ఇది సుమారు 5 ఏళ్ళ కిందట జరిగిన సంఘటన. అప్పుడు నేను బెంగుళూరులో ఒకానొక సాప్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం వెలగబెడుతున్నాను. మా టీంలో ఇద్దరు బెంగాలీలు ఉండేవాళ్ళు. మాములుగా మేమందరం మాట్లాడుకొనేప్పుడు అందరికి అర్ధం కావటనికి ఇంగ్లిషులోనో, హిందిలోనో మాట్లాడేవాళ్ళం. కాని ఆ రోజు వాళ్ళకేమైందో తెలియదు గాని బెంగాలీలొ ఏదో చాలా సీరియస్ గా చర్చించుకొంటున్నారు. కాసేపు చూసా, మన వాళ్ళూ మేటర్ ఏమి లీక్ చేయడం లేదు. మనకసలే ఉత్సహం ఎక్కువ కదా! ఉత్సుకత ఆపుకోలేక "మేటర్ ఏంటి?" అని ఇంగ్లిషులో అడిగేసాను.
ఇంతకీ మేటర్ ఏంటంటే, మన వాళ్ళు అంతకుముందు ఆదివారం ఏదో బెంగాలీ పండగ ఉండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అతను కూడా బెంగాలినే. వీళ్ళకొచ్చిన సమస్య అతని వల్ల కాదు. 7 ఏళ్ళు అయిన నిండని వాళ్ళ అబ్బాయి వల్ల. మహా అయితే బాగా అల్లరి చేసి ఉంటాడు అంతకుమించి అంత చిన్న బుడతడు వీళ్ళకేమి సమస్య తేగలడు అనుకుంటున్నారా? కాని తెచ్చాడు. ఆ బుజ్జాయి తన ముద్దు ముద్దు మాటలతో "అంకుల్ హౌ ఆర్ యు?" , "హౌ డు యు డు" ఇలా తప్పిస్తే ఒక్క బెంగాలి మాట కూడ మాట్లాడ లేదంట. అంతే అంత చిన్న విషయానికి వీళ్ళు అగ్గి మీద గుగ్గిలం అయిపోయి మాతృభాష రాని వాడు ఏమి బాగుపడతాడు. చిన్న పిల్లాడు వాడికి తెలియదు తల్లిదండ్రులు అయినా చెప్పచ్చు కదా ఇలా సీరియస్ అయిపోయారు. (నాకు బెంగాలీ రాకపోవడం వల్ల తెలియలేదుగాని వాళ్ళు మాట్లాడుకున్న వాటిలో బూతులు కూడా ఉన్నాయట).
అసలూ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా?
కూల్ గా అదే ఈ సీన్ లో తెలుగు వాళ్ళని ఊహించుకోండి ( ఎవరి టార్టాయిస్ లు వాళ్ళే తెచ్చుకొని కళ్ళ ముందు గుండ్రం గుండ్రం గా తిప్పుకోగలరు)
1. "మా అమ్మాయికి అసలు తెలుగే రాదు. ముద్దు ముద్దు గా ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో" అని ప్రోత్సహించే తల్లిదండ్రులు.
2. "మా అబ్బాయికి తెలుగు చదవటం, రాయడం రాదు తెలుసా! అసలు మనం కూడా వాడితో ఇంగ్లిష్ లో మాట్లాడలేము" అనే పొగిడే నాన్నలు.
3. "మా అమ్మాయికి అసలు మాట్లడటం "మమ్మీ! మమ్మీ!" అని ఇంగ్లిష్ లోనే మొదలుపెట్టింది" అని మురిసెపోయే అమ్మలు.
మీక్కూడా వీటిలో ఏదో సీన్ కనిపించిందా? అనుమానం లేదు తెలుగు వాళ్ళు ఎవరికైనా ఇలాగే కనిపిస్తుంది. అసలు మనకి భాషాభిమానం చాలా చాలా తక్కువ. తమిళులు, బెంగాలీలు, అంతెందుకు వేరే ఏ భాష వాళ్ళతో పోల్చినా మన వాళ్ళ భాషాభిమానం తక్కువే అని అనిపిస్తుంది. వీళ్ళ నుంచి భాషాభిమానంలో మనం నేర్చుకోవల్సింది చాలా ఉంది.
అందుకే తెలుగు వాళ్ళు అందరు నన్ను తిట్టినా సరే "తెలుగు వాళ్ళలో నాకు నచ్చని ఒకే ఒక పధ్ధతి - భాషాభిమానం లేకపోవడం".
మనం అయినా మన పిల్లలకి అయినా తెలుగులో మట్లాడటం, చదవటం,రాయడం నేర్పించి మన మాతృభాషని కాపాడుకుందాం. సాధ్యమైనంతవరకు తెలుగు వాళ్ళందరం తెలుగులోనే మాట్లాడుకుందాం. వాళ్ళకి వచ్చినా రాకపొయినా పరాయి భాష వాళ్ళతో కూడా తెలుగులోనె మాట్లాడదాం (తమిళం వాళ్ళ లాగా. నిజంగా భాషాభిమానానికి రేటింగ్ ఇస్తే వీళ్ళు మొదటి స్థానం లో ఉంటారు. మన వాళ్ళ ఎక్కడ ఉంటరో చెప్పక్కరలేదు). నా లాంటి బ్రహ్మిలకి, ఇంకా కొంతమందికి అన్ని వేళలా ఆఫీస్ లో తెలుగు మాట్లాడటం సాధ్యం కాకపోవచ్చు కాని సాధ్యమైనంతవరకు తెలుగులోనే మాట్లాడదాం.
