27, ఆగస్టు 2008, బుధవారం

EMI కట్టి చూడు

పాత కాలంలో కాబట్టి "ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు" అన్నారు. ఇల్లు కట్టటం చాలా కష్టం. పెళ్ళి చేయడం ఇంకా కష్టం అని అర్ధం. కాబట్టే పెళ్ళి చేయడం ఇల్లు కట్టటం తర్వాత వరుసలో వచ్చింది. అదే ఆ సామెత చెప్పిన మహానుభావుడు గనక ఇప్పుడు ఉండుంటే, వీటికన్న హోం లోన్ కి EMI కట్టటం చాలా కష్టం అని అర్ధం అయ్యి "EMI కట్టి చూడు" అనే వాడు. మనిషికి కావల్సిన రోటి, కపడా, మకాన్ ల లో చివరిదానిని సంపాదించడం ఎంత కష్టమో తెలియజేసేవాడు.

అసలు ఇల్లు కొన్నప్పుడయితే నా ఆనందానికి అవధులు లేవు. ప్రైం లొకేషన్ లో మంచి ఇల్లు కొనేసానన్న సంతోషం నన్ను నిలవనీయలేదు. మన ముందు తరం వాళ్ళకి ఇల్లు కొనేసరికి రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసేది, అదే నేనైతే పిన్న వయసులోనే ఇల్లు కొనేసి ఒక ఇంటి వాడినయిపోయాను అని గొప్పగా ఫీల్ అయిపోయి, కొన్నాళ్ళు నేల మీద కాకుండా గాల్లోనే నడిచా. కాని పైన దేవుడు ఉంటాడు, కింద చిదంబరం, RBI వాళ్ళు కూడా ఉంటారు కదా. వీడు ఇంత ఆనందంగా ఎందుకు ఉండాలి అని అనుకున్నారేమో, RBI వాడు వడ్డీ రేటు పెంచుదాం అనుకున్నాడు. పైనుంచి దేవుడు కూడ "తధాస్తు" అన్నాడు. అంతే లోన్ మొదలయిన 4 నెలలకే వడ్డీ రేటు 1% పెరిగి, EMI రెండు వేలు పెరిగింది. మొదటి సారి EMI దెబ్బ రుచి చూసా. అంతే గాల్లో ఉన్న నా కాళ్ళు గబుక్కున నేల మీదకి వచ్చేసాయి (తరవాత క్రమ క్రమంగా భూమిలో కూరుకుపోయాయి).

అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకోసారి (కొన్ని సార్లు 4 నెలలకే) వడ్డీ రేట్లు పెరగయి. దాంతో పాటు EMI, లోన్ తీర్చాల్సిన సమయం రెండూ కూడా కొండవీటి చేంతాడులా, హనుమంతుడి తోకలా పెరిగిపోయాయి. ఇప్పటికి ఇంటికి తీసుకొన్న అప్పు వడ్డీ రేటు 5% పెరిగి, తీర్చాల్సిన సమయం 20 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళకి పెరిగి నా "కొంప" ని కొల్లేరు చేసాయి. ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. నేను ఇల్లు తీసుకొన్న కొత్తలో ఇంటి అద్దె EMI కి దాదాపుగా సరిపోయేది, ఇప్పుడు అది అద్దె లో సగానికి పడిపోయింది. నా సహోద్యుగులు కొంతమందికి హో లోన్ తీర్చాల్సిన సమయం 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళకి కూడా పెరిగిపోయింది. వాళ్ళతో పోల్చుకుంటె నా పరిస్థితి చాలా చాలా బెటరేమో! గుడ్డిలో మెల్ల, చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఇదే!! ఇప్పుడు అర్ధం అయింది నాకు మన ముందు తరానికి ఇల్లు కొనటానికి అంత సమయం ఎందుకు పట్టిందో. కాకపోతే వాళ్ళు డబ్బు దాచుకొని కొంచెం ఆలస్యంగా ఇల్లు కట్టుకొనే వాళ్ళు. మనం కొంచెం ముందు ఇల్లు కట్టుకొని డబ్బంతా వడ్డీ రూపంలో బేంకులకి దోచి పెడుతున్నాం. అంతే తేడా.

