేయడం మొదలుపెట్టింది. నా మనసుని బుజ్జగించి "వానా వానా వందనం" అని పాడుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయాను.

ఉదయాన్నే ఈ దుశ్శకునాలేంటో అనుకుంటూనే ఆఫీస్ కి చేరుకున్నా. ఆఫీస్ కి చేరగానే ఆ రోజు మా టీం మెంబర్ వెంకి (వెంకటేశ్వర రావు) గాడి పెళ్ళి ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. "కష్టాల్లో తోడు నిలిచే వాళ్ళే నిజమైన స్నేహితులు", కాబట్టి మేమందరం స్నేహధర్మాన్ని పాటించటం కోసం వెంకి పెళ్ళికి తప్పనిసరిగా వెళ్ళాలని ముందే అనుకున్నాం. పొద్దున్న వర్షం ఎఫెక్ట్ డి.టి.ఎస్ లెవెల్ లో కనిపించటం తో, కారు లో వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. అనుకోకుండా మా డేమేజర్ సారీ! మా మేనేజర్ సుబ్బి ( సుబ్బా రావు ) ఆ రోజు కారు తీసుకువచ్చాడు. వాడు డ్రైవింగ్ నేర్చుకొని ఎంతో కాలం కాలేదు. వాడి డ్రైవింగ్ ప్రావీణ్యాన్ని చూపించాలని మాంచి ఉత్సాహం తో ఉన్నాడు. వాడి మనసులో ఇంత కుట్ర ఉందని నాకు తెలియదు.

కారులో వెంకి గాడి పెళ్ళికి బయలుదేరాం. దూరంగా హై టెక్ సిటీ సిగ్నల్, క్రికెట్ వరల్డ్ కప్ లా పచ్చగా వెలుగుతూ వూరిస్తూ కనపడింది. సిగ్నల్స్ క్రాస్ చేస్తామా? లేదా? అని అందరం టెన్షన్ లో ఉన్నాం. సుబ్బు గాడు టెన్షన్ తో గంగూలీ లాగా గోళ్ళు కొరుకుతున్నాడు. ఫైనల్ దాకా వచ్చేసాం, విజయం మనదే అనుకుంటుండగా, అకస్మాత్తుగా ఎవడో "పాంటింగ్" లాగా అడ్డుపడ్డాడు. ఫాం లో ఉన్న పాంటింగ్ లాగా రెచ్చిపోయి, మా కార్ ని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్ళి మలుపు తీసుకున్నాడు. వరల్డ్ కప్ చేజారిపోయింది. రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళి 4 సంవత్సరాలు వేచి చూసి సిగ్నల్ క్రాస్ చేసాం. సుబ్బు కార్ స్పీడ్ పెంచాడు. ఫరవాలేదు బానే డ్రైవ్ చేస్తున్నాడే అనిపించింది.

ఇంతలో ఎవడో అకస్మాత్తుగా అడ్డం రావడంతో సడెన్ బ్రేక్ వేసాడు. పెద్ద శబ్దం తో కార్ ఆగింది. వాడిని తిట్టటం అయ్యాక మా వాడు సంచలన ప్రకటన ఒకటి చేసాడు. "కార్లని సరిగా డిజైన్ చేయలేదయ్యా! ఆర్కిటెక్చర్ అంత బాగుండదు. బ్రేకుకి, ఏక్సిలేటరుకి ఒకే కాలు ఉపయోగించాలి. పొరపాటున బ్రేక్ బదులు ఏక్సిలేటర్ తొక్కితే ప్రాబ్లెం కదా?!" అన్నాడు.
అంటే దాని అర్ధం ఏంటి? పొరపాటున బ్రేక్ బదులు ఏక్సిలేటర్ వాడితే ఆర్కిటెక్చర్ ప్రాబ్లెం నాది కాదు అనా? ఆర్కిటెక్చర్ బాలేని ప్రాజెక్ట్ ఇస్తే మేము వర్క్ చేయలేదా? నీ ఆర్కిటెక్చర్ ప్రాబ్లెం దొంగలెత్తుకెళ్ళా? ఏదైనా పొరపాటు జరిగితే ఇదే విషయాలు వూచలు లెక్కపెట్టుకుంటూ ఆలోచించాలి.

