5, ఆగస్టు 2008, మంగళవారం

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందా!!

ఒక రోజు ఉదయం ఆఫీస్ కి బయలుదేరాను. అప్పటికి ఒన్-వే టైం దాటిపోవడం తో, అమృత ఘడియలు అంతం అయిపోయి, రాహుకాలం & దుర్మూహర్తం కలసి కట్ట కట్టుకొని మొదలయ్యాయి. మా ఆఫీస్ కి వెళ్ళాలి అంటే దారిలో హైటెక్ సిటీ లోకల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సొరంగం దాటాలి. ఇక్కడికి రాగానే నాకు ఫ్లాష్-బాక్ లో వైజాగ్ నుంచి అరకు రైలు లో వెళ్ళినప్పుడు దారిలో వచ్చే సొరంగాలు గుర్తుకు వస్తాయి. ఆ సొరంగాలే కొంచెం నయమేమో, ఈ సొరంగం దాటడానికి ఎంత టైం పడుతుందో ఆ బ్రహ్మకి, ఈ బ్రహ్మికీ కూడా తెలియదు. భాగ్యనగరంలో ఏ మూలన చిన్న చినుకు పడినా ఇక్కడ పెద్ద ఈత కొలను తయారవుతుంది. అందులో కార్లు, బైకులు ఈదుకుంటూ వెళ్ళాలి.

ఈ పద్మవ్యూహం లో ద్విచక్ర వాహనంతో దూరటానికి నాకే కంత లేదంటె నా మెడకో డోలు అదనం. ఈ డోలునే మా ఆఫీస్ లో లాప్ టాప్ అంటూ ఉంటారు. ఎలగోలాగా కష్టపడి ఈ సొరంగాన్ని తొందరగా ఒక గంటలోనే దాటేసా. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, క్లచ్ తోను, బ్రేక్ తోను, లాప్ టాప్ బేలన్స్ చేస్తూ బిజీగా ముందుకు వెళ్తూండగా, నా ఆనదాన్ని భగ్నం చేస్తూ అకస్మాత్తుగా గా వర్షం మొదలయింది. ఏ చెట్టు కిందన్న నిలబడదాం అనుకున్నా ఆ రోడ్డులో ఒక్క చెట్టు కూడా ఉండదు. సగం పూర్తి అయినా ఓవర్ బ్రిడ్జ్ కూడా, మోడరన్ ఆర్ట్ లా, ఎక్కడ మొదలయ్యి, ఎక్కడ దిగుతుందో అర్ధం కాకుండా ఉంటుంది. ఇలా ముందుకు, వెనకకు కదలలేక లాప్ టాప్ తడవకుండా అవస్థ పడుతున్న సమయం లో, నా మనసు ఎంత వద్దంటున్న వినకుండా "దున్నపోతు మీద వర్షం పడినట్టు" లాంటి సామెతలన్ని గుర్తు చేయడం మొదలుపెట్టింది. నా మనసుని బుజ్జగించి "వానా వానా వందనం" అని పాడుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయాను.

ఉదయాన్నే ఈ దుశ్శకునాలేంటో అనుకుంటూనే ఆఫీస్ కి చేరుకున్నా. ఆఫీస్ కి చేరగానే ఆ రోజు మా టీం మెంబర్ వెంకి (వెంకటేశ్వర రావు) గాడి పెళ్ళి ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. "కష్టాల్లో తోడు నిలిచే వాళ్ళే నిజమైన స్నేహితులు", కాబట్టి మేమందరం స్నేహధర్మాన్ని పాటించటం కోసం వెంకి పెళ్ళికి తప్పనిసరిగా వెళ్ళాలని ముందే అనుకున్నాం. పొద్దున్న వర్షం ఎఫెక్ట్ డి.టి.ఎస్ లెవెల్ లో కనిపించటం తో, కారు లో వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. అనుకోకుండా మా డేమేజర్ సారీ! మా మేనేజర్ సుబ్బి ( సుబ్బా రావు ) ఆ రోజు కారు తీసుకువచ్చాడు. వాడు డ్రైవింగ్ నేర్చుకొని ఎంతో కాలం కాలేదు. వాడి డ్రైవింగ్ ప్రావీణ్యాన్ని చూపించాలని మాంచి ఉత్సాహం తో ఉన్నాడు. వాడి మనసులో ఇంత కుట్ర ఉందని నాకు తెలియదు.

