7, ఆగస్టు 2008, గురువారం

తుఫాను

వర్షం పడుతున్నప్పుడు చూస్తే మీకేమనిపిస్తుంది? తడవాలనిపిస్తుందా? పడవలు చేసి ఆడుకోవాలి అనిపిస్తుందా? కిటికీ లోంచి వర్షాన్ని చూస్తూ వేడి వేడి వేరు శెనక్కాయులు తింటూ ఏదైనా పుస్తకం చదుకోవాలి అనిపిస్తోందా?

నాకు మాత్రం .......

****************************************************************************************************************************

అప్పుడు నేను 8 వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడంటె తగ్గిపోయింది కాని, నాకు అప్పట్లో క్రికెట్ పిచ్చి బాగానే ఉండేది ( నిజం చెప్పాలంటే అప్పట్లో మన వాళ్ళు బాగానే ఆడేవాళ్ళు). మన వాళ్ళు "టైటాన్ కప్" ఫైనల్ కి వచ్చారు. ఫైనల్ లో ప్రత్యర్ధి సౌత్ ఆఫ్రికా.

ఆ రోజు 1996 నవంబర్ 6. నేను, నాతో పాటు నా సహ క్రికెట్ పిచ్చోడు మా బాబాయి, వాళ్ళింట్లో మ్యాచ్ చూస్తున్నాం (పిచ్చి వాళ్ళలో సమైఖ్యత ఎక్కువుంటుంది !!!). మా బాబాయి వాళ్ళ ఇంటి వెనకాలే మా ఇల్లు కూడా ఉండేది. మ్యాచ్ ప్రారంభం అయింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు మొదట బ్యాటింగ్ చేసారు. ఎంత కొట్టారో గుర్తు లేదు కాని బాగానే కొట్టారు. మన వాళ్ళ బ్యాటింగ్ మొదలయింది. దాంతో పాటు బయట వర్షం కూడా మొదలయింది. వర్షం చినుకులు రాలినట్టు వికెట్లు కూడా టపా టపా రాలిపోతున్నాయి. కొట్టవలసిన స్కోరు ఇంకా చాలా ఉంది. బ్యాట్స్ మెన్ అందరు అవుతయిపోయారు. క్రీసులో కుంబ్లే, శ్రీనాథ్ ఉన్నారు. ఏమవుతుందో అన్న టెన్షన్. వర్షం ఇంకా పెద్దదయింది. కుంబ్లే, శ్రీనాథ్ ఇంకా ఆడుతున్నారు. అప్పుడె కరెంట్ కూడా పోయింది. గెలుస్తారన్న నమ్మకం లేకపోయినా మ్యాచ్ ఏమయిపోయిందో అన్న టెన్షన్. టి.వి. చూద్దామంటే కరెంట్ లేకుండా పోయింది. మేము వదులుతామా? రేడియో పెట్టి కామెంట్రీ వింటున్నాం. ఇక్కడ వర్షం ఇంకా విజృభించింది. అక్కడ కుంబ్లే, శ్రీనాథ్ పరుగుల వరద పారించారు. హుర్రే!! మనం ఫైనల్ గెలిచేసాం. "టైటాన్ కప్" మనదే.

మన వాళ్ళు ఫైనల్ గెలిచారో లేదో ప్రకృతి వైపరీత్యాలు మొదలయ్యాయి. వర్షం భారీ వర్షం గా, భారీ వర్షం తుఫాను గా మారింది. ఆ గాలికి మా బాబాయి వాళ్ళ ఇంటి పైన పెంకులు టపా టపా ఎగిరిపడసాగాయి. దీపావళికి 1000 వాలా బాంబులు పేల్చినట్టు గా ఉంది ఆ శబ్దం. కిటికి లోంచి చూస్తే సినిమాల్లో చుపించినట్టు చెట్లు గాలికి ఒక పక్కకి వంగిపోయి భయంకరంగా వూగుతున్నాయి. చాలా భయం వేసింది. ఎంత భయపడ్డానంటే మా బాబాయి వాళ్ళ ఇంటికి 4 అడుగుల దూరం లో ఉన్న మా ఇంటికి వెళ్ళడానికి కూడా నేను చాలా భయపడ్డాను. 2 గంటల తర్వాత వర్షం, గాలి కొంచెం తగ్గాయి. మా బాబాయి నన్ను ఇంట్లో దిగబెట్టాడు.