ఆ దెబ్బ తో, మేమందరం అటెన్షన్ లోకి వచ్చేసాం. మా భయానికి ట్రాఫిక్ జాం తోడయ్యింది. ముందు కి వెళ్ళడానికి లేదు. వెనక్కి వెళ్ళడానికి లేదు. సుబ్బు గాడు ఫస్ట్ గేర్ లో మెల్లి మెల్లిగా కార్ ని ముందుకు నడిపిస్తున్నాడు. అప్పటికి గంట నుంచి ఫస్ట్ గేర్ లోనే నడిపిస్తూ, క్లచ్ మీద కాలు ఉంచి, తీసి విసుగొచ్చిన సుబ్బు గాడు "నా వల్ల కాదు. నాకు కాళ్ళు నెప్పెడుతున్నాయి. నేను కార్ వదిలేసి వెళ్ళిపోతా" గోల చేయడం మొదలెట్టాడు. అన్యాయం. అక్రమం. కుట్ర. ఇలాగే ముందుకి, వెనకకి వెళ్ళడానికి లేని పరిస్థితిలో ఉన్న ప్రాజెక్ట్ ని వదిలి పెట్టి నేనుప్పుడైనా వెళ్ళిపోయానా? అమ్మో! ఇప్పుడు నన్ను గాని డ్రైవ్ చెయ్యమంటే నా పరిస్థితి ఏంటి? నాకు లైసెన్స్ అయితే ఉంది కాని డ్రైవింగ్ రాదు ( ష్! ఎవరితోను చెప్పకండే! ). కోడింగ్ అయితే గూగుల్ లో వెతికి కాపీ పేస్ట్ చేయగలను గాని, డ్రైవింగ్ కాపీ పేస్ట్ చేయలేను కదా (అలాంటి వెబ్ సైట్లు ఏమైనా ఉంటే చెప్పండి. ఎంత ఫీజు అయినా జాయిన్ అయిపోతా ). ఉదయాన్నే కనిపించిన దుశ్శకునాల అర్ధం, పరమార్ధం ఏంటో నాకప్పుడు అర్ధం అయింది. ఏదో రకంగా మా మేనేజర్ గారినే, ఆ వీకెండ్ ఆఫిస్ కి వచ్చి వర్క్ చేస్తామని, బోనస్ అడగమని, అదని, ఇదని చెప్పి డ్రైవింగ్ కి ఒప్పించేప్పటికి మా తల ప్రాణం తోకకి, తోక ప్రాణం తలకి రెండు, మూడు రౌండ్లు కొట్టింది.

ఇలా అడ్డంగా అడ్డొచ్చే ఆటో వాళ్ళని తిట్టుకొంటూ, ఫోన్ మాట్లాడుకొంటూ రోడ్డు దాటే "సైంధవులని" దాటుకుంటూ, రాంగ్ రూట్లొ ఎదురొచ్చి మనమే రాంగ్ రూట్లో వచ్చామని భ్రమింపచేసే రాంగ్ రూట్ గాళ్ళని ఎదుర్కుంటూ, రోడ్డు మధ్యలోకొచ్చిన తర్వాత వెళ్దామా? వద్దా? అని ఆలోచించే మేధావులని ఆశ్చర్యంగా చూస్తూ, అప్పుడప్పుడు ఎద్దుల బండిలో వెళ్ళే వాళ్ళని చేజింగులు చేస్తూ, ట్రాఫిక్ జాములు, సిగ్నల్సు అన్ని దాటుకొని పెళ్ళికి వెళ్ళేప్పటికి మాకు సప్త సముద్రాలు దాటి భైరవ ద్వీపం లో ఉన్న చిలకని, ఆ చిలకలో ఉన్న మాంత్రికుడి ప్రాణాన్ని పట్టుకొన్నంత ఆనందం కలిగింది. కార్ దిగీ, దిగగానె ముందు అందరం వరద బాధితుల్లా అందరం భోజనానికి పరిగెట్టాం. అసలే బయలుదేరి చాలాసేపు అయిందేమో విపరీతమైన ఆకలి. లేట్ గా వస్తే తినడానికేమి ఉండదేమో అన్న డౌటు. పెళ్ళి వాళ్ళు, అప్పుడే పాత్రలు అన్నీ కడగటానికి రెడీ అయ్యారు. పాపం మా మొహాలు చూసి వాళ్ళు కొంచెం జాలి పడి, ఏదో మిగిలింది కొంచెం మాకు పెట్టారు. భోజనం కాగానే అందరం మా వెంకి ని పరామర్శించటానికి సారీ! పలకరించటానికి వెళ్ళాం. మనసులో బాధగానే ఉన్న, వాడు పాపం నవ్వుతూనే పలకరించాడు.