నేను చేసిన మొదటి తప్పు ఇల్లు కొనాలి అనుకోవడం. అదీ లోను తీసుకొని మరీ కొనాలనుకోవడం. "ఒన్ ఫైన్ మార్నింగ్" ఎందుకనిపించిందో ఏమో తెలియదు కాని ఇల్లు కొనాలి అనిపించింది. అంటే అప్పటినుండి నాక్కావల్సిన విధంగా ఉండే ఇంటి కోసం వేట మొదలెట్టా. ప్రతి వారాంతంలోను ఇలా వేటాడగా, వేటాడగా 4 నెలలకి నాకు అన్ని విధాల నచ్చిన నా కలల ఇల్లు నా బడ్జెట్ కి కూడా సరిపోయే ఇల్లు దొరికింది. నేను "సాప్ట్ వేర్ ఇంజినీర్" ని అని చెప్పగానే బిల్డర్ కళ్ళల్లో కొత్త మెరుపులు. డొనాల్డ్ డక్ కార్టూన్ షో లో "అంకుల్ స్క్రూచ్" కళ్ళల్లో డాలర్స్ కనపడతాయే అలాంటి మెరుపులన్నమాట. "సాప్ట్ వేర్ ఇంజినీర్" అనగానే వాడు రేటు అమాంతం పెంచేసాడు. పైగా "మీకేంటి సార్ సాప్ట్ వేర్ ఇంజినీర్లు" అని బోనస్ గా సెటైర్ ఒకటి. అక్కడికేదో నేనేదో బిల్ గేట్స్ కి అళ్ళుణ్ణయినట్లు లేకపొతే మా ఆఫీస్ వాళ్ళు నాకు ఫ్రీ గా జీతం ఇస్తునట్లు. సాప్ట్ వేర్ ఇంజినీర్లంటే ఈ "పెద్ద చూపు" ఎప్పుదు పోతుందో ఏంటో. వాడు చెప్పిన రేటుకి ఇల్లు నా బడ్జెట్ దాటిపోయింది కదా, ఇక కొంచెం లోను ఎక్కువ ఇచ్చెవాడి కోసం వేట మొదలెట్టా. తొందరగా పని అయిపోతుంది కదా అని ఒక ప్రైవేటు బేంకుకి లోను అప్ప్లై చేసా. వాడు కూడా అనుకున్న దానికంటె తొందరగా ఎడం చేత్తో లోను అప్లికేషన్ తీసుకొని, వెంటనే కుడిచేత్తో లోన్ శాంక్షన్ చేసేసాడు. తీసుకున్న తర్వాత నిజంగానే నా పని అయిపోయిందని నాకు తర్వాత మెల్లగా అర్ధమయింది. అది నేను చేసిన రెండో తప్పు. ఈ బేంకు వాళ్ళు చాలా అంటే చాలా ఫాస్టుగా ఉంటారు. చిదబరం గాని, RBI గాని "వడ్డీ రేట్లు పె" అంటే చాలు, "వడ్డీ రేట్లు పెంచుతున్నాం" అన్న వాక్యం పూర్తి కాకుండానే ఇక్కడ "వడ్డీ రేట్లు పెంచేసాం" అని మనకి లేఖలు కూడ పంపించేస్తారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మాత్రం, తగ్గిన తర్వాత 1-2 సంవత్సరాలు చూసి, నిజంగా తగ్గాయి అని అనుకుంటే అప్పుడు తగ్గిస్తారు అన్నమాట. నా అదృష్టం బాగుండి, నేను లోన్ తీసుకున్న తర్వాత పెరగడమే కాని తగ్గడం లేదు కాబట్టి EMI తగ్గడం అనే మహద్భాగ్యాన్ని కళ్ళారా చూడలేకపోయాను. ఇక ముందు చూస్తాను అనే నమ్మకం కూడా నాకు లేదు.

పడ్డ వాళ్ళెప్పుడు చెడ్డ వాళ్ళు కారు అని సరి పెట్టేసుకుంటున్నా కాని, వడ్డీ రేట్లు ఇలా హైదరబాద్ ఆటో మీటర్ లా పెరుగుకుంటూ పోతే, పేద సాప్ట్ వేర్ ఇంజినీర్ ని ఇంత EMI నేను కట్టలేను. అందుకే అంటున్నా "EMI కట్టి చూడు, పెళ్ళి చేసుకొని చూడు అని".

