19, జులై 2008, శనివారం

నా మనోభావాలు కూడా దెబ్బ తిన్నాయి

నా మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వెంటనే "ఆడు వారి మాటలకు అర్ధాలు వేరులే" సినిమా నుంచి అభ్యంతకరమైన సన్నివేశాలు తొలగించి దర్శక నిర్మాతలు బేషరతుగా క్షమపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇదేం కొత్త వివాదం అనుకుంటున్నారా? ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాల గురించి వివాదాలు రేగుతున్నప్పుడు నేను కూడా గత కొన్ని సినిమాలగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకి జరుగుతున్న సాంస్కృతిక అన్యాయాలను ఎందుకు నిలదీయలకూడదు అని ప్రశ్నిస్తున్నాను. "పోకిరి" సినిమా నుంచీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లని కించపరుస్తూనే ఉన్నారు. ఇంతకీ నన్ను మనోవేదనకి గురి చేసిన సన్నివేశం ఏంటంటె "ఆడు వారి మాటలకు అర్ధాలు వేరులే" సినిమాలో హీరొ అయిన వెంకటేష్ గారికి ఒక సమస్య వస్తుంది. హీరో గారి అనుకోకుండా చేసిన ఒక పని వల్ల సాప్ట్ వేర్లో పరమ భయకరమైన సమస్యలు వచ్చి పని చెయడం మానేస్తుంది. తర్వాత రోజుకల్లా ఆ సమస్యని పరిష్కరించాలి. హీరో గారికి జన్మతః పైట్లు & పాటలు అయితే వచ్చు కాని జావా రాదు కదా. హీరో గారు తీవ్రంగా ఆలోచించి ఒక బ్రహ్మాండమైన నిర్ణయానికి వస్తారు. అంతే మన హీరో గారు క్వార్టెర్ మందు తాగి కోడింగ్ మొదలు పెట్టేస్తారు. ఒక రాత్రి లో జావా నేర్చుకొని సమస్యని అద్భుతంగా పరిష్కరిస్తారు.

ఇదే నిజమైతే సాప్ట్ వేర్ ఇంజినీర్లు అందరు తాగుబోతులు అయ్యి ఉండాలి, సాప్ట్ వేర్ కంపనీలు అన్నిటిలోను 24 గంటలు బార్లు బార్లా తెరిచి ఉండాలి. అసలే ఈ సీను చూసి నేను బాధ పడుతుంటే, వేరే వాడి బగ్గు నాకు అసైన్ చెసినట్టు మా మరదలు "బావ జావా అంత వీజీనా?" అని అడిగింది. అసలే సాప్ట్ అయిన నా సాప్ట్ వేర్ హృదయం బాధగా మూలిగింది. ఎడ్యుకేటెడ్ అయిన మా మరదలే ఇలా ఆలోచిస్తే ఇంక నిరక్షరాస్యుల పరిస్థితి ఏంటి?

అందుకే సాప్ట్ వేర్ ఇంజినీర్లు అందరు ఏకమై ముక్త కంఠంతో ఈ సాంస్కృతిక అన్యాయాన్ని ఖండించాలి. ఈ సందర్భంగా మనం ఈ కింది పనులు చేద్దాం.

1. జూలై 21 న మనం అందరం ఆఫీస్ లో పనులు మానెసి నిరసన తెలపాలి. ( రోజూ పని చేస్తున్నామా ఏంటి అనుకుంటె ఆ రోజు ఈ కారణం చెప్పి పని మానెయ్యండి)
2. పంజాగుట్ట నుంచి సి.యం. కేంప్ ఆఫిస్ వరకు పాద యాత్ర.
3. సెన్సార్ వాళ్ళు కొత్త రూల్సు పెడుతున్నారట. సాప్ట్ వేర్ ఇంజినీర్లని కించపరచే సన్నివేశాలు ఉందకూడదని డిమాండ్ చేద్దాం.
4. ఒక వేళ అలాంటి సన్నివేశాలు ఉంటే ఆ సినిమా నిర్మాతని కఠినంగా శిక్షించాలి. అంటే కనిసం 3 సంవత్సరాలు మా మేనేజర్ కింద ఆన్ సైట్ కి సహారా ఎడారికి పంపించాలి.