వాడి బాధ ఏమో కాని, మా వెంకి గాడి పెళ్ళి సుబ్బి గాడి చావుకి, మా చావుకి వచ్చినట్టనిపించింది.

26, జులై 2008, శనివారం

"రాగాల" ఋతువు

వెనక గది నుంచి పెద్ద పెట్టున ఏడుపులు వినిపించాయి. నేను ఉలిక్కిపడ్డాను. ముందు గదిలో ముందు నెల పేపర్ చదువుతూ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అప్ డేట్ చేసుకుంటున్న నేను వెంటనే పేపర్ అక్కడ పడేసి వెనక గది లోకి వెనక గదిలోకి పరిగెట్టాను. మా నాయనమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరికి నాయకత్వం వహిస్తూ పెద్ద పెట్టున ఏడుస్తోంది. నాకు ఏమి జరిగిందో, ఎవరికి ఏమైందో అర్ధం కాలేదు. ఎవరినైనా అడుగుదాం అనుకున్నా వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి అడగటానికి భయం వేసింది. అదే సమయం లో పక్కింటి లోంచి, ఎదురింటి లోంచి, వెనకింటి లోంచి కూడా కోరస్ గా ఏడుపులు వినిపించాయి. ఆహా ఏం కో-ఆపరేషను. ఎంత ఎంత పక్క పక్క ఇళ్ళలో ఉంటే మాత్రం ఏడవడం లో కూడ మరీ ఇంత తక్షణ సహాయమా? ఇంతలో మా నాయనమ్మ ఒకేసారి ఏడుపు లెవెల్ పెంచింది. "ఓరి మాయదారి దేవుడో! అప్పుడే తీసుకెళ్ళిపోయావా?" అని పెద్దగా ఏడవడం మొదలెట్టింది. అక్కడ కూర్చున వాళ్ళు కోరస్ గా పెద్ద పెట్టున ఏడుపు సౌండ్ పెంచారు.

అప్పుడు లోపలికి వెళ్ళి చూద్దున కదా! నా ఫ్యూజ్ ఎగిరిపోయింది. వాళ్ళు ఏడుస్తున్నది ఎవరో దగ్గరి వాళ్ళకి ఏదో అయినందుకు కాదు, టి.వి. లో వస్తున్న "ఋతు రాగాలు" సీరియల్ లో ఏదో పాత్ర ( రాజీవ్ కనకాల అనుకుంటా) చనిపోయినందుకు!!. ఎవరికి ఏమి కాలేదన్న కొంచెం ఆనంద పడినా, నాకు జీవితం మీద విరక్తి మొదలయ్యింది. అప్పటికి మా నాయనమ్మ కి, సీరియల్స్ మిస్ అవ్వకుండా ఒక "బ్రేక్" లో వంట చేసి, ఇంకో "బ్రేక్" లో తిండి పెట్టడం లాంటి కళలలో చేయి తిరిగిపోయిందని తెలుసు కాని, మరీ ఇంతలా సీరియల్స్ పాత్రలని ఇంట్లో వాళ్ళలా ఫీల్ అయిపోతుందని నాకు అప్పుడే తెలిసింది.

అసలు "ఋతు రాగాలు" కొంచెం ఫరవాలేదు. నా జీవితం లో కొద్దో, గొప్పో ఫాలో అయిన సీరియల్ అదే. చివరిలో సీరీయల్ ని సాగదీయడం. "దేవదాస్ కనకాల" పాత్ర మృతృయుంజయుడులా ఎన్ని తరాలైనా అంతే యవ్వనంతో ఉండటం లాంటి కొన్ని విషయాల వల్ల చూడటం మానేసాను.

