పూత రేకులకి ఆత్రేయపురం ఫేమస్. కాజాలకి కాకినాడ ఫేమస్. లడ్డూలకి బందరు ఫేమస్. బిర్యానికి మన భాగ్యనగరం ఫేమస్. బిసి బేళి బాత్ కి బెంగుళూరు ఫేమస్. ఇలా కొన్ని కొన్ని పదార్ధాలకి కొన్ని కొన్ని ప్రాంతాలు ఎలా ఫేమస్సో మా బామ్మ (మా నాయనమ్మ) బెండకాయ పులుసుకి అంత ఫేమస్సు. ఇప్పుడు ఏ లోకాన బెండ కాయ పులుసు వండుతుందో తెలియదు కాని, బెండ కాయ పులుసు మాత్రం కత్తిలా చేసేది. చూడగానే నొట్లో నీళ్ళూరేవి (కొంచెం కారంగా ఉండేది కాబట్టి తింటే కంట్లో కూడా నీళ్ళొచ్చేవి).
బిర్యాని, బొమ్మిడాయల పులుసు, బిసి బేళి బాత్, బందరు లడ్డు, మా నానమ్మ చేసిన బెండకాయ పులుసు అన్ని ముందు పెట్టి ఏది కావాలని అడిగితే చటుక్కున బెండకాయ పులుసుకే నా వోటు వేసే వాడిని. అంత బాగుండేది. ఆ పులుసు వెనక ఏ రహస్య ఫార్ములా ఉందో తెలియదు గాని అంత బాగా వండటం ఇంకెవ్వరి వల్లా అయ్యేది కాదు. మా అత్తలకి, మా అమ్మ కి, మా పిన్నులెవ్వరికి కూడా అంత బాగా వండటం వారసత్వంగా అన్నా రాలేదు.
నా పేరు మా నానమ్మ పేరుతో కలిపి పెట్టటం వల్లనో, లేక వంశోధ్ధారకుడనో, మొత్తానికి మా నానమ్మకి నేనంటే చాలా ఇష్టం. బెండకాయ పులుసు వండినప్పుడల్లా మనకి "స్పెషల్" గా మా ఇంటికి పార్సిల్ వచ్చేది. ఇలా సంతోషంగా మూడు బెండకాయలు ఆరు పులుసులుగా రోజులు గడిపేస్తున్నాను.
అయితే - అన్ని రోజులు ఒకేలా ఉండవు
నేను కాలేజ్ చదువుల కోసం వేరే ఊరు వెళ్ళవలిసి వచ్చింది. రెసిడెన్షియల్ కాలేజ్ కాబట్టి హాస్టల్ లోనె ఉండేవాళ్ళం. మా హాస్టల్లో తిండి మాత్రం భలే అద్భుతం గా ఉండేది. ఆ తిండికి మా నాలుక మీదున్న రుచి మొగ్గలన్ని అంతరించి పోయాయి. రుచికరమైన తిండికి బాగా మొహం వాచిపోయాం. ఎంతగా మొహం వాచిపోయామంటే ఎవడైనా ఇంటి దగ్గర నుంచి వచ్చాడనే తెలిస్తే చాలు, కరువొచ్చినప్పుడు దుకాణాల మీద పడి దోచుకునే వాళ్ళ లాగా వాడి మీద దాడి చేసి, ఇంటి దగ్గర నుంచి ఏమి తెస్తే అది క్షణాల్లొ గుటుక్కుమనిపించే వాళ్ళం. అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి. (ఏంటో ఈ మధ్య మా ఆఫీస్ కేంటీన్ వాడు కూడ మా హాస్టల్ ని పదే పదే గుర్తు తెస్తున్నాడు). ఈ బాధ పడలేక ఒక సారి ఇంటికి చెక్కేసాను. డైరెక్ట్ గా మా నానమ్మ దగ్గరికి వెళ్ళి బెండకాయ పులుసు వండించుకున్నా. వరదల్లో పులిహోర పొట్లం సంపాందించి తింటున్న వాడిలా, వారం రోజుల నుంచి అన్నం తిననని వాడిలా కంగారు కంగారు గా తినేసా. తినేసి సంతోషంగా ఊరు మీదకి బలాదూరు బయలుదేరా.
బొత్తిగా అత్తా కోడళ్ళ సీరియల్సు చూసే అలవాటు లేకపోవడం వల్లా, అజ్ఞానం తోను నేను చేసిన చారిత్రాత్మక తప్పిదం ఏంటో నాకు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అర్ధం అయింది. నాయనమ్మ ఇంటికి వచ్చి మా అమ్మతో నువ్వు నా మనవడికి సరిగా వండి పెట్టడం లేదు అందుకే నా దగ్గరికి వచ్చి బెండకాయ పులుసు చేయమని అడిగాడు అని దెప్పింది. అంతే మాట మాట పెరిగింది ఇద్దరి మధ్య పచ్చని బెండకాయ వేస్తే బగ్గున మండింది. యుధ్ధ నగారా మోగింది. చరిత్రలో ఒకటవ బెండకాయ యుధ్ధం మొదలయింది.