కారులో వెంకి గాడి పెళ్ళికి బయలుదేరాం. దూరంగా హై టెక్ సిటీ సిగ్నల్, క్రికెట్ వరల్డ్ కప్ లా పచ్చగా వెలుగుతూ వూరిస్తూ కనపడింది. సిగ్నల్స్ క్రాస్ చేస్తామా? లేదా? అని అందరం టెన్షన్ లో ఉన్నాం. సుబ్బు గాడు టెన్షన్ తో గంగూలీ లాగా గోళ్ళు కొరుకుతున్నాడు. ఫైనల్ దాకా వచ్చేసాం, విజయం మనదే అనుకుంటుండగా, అకస్మాత్తుగా ఎవడో "పాంటింగ్" లాగా అడ్డుపడ్డాడు. ఫాం లో ఉన్న పాంటింగ్ లాగా రెచ్చిపోయి, మా కార్ ని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్ళి మలుపు తీసుకున్నాడు. వరల్డ్ కప్ చేజారిపోయింది. రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళి 4 సంవత్సరాలు వేచి చూసి సిగ్నల్ క్రాస్ చేసాం. సుబ్బు కార్ స్పీడ్ పెంచాడు. ఫరవాలేదు బానే డ్రైవ్ చేస్తున్నాడే అనిపించింది.

ఇంతలో ఎవడో అకస్మాత్తుగా అడ్డం రావడంతో సడెన్ బ్రేక్ వేసాడు. పెద్ద శబ్దం తో కార్ ఆగింది. వాడిని తిట్టటం అయ్యాక మా వాడు సంచలన ప్రకటన ఒకటి చేసాడు. "కార్లని సరిగా డిజైన్ చేయలేదయ్యా! ఆర్కిటెక్చర్ అంత బాగుండదు. బ్రేకుకి, ఏక్సిలేటరుకి ఒకే కాలు ఉపయోగించాలి. పొరపాటున బ్రేక్ బదులు ఏక్సిలేటర్ తొక్కితే ప్రాబ్లెం కదా?!" అన్నాడు.
అంటే దాని అర్ధం ఏంటి? పొరపాటున బ్రేక్ బదులు ఏక్సిలేటర్ వాడితే ఆర్కిటెక్చర్ ప్రాబ్లెం నాది కాదు అనా? ఆర్కిటెక్చర్ బాలేని ప్రాజెక్ట్ ఇస్తే మేము వర్క్ చేయలేదా? నీ ఆర్కిటెక్చర్ ప్రాబ్లెం దొంగలెత్తుకెళ్ళా? ఏదైనా పొరపాటు జరిగితే ఇదే విషయాలు వూచలు లెక్కపెట్టుకుంటూ ఆలోచించాలి.