ఇంకొన్ని సీరియల్స్ అయితే మరీ ఘోరం. ఎపిసోడ్ మొదలయ్యెప్పుడు "టైటిల్ సాంగ్" ఒక 5 నిముషాలు, "జరిగిన కధ" ఒక 5 నిముషాలు, అయిపోయెప్పుడు మళ్ళి "టైటిల్ సాంగ్" 5 నిముషాలు, ఇలా 15 నిముషాలు, 30 నిముషాల సీరియల్ టైం లో పోగా. మిగతా 15 నిముషాలలో సీరీయల్ ని సాగదీయడానికి వీలయినంత కృషి చేస్తుంటారు. కింద గది లో ఫోన్ మోగుతూంటుంది. 26 మెట్లున్న మేడ దిగడానికి మెట్టుకి 30 సెకన్ల చొప్పున 13 నిముషాలు పడుతుంది. ఇంకో 2 నిమిషాలు ఫోన్ తీయాలా? లేదా? అని పాత్ర తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపుల కెమేరాని ఎడం వైపు పది నుంచి సార్లు, కుడి వైపు నుంచి పది సార్లు , పై నుంచి పది సార్లు , కింద నుంచి పది సార్లు చూపిస్తారు. ఇన్ని సార్లు చూసి మనకి కళ్ళు తిరుగుతుండగా పెద్ద సౌండ్ తో "టైటిల్ సాంగ్" మొదలు అవుతుంది. "తరవాయి భాగం రేపు" అన్నమాట. ఫోన్ తీస్తాడా? తీయడా? అనే సస్పెన్స్ మనకి బోనస్. ఈ సస్పెన్స్ తో ఈ సారి మనకి బుర్ర కూడా తిరుగుతుంది. ఇంకా మనం బతుకుంటే తర్వాత సీరీయల్ చూసె సహనం సారీ!! కెపాసిటీ మనకి వచ్చేసినట్టే. అత్త కోడళ్ళ సీరియల్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు.

మన టి.వి. వీక్షకుల సహనం చూసిన తరవాత నాకు కూడ "జీడి పాకం" అనే సీరియల్ తీద్దామని ఉంది !!! కధ కొంచెమైనా లేకుండా సీరియల్ ని "బబుల్ గం" లాగా సాగదీసే సామర్ధ్యం ఉన్న ఉత్సాహవంతులైన రచయితలకి ఇదే నా ఆహ్వానం. ఇంతకు ముందు "జీళ్ళు" తయారుచేసిన వారికి ఫ్రిపరెన్స్ ఇవ్వబడును.

24, జులై 2008, గురువారం

"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?

కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు.

బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.
బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు.

లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.

ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ "OK" చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు.

ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు.

ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు.

అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి
"అర్జునా !
బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!
బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!
మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.
నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"
అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు.

అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు.

ఈ కథ పది సార్లు పారాయణ చేసిన వారికి పది బగ్గులు తక్కువ వస్తాయి !!!

గమనిక : సరదాకి రాసింది మాత్రమే!

23, జులై 2008, బుధవారం

తెలుగు వారిలో నాకు నచ్చని ఒకే ఒక్క పధ్ధతి

ఇది సుమారు 5 ఏళ్ళ కిందట జరిగిన సంఘటన. అప్పుడు నేను బెంగుళూరులో ఒకానొక సాప్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం వెలగబెడుతున్నాను. మా టీంలో ఇద్దరు బెంగాలీలు ఉండేవాళ్ళు. మాములుగా మేమందరం మాట్లాడుకొనేప్పుడు అందరికి అర్ధం కావటనికి ఇంగ్లిషులోనో, హిందిలోనో మాట్లాడేవాళ్ళం. కాని ఆ రోజు వాళ్ళకేమైందో తెలియదు గాని బెంగాలీలొ ఏదో చాలా సీరియస్ గా చర్చించుకొంటున్నారు. కాసేపు చూసా, మన వాళ్ళూ మేటర్ ఏమి లీక్ చేయడం లేదు. మనకసలే ఉత్సహం ఎక్కువ కదా! ఉత్సుకత ఆపుకోలేక "మేటర్ ఏంటి?" అని ఇంగ్లిషులో అడిగేసాను.

ఇంతకీ మేటర్ ఏంటంటే, మన వాళ్ళు అంతకుముందు ఆదివారం ఏదో బెంగాలీ పండగ ఉండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అతను కూడా బెంగాలినే. వీళ్ళకొచ్చిన సమస్య అతని వల్ల కాదు. 7 ఏళ్ళు అయిన నిండని వాళ్ళ అబ్బాయి వల్ల. మహా అయితే బాగా అల్లరి చేసి ఉంటాడు అంతకుమించి అంత చిన్న బుడతడు వీళ్ళకేమి సమస్య తేగలడు అనుకుంటున్నారా? కాని తెచ్చాడు. ఆ బుజ్జాయి తన ముద్దు ముద్దు మాటలతో "అంకుల్ హౌ ఆర్ యు?" , "హౌ డు యు డు" ఇలా తప్పిస్తే ఒక్క బెంగాలి మాట కూడ మాట్లాడ లేదంట. అంతే అంత చిన్న విషయానికి వీళ్ళు అగ్గి మీద గుగ్గిలం అయిపోయి మాతృభాష రాని వాడు ఏమి బాగుపడతాడు. చిన్న పిల్లాడు వాడికి తెలియదు తల్లిదండ్రులు అయినా చెప్పచ్చు కదా ఇలా సీరియస్ అయిపోయారు. (నాకు బెంగాలీ రాకపోవడం వల్ల తెలియలేదుగాని వాళ్ళు మాట్లాడుకున్న వాటిలో బూతులు కూడా ఉన్నాయట).