నానమ్మకు తోడుగా 2 మిత్ర దేశాలు(ఆ పక్కింటి వాళ్ళు), అమ్మకు తోడుగా 2 మిత్ర దేశాలు (ఈ పక్కింటి వాళ్ళు) సైన్యాన్ని మొహరించాయి. ఒకరి మీద ఒకరు యుద్ధాస్త్రాలు సంధిస్తున్నారు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. "బెండకాయ పులుసులో తుఫాను" అంటే ఇదేనేమో? వెంటనే ఇటువంటి విషయాలు పరిష్కరించడం లో ఆరితేరిన ఐక్య రాజ్య సమితి (మా నాన్న) ని రంగలో దించా. ఐ.రా.స. జ్యోక్యంతో ఇరు పక్షాలు యుధ్ధాన్ని విరమించాయి. ఆ విధంగా ఒకటవ బెండకాయ యుధ్ధానికి తెరపడింది.
ఆ తర్వాత తినాలనిపిస్తే నన్ను అడగచ్చు కదాని మా అమ్మ నాకు "ఫుల్లు" క్లాసు .అలాంటి తప్పు మళ్ళీ ఇంకెప్పుడు చేయకుండా మరిన్ని యుధ్ధాలు జరగకుండా జాగ్రత్తపడ్డాను. కాని బామ్మ వండిన బెండకాయ పులుసుని మనం వదుల్తామా? ఈ సారి తినాలనిపించినపుడు మా తాతతో బజారుకు వెళ్ళి బెండకాయలు కొనిపించేవాడిని. అంతే. యధావిధిగా మన "స్పెషల్ పార్సిల్" రెడీ !!
అలా నాకు మా నానమ్మ వండిన బెండకాయ పులుసు ఎంత ఇష్టం ఏర్పడిపోయింది అంటే. మా నానమ్మ లోకాన్ని వదిలి వెల్లిపోయిన తర్వాత నేను కూడా బెండకాయ పులుసుని వదిలేసాను. ఇంకెప్పుడు తినలేదు.
20, ఆగస్టు 2008, బుధవారం
అమ్మ, బామ్మ, బెండకాయ పులుసు
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
11 Comments:
అన్ని సార్లు బెండకాయ పులుసు తిన్నారా? అయితే మీకు లెక్కలు బాగా వచ్చుండాలే. టపా బ్రహ్మాండం. మీ బామ్మకి జై. మీ శైలికి జైజై.
అదిరింది. బెండకాయ యుద్దం భలే వుంది.
Too good.. బెండకాయ యుద్దం సూపరో సూపర్
మలి నాకేది బెండకాయ పులుచు
అమ్మ నాన్న బామ్మ తాతయ్య ఇక్కడ అందరూ అన్ని బాగనే వున్నాయి కాని
నాకు బెండకాయ పులుచు పెట్టటం లేదు ఉహు ఉహు ఉహు ఉహు బేఏఏఏ
బావుంది బెండకాయల పులుసు తినే దానికి మీరు కనుక్కొన్న కొంగొత్త ఐడియా (జీవితాన్ని మార్చలేదు గా కొంపదీసి).
హా..హా..హా...పులుసులో తుఫానా?కేక
నాకు బె0డ్కాయ అంటే అస్సలు ఇష్టం లేదు.ఈ మధ్యనే కాస్త వెపుడు తింటున్నాను.పులుసంటే ......అమ్మో నావల్ల కాదు.అందుకేనేమో నాకు లెక్కలు అంటే చాలా భయం
నిజమే! కొందరి చేతి మహిమే అంత.కాకరకాయనైనా కమ్మగా వండెయ్యగలరు.టపా మీ నాయనమ్మగారి బెండకాయ పులుసులా ఉంది.
అవునండీ. ఈ బామ్మలందరు పులుసులు బాగ పెడతారేమో, మా బామ్మ కూడా బెండకాయ పులుసు భలే పెట్టేది. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి స్వర్గం లో ఎక్కడో కర్రీ పాయింట్ పెట్టి ఉంటారు.
sir, mee article .... bendakaya pulusu nu maa 10.2.2013 andhra jyothy sunday book lo prachuristhunnaam. mee anumathi eeroju 4pm logaa pampandi.
- editor, sunday desk
sir, mee article .... bendakaya pulusu nu maa 10.2.2013 andhra jyothy sunday book lo prachuristhunnaam. mee anumathi eeroju 4pm logaa pampandi.
- editor, sunday desk
Post a Comment