మన భాషని కాపాడుకోవడానికి ఈ చిన్న చిన్న పనులు మనం పాటిస్తే చాలు, పెద్ద పెద్ద ఉద్యమాలు అవసరం లేదు. ఏమంటారు?
గమనిక:
1. ఈ టపా సరదాకి రాసింది కాదు.
2. నిజం చెప్పాలి అంటే ఈ టపా కొంచెం ఆవేశం గానే రాసాను. ఏమైనా తప్పులు దొర్లి ఉన్న, ఎవరినైనా నొప్పించినా క్షమించగలరు. తెలియజేయండి. సరిదిద్దుకుంటాను.
23, జులై 2008, బుధవారం
తెలుగు వారిలో నాకు నచ్చని ఒకే ఒక్క పధ్ధతి
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9 Comments:
ఏమైనా బెంగాలీ వోళ్ళ ష్టైలే వేరు:)
అద్సరేగానీ, తెలుగుని గురించి పట్టించుకునే వాళ్ళ సంఘానికి ఆహ్వానం.
దీన్ని గనక ఇప్పటికే చూసుండకపోతే, ఒకసారి చూడండి.
mii aavESam samamjasamE.
1. "మా అమ్మాయికి అసలు తెలుగే రాదు. ముద్దు ముద్దు గా ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో" అని ప్రోత్సహించే తల్లిదండ్రులు.
2. "మా అబ్బాయికి తెలుగు చదవటం, రాయడం రాదు తెలుసా! అసలు మనం కూడా వాడితో ఇంగ్లిష్ లో మాట్లాడలేము" అనే పొగిడే నాన్నలు.
3. "మా అమ్మాయికి అసలు మాట్లడటం "మమ్మీ! మమ్మీ!" అని ఇంగ్లిష్ లోనే మొదలుపెట్టింది" అని మురిసెపోయే అమ్మలు.
ఈ మూడూ బావున్నాయి
దూరపు కొండలు బహు నున్నగా ఉన్నాయనుకుంటాంగానీ, అరవాళ్లు, బెంగాలీలూ, ఒకరనేంటి.. అందరిలోనూ ఉన్న జబ్బే ఇది - మనకొక్కరికే సొంతం కాదు. నా బహుభాషా మితృల సాక్షిగా ఇది నిజం. వాళ్లనే మాటేంటో తెలుసా? 'ఇద్దరు తెలుగు వాళ్లు కలిస్తే పక్కనున్నోడిని పట్టించుకోకుండా తెలుగులోనే మాట్లాడేసుకుంటారు'. వింతగా ఉంది కదా. ఇది మనల్ని గురించి మనమనుకునేదానికి పూర్తిగా విరుద్ధం!!
మనకు భాషాభిమానం తక్కువనే మీ అభిప్రాయం సరైనదే కావచ్చుగానీ మనవాళ్ళకున్న మంచి లక్షణమేమంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడి సమాజపరిస్థితికనుగుణంగా మారిపోవడం.అక్కడి ప్రజలతో బాగా కలిసిపోవడం అదే మనవాళ్ళు నేడు బాగా అభివ్రుద్ది చెందడానికి కారణమనుకుంటున్నాను.
కానీ భాషాభిమానం విషయంలో, ఆత్మగౌరవం విషయంలో కాస్తంత వెనకపడటం వాస్తవమే. మా కంపెనీ లో చాలమంది తెలుగువారికి తెలుగు చదవటం రాదు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమిటండి.
ఏదో కధలో, మన తెనాలి రామకృష్ణగారో మర్యాదరామన్నగారో ఓ పరదేశీయుడి మాత్రుభాష తెలుసుకోడానికి ఆయన్ని భయపెడితే ఆయన సొంతభాషలో అరిచేసాడట.
ఈ ఇంగ్లీషు వ్యాపకం ఎంత పెరిగిపొయిందంటే ఇప్పుడు ఈ ఉపాయం అంత తేలిగ్గా పనిచెయ్యదు.
మొన్నొసారి ఓ క్లబ్బులో చుసా.. ఓ ఈత నేర్పేవాడు పిల్లల్లో భయం పోగొట్టడానికి వాళ్ళని లోతు నీళ్ళలోకి విసిరెస్తున్నాడు. ఆ పిల్లల్లో 80% మంది ఏడుపుకూడా ఆగ్లములోనే ఏడుస్తున్నారు. !!! ఇంకేం చెప్తాం?
నేనూ అబ్రకదబ్ర గారి అభిప్రాయమే చెప్పదలచుకున్నాను. మనకి చాలా చాలా తక్కువ అంటూ ఉంటాం గానీ.. అన్ని భాషల్లోనూ ఈ బాధ ఉంది.
బాగా చెప్పారు .... నా మనసులోని బావన మీ టపా... ప్రతిబింబించింది . నాకు తెలిసి చాలామంది తెలుగు వాళ్ళే తెలుగు కన్నా పరభాష గొప్పదని పోగాదిడిన సందర్బాలు వున్నయి. ఇది చాల దారుణం , మన భాష కన్న తల్లి లాంటిది , దానికి తగిన గౌరవం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం .భారత దేశం లో తెలుగు వాడికి తప్ప అందరికి కొద్దో గొప్పో ప్రాంతీయ , భాషాభిమానం వుంటుంది.
కనీసం వాళ్ళని చూసి అయిన , మనం కొంత నేర్చు కోవాలి . దాని కోసం "అన్న" తారక రాముడు ప్రయత్నించినాడు . తర్వాత దాని జోలికి పోయిన వాడు లేదు .
Post a Comment