అసలూ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా?
కూల్ గా అదే ఈ సీన్ లో తెలుగు వాళ్ళని ఊహించుకోండి ( ఎవరి టార్టాయిస్ లు వాళ్ళే తెచ్చుకొని కళ్ళ ముందు గుండ్రం గుండ్రం గా తిప్పుకోగలరు)

1. "మా అమ్మాయికి అసలు తెలుగే రాదు. ముద్దు ముద్దు గా ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో" అని ప్రోత్సహించే తల్లిదండ్రులు.
2. "మా అబ్బాయికి తెలుగు చదవటం, రాయడం రాదు తెలుసా! అసలు మనం కూడా వాడితో ఇంగ్లిష్ లో మాట్లాడలేము" అనే పొగిడే నాన్నలు.
3. "మా అమ్మాయికి అసలు మాట్లడటం "మమ్మీ! మమ్మీ!" అని ఇంగ్లిష్ లోనే మొదలుపెట్టింది" అని మురిసెపోయే అమ్మలు.

మీక్కూడా వీటిలో ఏదో సీన్ కనిపించిందా? అనుమానం లేదు తెలుగు వాళ్ళు ఎవరికైనా ఇలాగే కనిపిస్తుంది. అసలు మనకి భాషాభిమానం చాలా చాలా తక్కువ. తమిళులు, బెంగాలీలు, అంతెందుకు వేరే ఏ భాష వాళ్ళతో పోల్చినా మన వాళ్ళ భాషాభిమానం తక్కువే అని అనిపిస్తుంది. వీళ్ళ నుంచి భాషాభిమానంలో మనం నేర్చుకోవల్సింది చాలా ఉంది.

అందుకే తెలుగు వాళ్ళు అందరు నన్ను తిట్టినా సరే "తెలుగు వాళ్ళలో నాకు నచ్చని ఒకే ఒక పధ్ధతి - భాషాభిమానం లేకపోవడం".

మనం అయినా మన పిల్లలకి అయినా తెలుగులో మట్లాడటం, చదవటం,రాయడం నేర్పించి మన మాతృభాషని కాపాడుకుందాం. సాధ్యమైనంతవరకు తెలుగు వాళ్ళందరం తెలుగులోనే మాట్లాడుకుందాం. వాళ్ళకి వచ్చినా రాకపొయినా పరాయి భాష వాళ్ళతో కూడా తెలుగులోనె మాట్లాడదాం (తమిళం వాళ్ళ లాగా. నిజంగా భాషాభిమానానికి రేటింగ్ ఇస్తే వీళ్ళు మొదటి స్థానం లో ఉంటారు. మన వాళ్ళ ఎక్కడ ఉంటరో చెప్పక్కరలేదు). నా లాంటి బ్రహ్మిలకి, ఇంకా కొంతమందికి అన్ని వేళలా ఆఫీస్ లో తెలుగు మాట్లాడటం సాధ్యం కాకపోవచ్చు కాని సాధ్యమైనంతవరకు తెలుగులోనే మాట్లాడదాం.

మన భాషని కాపాడుకోవడానికి ఈ చిన్న చిన్న పనులు మనం పాటిస్తే చాలు, పెద్ద పెద్ద ఉద్యమాలు అవసరం లేదు. ఏమంటారు?

గమనిక:
1. ఈ టపా సరదాకి రాసింది కాదు.
2. నిజం చెప్పాలి అంటే ఈ టపా కొంచెం ఆవేశం గానే రాసాను. ఏమైనా తప్పులు దొర్లి ఉన్న, ఎవరినైనా నొప్పించినా క్షమించగలరు. తెలియజేయండి. సరిదిద్దుకుంటాను.

blogger templates 3 columns | Make Money Online