గమనిక : ఈ టపా సరదాకి రాసింది మాత్రమే

21 Comments:

తెలుగు'వాడి'ని said...

బ్లాగ్లోకానికి స్వాగతం. హహ్హహ్హ ... చాలా బాగా రాశారు .. మొదటి ప్రయత్నమే అయినా సెటైర్ బాగా పేలింది. క్రమం తప్పక రాస్తూ ఉండండి. అభినందనలు..

Kathi Mahesh Kumar said...

బాగుంది. నేనూ మీతోపాటూ పాదయత్రకు రెడీ!

చైతన్య.ఎస్ said...

చాలా బాగుంది మీ సెటైర్. ఇలాగే రాస్తూ ఉండండి. అన్నట్టు పాదయాత్రకు నేను రెడి.

మీనాక్షి said...

హాయ్....బ్రహ్మి.....గారు...
బ్లాగు లోకం లోకి స్వాగతం...సుస్వాగతం...
చో చో చో చో..అయ్యో..ఎన్ని బాధలండి మీకు..
మీ మనొ భాభావాలు అంతలా దెబ్బతిన్నాయా...అయ్యొ పాపం...
..............
అన్నట్టు ..బావా..జావా..అంత విజియా..?
చాలా నచ్చేసింది.....
ఆ సినిమా చూదలేక చచ్చానండి బాబు...

RG said...

మీకింకో భయంకరమైన నిజం చెప్పనా?? వెంకటేష్ MCSE book చదివి Java కోడింగ్ చేస్తాడు. అదెలాగో జుట్టుపీక్కున్నా నాకర్థం కావట్లేదు :(

అజ్ఞాత said...

ఇది మారీ బావుంది, రాత్రి కి రాత్రి అంతా చేయటమే కాదు project లో అందరి పార్ట్ తనే చేసేస్తాడు, ఏమనా అంటే అన్నానంటారు ఓ సినిమా చాలు ఎంతో గొప్ప పని కూడ చాల చిన్నది చేయటానికి, "ఏరా అంత వీజీ నా జావ నేర్చుకోవటం నువ్వేమిటి అన్నెన్ని పుస్తాకాలు తిరగేస్తావ్ " అన్న విమర్శలూ ఉన్నాయి

చైతన్య కృష్ణ పాటూరు said...

చాలా బాగా రాసారు. ఈ సినిమాలో ఇంకా చిరాకు తెప్పించే సీన్ ఏంటంటే, హీరో తన కీబోర్డ్ మీద చిరాకు చూపిస్తే ఫ్లోర్ లో అందరి కంప్యూటర్లు ఆగిపోవటం.

"వేరే వాడి బగ్గు నాకు అసైన్ చెసినట్టు" - :-)

oremuna said...

మీకింకా వెంకీ గాడి తరువాత సినిమా గురించి ఉప్పందినట్టు లేదు!

సుజ్జి said...

బ్రహ్మి గారు... టప్పా అదుర్స్....!!!
నేనూ మీలాగే new entry ..
చాలా బాగా రాసారు.congrats.!

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

తెలుగు'వాడి'ని గారు,
కత్తి మహేష్ కుమార్ గారు,
చైతన్య గారు,,
మీనాక్షి గారు,,
RSG గారు,
అశ్విన్ బూదరాజు గారు,
చైతన్య క్రిష్ణ పాటూరు గారు,
oremuna గారు,
sujji గారు
ఈ టపా చుసినందుకు, మీ ప్రోత్సాహనికీ చాలా థాంక్స్ అండి.
నా టపాలో వ్యాఖ్యలు కనపడకపోయెసరికి చాల నిరాశ పడ్డాను, తర్వాత చుస్తే 9 వ్యాఖ్యలు అనే లింక్ కనపడింది. ఇంక నాలోని బ్లాగరిని బయటకు రప్పిస్తా.
మనలో మన మాట ! వ్యాఖ్యలు టపా కిందే కనపడాలి అంటే ఏమి చెయ్యాలి. ఎవరికైనా తెలిస్తే నాకు సహాయం చెయ్యండి.