వర్షం బాగా తగ్గిన తర్వాత మా వీధి లో ఉన్న బాషా మేష్టారు నా వయసు కుర్రాళ్ళని కొంతమందిని పిలుచుకెళ్ళారు. పిలిచారు కాబట్టి వెళ్ళాం ఎందుకో నాకో తెలియదు. మేష్టారి వెనకాల మేమందరం టార్చి లైట్లు పట్టుకొని వీది మొదట్ళో ఉన్న "సూరమ్మ" గారింటికి వెళ్ళాం. మేష్టారు సూరమ్మ గారిని "ఏమ్మా ఇంట్లో అందరు బాగానే ఉన్నారు కదా? ఎవరికి ఏమి కాలేదు కదా?" అని వాకబు చేసారు. "అందరు బతికే ఉన్నారు కదామ్మా?" అనే అర్ధం ధ్వనించింది ఆ మాటల్లో. పరిస్థితి అంత సీరియస్ గా ఉన్న విషయం నాకప్పటికి వరకు అర్ధం కాలేదు. నా లాంటి పిల్ల కాకికేం తెలుసు తుఫాను దెబ్బ. అలా మా వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాని కనుక్కొని వచ్చాం. అదృష్టవశాత్తు మా వీధిలొ ఎవరికి ఏమి కాలేదు కాని ఇద్దరు గల్లంతయ్యారు.

మిగతా ప్రపంచం తో కమ్యూనికేషన్ తెగిపోయింది. వారం రోజులు కరెంట్ లేదు. కరెంట్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు సైతం ఎక్కడిక్కడ రోడ్డుకడ్డంగా పడిపోయాయి. నేను పెంచుకున్న మామిడి చెట్టు కూడా కూలిపోయింది. వర్షానికి ఇంట్లోకి నీళ్ళొచ్చాయి. 2 రోజులు నీళ్ళు అలాగే నిలిచిపోయాయి. నీళ్ళలో అక్కడక్కడ పాములు తిరుగుతున్నాయి. పురుగు, పుట్ర వస్తాయేమో అన్న భయం తో ఆ 2 రోజులు మా అమ్మ, నాన్న నిద్రపోకుండా కాపలా కాసారు. కిరోసిన్ దీపాలతో, ఇంట్లో ఉన్న కొద్ది పాటి వంట సామాగ్రి తో నెట్టుకొచ్చాం. ఇంట్లో ఉన్న సామాను కొద్ది రోజులకే సరిపోతుంది. అన్నీ పొదుపు గా వాడవలసి వచ్చింది. 4-5 రోజుల తర్వాత రేషన్ షాపులో కిరోసిన్, బియ్యం ఇచ్చారు.

2 రోజుల తర్వాత కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత నేను, మా బాబాయి వూరు ఎలా ఉందో చూడటనికి వెళ్ళాం. ఏ వీదిలో చూసినా మోకాలు లోతు నీళ్ళు, పడిపోయిన చెట్లు. తలకోన అడవి లో ఉన్నామా అనిపించింది. వందల ఏళ్ళ నాటి పెద్ద పెద్ద మర్రి చెట్లు కూడ కూలిపోయాయి. 10 రోజులు పరిస్థితి అలాగే ఉంది. 10 రోజుల తర్వాత స్కూలుకు వెళ్ళా. మా స్కూలు చూడగానే నిజంగా ఏడుపొచ్చింది. అప్పటికి 100 ఏళ్ళు నిండిన మా స్కూలు లో 1500 మంది విద్యార్ధులతో, 10 ఎకరాల్లో ఉండేది. తుఫాను దెబ్బతో తరగతి గదుల రేకులన్ని ఎగిరిపోయి, క్లాసు రూములు నిండా బురద, చెత్త చెదారం.. అబ్బా. అలాంటి స్కూలు ఎలా అయిపోయిందో తలుచుకుంటే ఇప్పటికీ అదోలా ఉంటుంది.

****************************************************************************************************************************

అందుకే వర్షాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. నవంబర్ 6 వస్తే నాకు వణుకు పుడుతుంది.

కొసమెరుపు: తుఫాను వచ్చిన 3 రోజుల తర్వాత మా తాతయ్య నాకు పదేళ్ళ కిందటి "కృష్ణా పత్రిక" ఒకటి చూపించారు. ఖచ్చింతంగా పదేళ్ళ కిందటిది అంటే 1986, నవంబర్ 6 తేదిన వచ్చిన పేపర్. ఆ పేపర్ చూడగానే నా భయం ఇంకా రెట్టింపయింది. ఆ రోజు పేపర్ హెడ్ లైన్ "దివి సీమ లో ఉప్పెన".