మరి ఇల్లే ఇంత కష్టం అయితె పెళ్ళి ఇంకెంత కష్టమో. వా :(( నాకేడుపొస్తుంది.. వా.. వా .. వా :((

21 Comments:

శ్రీవిద్య said...

నా కళ్ళు తెరిపించారండి. ఈ మధ్యనే నా ఆలోచనలు అటువైపుగా బుడి బుడి అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇంటి మాటెత్తితే మీ మీదొట్టు :)

Falling Angel said...

కళ్ళలో మెరుపుల సెటైరు అదుర్స్. మనమంటే ఆటోవాడి దగ్గర్నుంచీ రియల్ ఎస్టేట్ వాళ్ళవరకూ అందరికీ పెద్దచూపే... ఏంచేస్తాం చెప్పండి ??

అశ్విన్ బూదరాజు said...

హ హ అదిరింది సున్నితంగా

సుజాత said...

బాగుంది. అదేమిటో, నేను రాద్దామనుకున్న సబ్జెక్టులు మీరు ముందే రాసేస్తున్నారు!

fixed పద్ధతిలో వడ్డీని ఎంచుకోకపోతే ఇదే సమస్య అని నేను అప్పుడప్పుడు బాధపడేదాన్ని. కానీ fixed వడ్డీలు కూడా పెరుగుతాయని తెలిసిన తర్వాత ఇహ ఏ రాయి అయితేనేం అనుకున్నాను.

ఈ మధ్య బాంక్ వాడి స్టేట్మెంట్ చూస్తే వడ్డీ 6 లక్షలు, అసలు 72 వేలు అట నాలుగేళ్ళుగా మేము కట్టింది.ఎంత ఏడుపొచ్చిందో! వా వా వా! మీకు బోలెడు మంది కంపెనీ!

మరి ఇల్లు ఇప్పుడు కొనలేదనుకోండి, హైద్ లో రియల్ రేట్లు చూశారా ఎలా పెరిగిపోతున్నాయో? అందువల్ల ఇల్లు కొనడమే మంచిది. అయినా మీకు శుభాకాంక్షలు..పెళ్ళికి ముందే ఇల్లు కొన్నందుకు.

ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అయితే మీరు సంతోషంగా మరో EMI కట్టుకోవచ్చు! ఆలోచించండి.

అజ్ఞాత said...

ఒక నెల రోజుల క్రితం, ICICI వాళ్ళు పంపించిన స్టేట్మెంట్ చూసి నాకు గుండాగింది. EMI లో 98.7% interest కే పోతుంది. నా loan tenure ఏకంగా నలభై ఏళ్ళదాకా సాగింది.

నేనది గొప్ప జోక్ లాగా భావించి(ఏడవలేక), అందరికీ ఫార్వర్డ్ ఇమెయిల్ చేసా..చదివి నవ్వుకోడ్రా బాబూ అని..

రిటర్న్ లో చాలా condolences వచ్చాయి.

బొల్లోజు బాబా said...

ఒకానొక టైములో ఇల్లమ్మేద్దామనుకున్నాను. ఈ భాధలు పడలేక.
లోను తీసుకొనే దాకా నాకోసం నాపిల్లలకోసం ఉద్యోగం చేసే వాడిని. ఇప్పుడు లోను కోసం చెయ్యవలసి వస్తుంది.
చాలా బాగా చెప్పారు.
నాగురించి మీకెలా తెలిసిపోయిందబ్బా అనుకున్నాను చదువుతూ ఉంటే.

బొల్లోజు బాబా

కత్తి మహేష్ కుమార్ said...

మంచి Edutainment. నా అభినందనలు.

sujata said...

hilarious! మా రైనీ డేస్ ఇప్పుడే మొదలయ్యాయి. ఇంకో ఇరవై ఏళ్ళంట ! తీరా ఈ ఇల్లు నాకు నచ్చలే! రైనీ డేస్ అంటే వరదలే.. తుఫాన్లే అని భయపెట్టేస్తున్నారు మీరు. అందుకే ఐసీ-యూసీ బాంకోళ్ళు పిల్చి అప్పులిచ్చేస్తున్నారబ్బా.. ఇళ్ళు కొనుక్కోమని !