Rajendra Devarapalli said...

బాగుందండి బ్రహ్మీ గారు,మా బంగారానికి అదే మీనాక్షికి బుచ్చిబావున్నట్లు మెకూ అంతవీజీనా అని అడిగే ఓ మరదలుందన్నమాట!ఇకనేం బోలెడు సర్దాలు పంచుతారు.మీరు ఖంగారు పడకుండా తాపీగా,ఇంతకన్నా హైస్థాయిలో రాయాలని కోరుకుంటున్నా.

శ్రీ said...

భలే రాసారు బ్రహ్మీ గారు!వెంకటేష్ రాత్రికి రాత్రి కోడు రాసి కోడు రివ్యూ లేకుండా ఎలా టెస్ట్ చేస్తాడు?వాళ్ళ కంపెనీకి పెద్దగా పద్ధతులు తెలీవు లాగుంది!

అజ్ఞాత said...

బ్లాగ్లోకానికి స్వాగతం. చాలా బాగుంది.
టీం లో ఒకరు కీబోర్డు తో అడుకుంటే మొత్తం అందరి కంప్యూటర్లు క్రాష్ అయ్యే కోడ్ ఎవరి వద్దైనా ఉంటే నాకు పంపగలరు. ఈ మధ్య బొత్తిగా పని మీద ఆసక్తి రావటం లేదు. లేకున్నా పర్లేదు. మనం ఆ సినిమా దర్శకున్ని గానీ, వెంకీనీ గానీ అడుగుదాం.

K. D. said...

chala bagha rasaru.......godavari bashalo cheppalante... goppa saradaga rasarandi...

వేణూశ్రీకాంత్ said...

మొదటి బంతే సిక్సర్ కొట్టారు... టపా అదిరింది... బావా జావా అంత వీజీనా :-) సుపర్

రాధిక said...

నిజమే బ్రహ్మీలకి చాలా అన్యాయ0 జరుగుతు0ది సినిమాల్లో.ఒక బ్రహ్మీ భార్యగా నా ప్రోత్సాహ0 మీకు తప్పక లభిస్తు0ది.కానివ్వ0డి మరి.

Purnima said...

వెంకీది ఇంకో మూవీ వస్తుంది.. ఈ సారి ఏకం గా టైటిల్లోనే "సాప్ట్ వేర్" అని ఉంటుందనుకుంటా.. ముందు దాన్ని ఆపేద్దాం.. రండి!!

Kindly remove the Word Verification.. Please

prasanna said...

సుపర్ గా రాసారు బ్రహ్మి గారు.

అజ్ఞాత said...

హాయ్ బ్రహ్మి గారు ... చాల బాగా రాసారు ... వెంకటేష్ ఇంత చిత్ర హింసలు పెడితే ... ఒక వేళ భవిష్యత్తులో బాలయ్య సాప్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తే ...

chandu said...

చాలా బాగా రాసారు. ఈ లైన్ అదిరింది.

"4. ఒక వేళ అలాంటి సన్నివేశాలు ఉంటే ఆ సినిమా నిర్మాతని కఠినంగా శిక్షించాలి. అంటే కనిసం 3 సంవత్సరాలు మా మేనేజర్ కింద ఆన్ సైట్ కి సహారా ఎడారికి పంపించాలి."

ఇలాగే మంచి మంచి టపాలు రాస్తూ ఉండండి.

Unknown said...

వెంకటేశ్ కాబట్టి కీ బొర్డ్ కదిపాడు. బాలయ్య కైతే, కంటి చూపే చాలు. ;-)

blogger templates 3 columns | Make Money Online