ఆ దెబ్బ తో, మేమందరం అటెన్షన్ లోకి వచ్చేసాం. మా భయానికి ట్రాఫిక్ జాం తోడయ్యింది. ముందు కి వెళ్ళడానికి లేదు. వెనక్కి వెళ్ళడానికి లేదు. సుబ్బు గాడు ఫస్ట్ గేర్ లో మెల్లి మెల్లిగా కార్ ని ముందుకు నడిపిస్తున్నాడు. అప్పటికి గంట నుంచి ఫస్ట్ గేర్ లోనే నడిపిస్తూ, క్లచ్ మీద కాలు ఉంచి, తీసి విసుగొచ్చిన సుబ్బు గాడు "నా వల్ల కాదు. నాకు కాళ్ళు నెప్పెడుతున్నాయి. నేను కార్ వదిలేసి వెళ్ళిపోతా" గోల చేయడం మొదలెట్టాడు. అన్యాయం. అక్రమం. కుట్ర. ఇలాగే ముందుకి, వెనకకి వెళ్ళడానికి లేని పరిస్థితిలో ఉన్న ప్రాజెక్ట్ ని వదిలి పెట్టి నేనుప్పుడైనా వెళ్ళిపోయానా? అమ్మో! ఇప్పుడు నన్ను గాని డ్రైవ్ చెయ్యమంటే నా పరిస్థితి ఏంటి? నాకు లైసెన్స్ అయితే ఉంది కాని డ్రైవింగ్ రాదు ( ష్! ఎవరితోను చెప్పకండే! ). కోడింగ్ అయితే గూగుల్ లో వెతికి కాపీ పేస్ట్ చేయగలను గాని, డ్రైవింగ్ కాపీ పేస్ట్ చేయలేను కదా (అలాంటి వెబ్ సైట్లు ఏమైనా ఉంటే చెప్పండి. ఎంత ఫీజు అయినా జాయిన్ అయిపోతా ). ఉదయాన్నే కనిపించిన దుశ్శకునాల అర్ధం, పరమార్ధం ఏంటో నాకప్పుడు అర్ధం అయింది. ఏదో రకంగా మా మేనేజర్ గారినే, ఆ వీకెండ్ ఆఫిస్ కి వచ్చి వర్క్ చేస్తామని, బోనస్ అడగమని, అదని, ఇదని చెప్పి డ్రైవింగ్ కి ఒప్పించేప్పటికి మా తల ప్రాణం తోకకి, తోక ప్రాణం తలకి రెండు, మూడు రౌండ్లు కొట్టింది.

ఇలా అడ్డంగా అడ్డొచ్చే ఆటో వాళ్ళని తిట్టుకొంటూ, ఫోన్ మాట్లాడుకొంటూ రోడ్డు దాటే "సైంధవులని" దాటుకుంటూ, రాంగ్ రూట్లొ ఎదురొచ్చి మనమే రాంగ్ రూట్లో వచ్చామని భ్రమింపచేసే రాంగ్ రూట్ గాళ్ళని ఎదుర్కుంటూ, రోడ్డు మధ్యలోకొచ్చిన తర్వాత వెళ్దామా? వద్దా? అని ఆలోచించే మేధావులని ఆశ్చర్యంగా చూస్తూ, అప్పుడప్పుడు ఎద్దుల బండిలో వెళ్ళే వాళ్ళని చేజింగులు చేస్తూ, ట్రాఫిక్ జాములు, సిగ్నల్సు అన్ని దాటుకొని పెళ్ళికి వెళ్ళేప్పటికి మాకు సప్త సముద్రాలు దాటి భైరవ ద్వీపం లో ఉన్న చిలకని, ఆ చిలకలో ఉన్న మాంత్రికుడి ప్రాణాన్ని పట్టుకొన్నంత ఆనందం కలిగింది. కార్ దిగీ, దిగగానె ముందు అందరం వరద బాధితుల్లా అందరం భోజనానికి పరిగెట్టాం. అసలే బయలుదేరి చాలాసేపు అయిందేమో విపరీతమైన ఆకలి. లేట్ గా వస్తే తినడానికేమి ఉండదేమో అన్న డౌటు. పెళ్ళి వాళ్ళు, అప్పుడే పాత్రలు అన్నీ కడగటానికి రెడీ అయ్యారు. పాపం మా మొహాలు చూసి వాళ్ళు కొంచెం జాలి పడి, ఏదో మిగిలింది కొంచెం మాకు పెట్టారు. భోజనం కాగానే అందరం మా వెంకి ని పరామర్శించటానికి సారీ! పలకరించటానికి వెళ్ళాం. మనసులో బాధగానే ఉన్న, వాడు పాపం నవ్వుతూనే పలకరించాడు.

వాడి బాధ ఏమో కాని, మా వెంకి గాడి పెళ్ళి సుబ్బి గాడి చావుకి, మా చావుకి వచ్చినట్టనిపించింది.

22 Comments:

కత్తి మహేష్ కుమార్ said...

చాలా బాగుంది.నిజంగానే మీ వెంకి పెళ్ళి సుబ్బి,మీ చవుకొచ్చిందన్నమాట!

క్రాంతి కుమార్ మలినేని said...

kekakekakekakekakekakakekaekka

మీనాక్షి said...