రానారె said...

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో మృణాళినిగారి 'తాంబూలం' శీర్షికలో దీని గురించి చదివాను. బహ్మీ లాంటి ఓ యువకుని కొత్త సొంతింటికి ఒక పెద్దాయన వస్తూ అడుగుతాడట "ఈ ఇల్లు మన సొంతిల్లేనా బాబూ" అని. దానికి బ్రహ్మీ సమాధానం, "అవునండి. మనదే. సిటీ బ్యాంకు వాళ్లది కూడా!"

తెలిసి తెలిసి రోట్లో తల పెడుతూ వుంటాం. ఇక పోట్లే పోట్లు. తలనొప్పీ గట్రా ఏమైనా వుంటే ఈ పోట్లతో పోవాలి. బ్రహ్మీదే ఒక పాట గుర్తొస్తూవుంది - నడిపించు నా నావ, నడి సంద్రమున దేవా వాఁ ...

ప్రవీణ్ గార్లపాటి said...

మీలాంటి నాలాంటి బ్రహ్మీలు ఇలాంటి ఉచ్చులో పడింతర్వాత కానీ అర్థం చేసుకోవట్లేదండీ బాబు.

అందరికంటే ముందు ఇల్లు కొనటం అనే బ్రహ్మాండమయిన పని చేసానని మురిసిపోతుంటే కొనకుండా మేము అంతకన్నా హాయిగా ఉన్నామని జనాలు చెబుతుంటే ఏమని చెప్పను :)

అజ్ఞాత said...

నేను కూడా ఇల్లు కొనాలనుకుంటున్నాను. మీ టపా చూసిన తర్వాత ఇది జాగ్రత్తగా చేసే వ్యవహారం అని తెల్సుకున్నాను. మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

అజ్ఞాత said...

బ్రహ్మీ గారూ,

అదరగొట్టారు. "కళ్ళ ముందు డాలర్ల మెరుపులు" పోలిక సూపర్బ్.

-మురళి

అజ్ఞాత said...

hmm...
నేను సాప్ట్ వేర్ ఇంజినీరే. కాని ఎదో నాకు తెలిసిన కొంత accounts/ economics...

lets look at in a different way...

As you said interest rates has gone up incredibly. As a consumer, it affects us very badly immediately. But if we just see the rate at which real estate is going up, we can clearly say that its more than interest rates. Hence, EOD your "net assets" are positive.

suppose if interest rate is anything between 10-15 % and if rate at which real estate is growing is 20% (i am sure its more than that)....still net is 5+%. Don't you think it's reasonable deal??

And one more thing is that it seems the way banks recover their loans is also little different. In initial days of loan repayment, most of EMI go into interest and eventually EMIs will be contributed to loan amount. It makes consumers dejected in the initial days. but hang on for a while...


The bottom line is 'where have you invested and as long as your net value is positive (net value is (rate of return from your investment - rate of interest))... you are not loosing any thing in LONG TERM...'

ప్రతాప్ said...

ఒకానొక టైములో ఇల్లు కోనేద్దామని సీరియస్ గా వెతుకులాట మొదలు పెట్టాను, అలానే 2/3 ఇండ్లు కుడా చూసాను. ఇంకో వారంలో అంతా సెటిల్ అవుతుందనంగా RBI వారి దయవల్ల వడ్డీ రెట్లు పెరిగాయి. నా అడుగులు వెనక్కి పడ్డాయి. ఇప్పుడు అందరిని చూస్తుంటే, అబ్బో నేను పెద్ద ఉపద్రవం నుంచే తప్పించుకొన్నా అని అనుకొంటున్నా. ఏమో ఫ్యూచర్ లో మళ్లీ వడ్డీ రేట్లు తగ్గి, రియల్ బూం ఆదరగొడుతుందేమో ఎవరు చూడొచ్చారు?

oremuna said...

సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఇల్లు కొనడం దేశానికి , రాజకీయ నాయౌలకు, మాత్రమే మంచిది. వారికి కాదు :)

venku ... said...

ఈ బ్రహ్మి లాంటి వారు ఇబ్బడి ముబ్బడిగా ఇల్లు కొందామని ముందుకు వస్తే ఏ బ్యాంకు మాత్రం వడ్డీ రేట్లు పెంచక ఊరుకుంటారు...ఈ సాఫ్టువేర్ మనుషులు ఎప్పుడైతే ఇల్లులు కొనటం ఆపుతారో అప్పుడు గాని బ్యాంకు మరియు బిల్డర్లు తోక ముడుచుకోరు... So all software engineers should stop buying houses for few months... this will give a good result...

కల said...

అమ్మో అమ్మో ఇన్ని కష్టాలా?

విరజాజి said...

ఇలా తెలీక పప్పులో కాలేసి, అప్పు తీసుకున్న వాళ్లందరమూ "అప్పు" - "డే" తెల్లారిందా అని రోజూ బాధపడక తప్పదు. ఆహాహా .... నాకు తోడుగా ఎంతమంది గృహ ఋణ పీడితులు, ఇంటి అప్పు బాధితులు ఉన్నారో.... మీ అందరితో పాటుగా నేను కూడా వా(..... !!

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

@శ్రీవిద్య గారు,
@Falling Angel గారు,
@అశ్విన్ బూదరాజు గారు,
@independent గారు,
@బొల్లోజు బాబా గారు,
@కత్తి మహేష్ కుమార్ గారు,
@sujata గారు,
@రానారె గారు,
@ప్రవీణ్ గార్లపాటి గారు,
@srajcanada గారు,
@tetageeti గారు,

@ప్రతాప్ గారు,
@oremuna గారు,
@venku గారు,
@కల గారు,
@విరజాజి గారు
మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

@సుజాత గారు,
ధన్యవాదాలు.
మీరు రాద్దమనుకున్న విషయాలన్ని "ఆకాశ వాణి" ద్వారా నాకు ముందే తెలిస్పోతు ఉంటాయండి :-).

నాకు అలానే అనిపించింది. కాని ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకొనే సాహసం చేయలేను :-)

@Vamsi గారు,
ధన్యవాదాలు.
మీతో నేను పూర్తిగా ఏకిభవిస్తాను. కాని ఈ టపా ఉద్దేశ్యం ఇల్లు కొనవద్దనో, లోను తీసుకోవద్దనో కానే కాదు. తొందరగా పని అయిపోతుందన్న ఒకే ఒక్క కారణం చేత ప్రైవేటు బాంకులలో లోన్ తీసుకోవద్దనే. ప్రభుత్వ రంగ బాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచినా అవి RBI బెంచ్ మార్కుని అనుసరిస్తాయి. ప్రైవేటు బాంకులు వాటి వాటి బెంచ్ మార్కులని అనుసరిస్తాయి. కాబట్టి వడ్డీ రేట్లని పెంచడం, ఎంత పెంచాలి, తగ్గించడం లాంటి విషయాలు వాటి విచక్షణ మీద ఆధారపడతాయి.

ఈ టపాలో నేను చెప్పొచ్చేదేమింటంటే. ఇల్లు తీసుకోండి. ఇల్లు తీసుకొనేప్పుడు లొకేషన్, ఫేసింగు, వాస్తు, కరెంటు, నీళ్ళ సరఫరా, ఇంటి నుంచి దూరం, ఆఫీస్ నుంచి దూరం అని ఎంత ఎలా ఆలోచిస్తామో అలాగే అప్పిచ్చే వాడి గురించి కూడా అంతే ఆలొచించండి అనే.

నిజం said...

సూపర్ రాసారు సర్ .....నవ్వు ఆపుకోలేక పోతున్న....నేను కూడా మీ లోఅన్ తన్గ్గింది అని 1-2 years తర్వాత cheppinattu... కామెంట్ వుంది అనుకోకండి

Radha said...

entandi.... entha EMI debba aithe maatam inni rojula next post ki.... 2011 kooda vachesindi sir..
brahmi gaaru... hellooo unnaraaa?

blogger templates 3 columns | Make Money Online