9 Comments:

చిలమకూరు విజయమోహన్ said...

దివిసీమలో ఉప్పెన 1976లో అనుకుంటాను.అప్పుడు నేను డిగ్రీ మొదటి సం.చదువుతున్నాను తిరుపతిలో.మా కాలేజీ నుంచి N.S.S వాలంటీర్లు కూడా పోయారు అక్కడికి సేవచేయడానికి.వాళ్ళు చెప్పారు అక్కడి హృదయవిదారక పరిస్థితి.నా హృదయాన్ని కలచివేసింది.ఇప్పటికి తలచుకుంటే నాకుకూడా చాలా భయమేస్తుంది తుఫాను వస్తే,ఆ పరిస్థితి గుర్తుకువచ్చి.

శ్రీ said...

కామెడీగా బ్లాగిపారేసే మీరు ఈసారి బరువుగా బ్లాగారు.అందరికీ వాన ఎన్నో పులకరింతలని గుర్తు చేస్తే మీ జ్ఞాపకాల్లో జడివాన కురవడం బాధాకరం.నాకూ దివిసీమ తుఫాను గుర్తుంది.

Ghanta Siva Rajesh said...

అవును నాకు కూడా బాగా గుర్తు ఉంది. నవంబర్ 6 1996. ఆరొజుని నెను ఎపటికి మర్చి పొలెను. మా ఇంటి పెంకులు కూడా లెచిపొయాయి. మా పకింటి వాళ పరిస్తితి మరి దారుణం.వాళు సహయం కొసం గంట సెపట్నిచి అరిస్తె గాని మాకు వినిపించలెదు. నెను మొదటిసారి సంపుర్ణ జాగారణ చెసింది కూడా ఆరొజె. మా ఆర్దిక వ్యవస్తని సంపూనం గా మర్చి వెసింది ఆ తుఫాను.

రాధిక said...

96 నవ0బర్ 6 నేనూ మర్చిపోలేను.మా ఇ0టి పక్కన వు0డె పాకల్లోని వాళ్ళ0దరూ ఆ రె0డు రోజులూ మా ఇ0ట్లోనే వున్నారు.4 రోజుల తరువాత స్కూలుకి వెళ్ళి పిల్లల0దరవా,టీచర్లు కలసి మా స్కూలుని మేమే బాగుచేసుకున్నాము.

RSG said...

అప్పుడు నేను కూడా నైన్తో ఎయితో అనుకుంటా... ఆరోజు నాకూ గుర్తుంది, మనవాళ్ళు కప్పుగెలిచినందుకే తుఫానొచ్చిందని అనుకున్నాం కూడా. మా ఊరికి పెద్దగా తగల్లేదులెండి తుఫాను దెబ్బ.

కల said...

వర్షం మోసుకొచ్చే పరిమళాలెన్నో.
కాని అతి సర్వత్ర వర్జయేత్ కదా. అందుకని వర్షం అతి అయితే తుఫాను. అందరికి ఆహ్లాదాన్ని పంచే వర్షం మీకు ఇలాంటి జ్ఞాపకాలు మిగిల్చినందుకు చింతిస్తున్నాను.

ప్రతాప్ said...

కొన్ని భయాలు కొందరికి అర్ధరహితంగా అనిపిస్తాయిగాని, అవి అనుభవించేవాళ్ళకి కానీ తెలియవు అవి మనస్సులోపల ఎంతగా తిష్ట వేసుకొని కుర్చుంటాయో. సరదా విషయాలు రాసే మీ దగ్గరినుంచి సీరియస్ విషయం రావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించినా, మీరు ఈ విషయాలు కూడా రాయగలరు అని నిరూపించుకొన్నారు. గుడ్.

ప్రియ said...

technical correction software engineer sir! The match in which Kumble n Srinadh played that well is between India n Australia. Kumble scored 19. Srinadh scored 36.

But your blog is wonderful. That was said to be a gruesome experience. My father told me.

అజ్ఞాత said...

బాగా రాశారు. మీ శైలి అలవోకగా చదివింపజేస్తుంది.

నేను హైదరాబాద్ వాస్తవ్యుడిని కాబట్టి, ఈ తుఫానుల భారి నుంచి తప్పించుకున్నాను. Of course, మత కలహాలూ, కర్ఫ్యూలూ తప్పలేదనుకోండీ. అది వేరే విషయం.

-మురళి

blogger templates 3 columns | Make Money Online