అయ్యో అయ్యో అయ్యోఅయ్యొ
చో చో చో ఎన్ని కష్టాలో ఈ బ్రహ్మీ గారికి.
ఇంతకీ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా లేదా..
లాపి ని మెడలో డోలుతో భలే పోల్చారు మాష్టారు..
:)))))))))))))

Niranjan Pulipati said...

అదరగొట్టారు :) ' ఆర్కిటెక్చర్ బాలేని ప్రాజెక్ట్ ఇస్తే మేము వర్క్ చెయ్యలేదా ? ' అవును మరి అసలు ఆర్కిటెక్చరే లేని ప్రాజెక్ట్ ఇచ్చినా వర్క్ చేస్తున్నాము కదా...

చైతన్య said...

సూపర్ గురువు గారు.

అశ్విన్ బూదరాజు said...

బావుంది

Shankar Reddy said...

బావుంది

ప్రతాప్ said...

అమ్మో అమ్మో..
ఎన్ని కష్టాలో పాపం.

సుజాత said...

ఆ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రోడ్డు గురించి నేనే ఒక టపా రాద్దామనుకుంటున్నాను, ఇంతలో మీరు వదిలారు. చక్కగా ఉన్నదున్నట్టు వర్ణించారు సుమా! మరి మలేషియన్ టౌన్ షిప్ దగ్గర స్కేటింగ్ చేస్తూ కార్లకి అడ్డం వచ్చే పిల్లకాయల గురించి మర్చిపోయారనుకుంటా! రోజూ 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామే అక్కడ!

ఫ్లై ఓవర్ నిర్వచనం చాలా నచ్చింది. ఇంకో అద్భుతమైన విషయం, నాకెంతో నచ్చిన లాజిక్, నేనెంతో వేదన పడే విషయం...."ఆక్సిలేటర్ కి, బ్రేకు కీ ఒకటే కాలు ఉపయోగించడం"
ఇందులో ఉన్న confusion ఇంకెందులోనూ కనిపించక డ్రైవింగే వదిలేసాను.

శ్రీవిద్య said...

Too Good....... :)
చాలా బావుంది.హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర నాలుగేళ్ళు ఆగాల్సి రావడం ఇంకా బావుంది.అక్కడి సిగ్నల్ దాటాలాంటె కనీసం నాలుగు రౌండ్లు ఆగాల్సిందే.. అంత కన్నా నడిచివెళ్ళిపోవడం నయం అనిపిస్తుంది నాకు.

MURALI said...

మనవాళ్ళు కమంటేప్పుడు మరిచరు. అసలు ఇది బాగా గుర్తించాల్సిన విషయం కదా.

"కష్టాల్లో తోడు నిలిచే వాళ్ళే నిజమైన స్నేహితులు"

అశ్విన్ బూదరాజు said...

మనసులో బాధగానే ఉన్న, వాడు పాపం నవ్వుతూనే పలకరించాడు.బావుంది

ప్రతాప్ said...

పాపం, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది, అలానే మీ టపా మాకు నవ్వు తెప్పించింది.

అజ్ఞాత said...

"కష్టాల్లో తోడు నిలిచే వాళ్ళే నిజమైన స్నేహితులు", కాబట్టి మేమందరం స్నేహధర్మాన్ని పాటించటం కోసం వెంకి పెళ్ళికి తప్పనిసరిగా వెళ్ళాలని ముందే అనుకున్నాం" అన్న డైలాగ్ మాత్రం అదిరింది!

ప్రసాదం

sujji said...

baagundandi........ bhrammi garu......

రాధిక said...

అయ్యోఅయ్యొ ఎన్ని కష్టాలో. అదరగొట్టారు :)

చంద్ర మౌళి said...

మీకు బొత్తిగా మొహమాటం లేదేం! ఇంతలా నవ్విస్తున్నారు?

చంద్ర మౌళి said...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
Phani Kajuluri said...

Chala Bagundi....

Sirisha said...

hahahaha.....:)) ammo .....

na valla kadu na kallu noppi pudutunnayi...super undhi....

very nice blog

Nagaraju said...

అదిరిందయ్యా ... అన్నయ్య

Boss said...

nenu chala sarlu balaya..aa road to..ippatikina putayinda..aa flyover..

blogger templates 3 columns | Make Money Online