పాత కాలంలో కాబట్టి "ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు" అన్నారు. ఇల్లు కట్టటం చాలా కష్టం. పెళ్ళి చేయడం ఇంకా కష్టం అని అర్ధం. కాబట్టే పెళ్ళి చేయడం ఇల్లు కట్టటం తర్వాత వరుసలో వచ్చింది. అదే ఆ సామెత చెప్పిన మహానుభావుడు గనక ఇప్పుడు ఉండుంటే, వీటికన్న హోం లోన్ కి EMI కట్టటం చాలా కష్టం అని అర్ధం అయ్యి "EMI కట్టి చూడు" అనే వాడు. మనిషికి కావల్సిన రోటి, కపడా, మకాన్ ల లో చివరిదానిని సంపాదించడం ఎంత కష్టమో తెలియజేసేవాడు.
అసలు ఇల్లు కొన్నప్పుడయితే నా ఆనందానికి అవధులు లేవు. ప్రైం లొకేషన్ లో మంచి ఇల్లు కొనేసానన్న సంతోషం నన్ను నిలవనీయలేదు. మన ముందు తరం వాళ్ళకి ఇల్లు కొనేసరికి రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసేది, అదే నేనైతే పిన్న వయసులోనే ఇల్లు కొనేసి ఒక ఇంటి వాడినయిపోయాను అని గొప్పగా ఫీల్ అయిపోయి, కొన్నాళ్ళు నేల మీద కాకుండా గాల్లోనే నడిచా. కాని పైన దేవుడు ఉంటాడు, కింద చిదంబరం, RBI వాళ్ళు కూడా ఉంటారు కదా. వీడు ఇంత ఆనందంగా ఎందుకు ఉండాలి అని అనుకున్నారేమో, RBI వాడు వడ్డీ రేటు పెంచుదాం అనుకున్నాడు. పైనుంచి దేవుడు కూడ "తధాస్తు" అన్నాడు. అంతే లోన్ మొదలయిన 4 నెలలకే వడ్డీ రేటు 1% పెరిగి, EMI రెండు వేలు పెరిగింది. మొదటి సారి EMI దెబ్బ రుచి చూసా. అంతే గాల్లో ఉన్న నా కాళ్ళు గబుక్కున నేల మీదకి వచ్చేసాయి (తరవాత క్రమ క్రమంగా భూమిలో కూరుకుపోయాయి).
అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకోసారి (కొన్ని సార్లు 4 నెలలకే) వడ్డీ రేట్లు పెరగయి. దాంతో పాటు EMI, లోన్ తీర్చాల్సిన సమయం రెండూ కూడా కొండవీటి చేంతాడులా, హనుమంతుడి తోకలా పెరిగిపోయాయి. ఇప్పటికి ఇంటికి తీసుకొన్న అప్పు వడ్డీ రేటు 5% పెరిగి, తీర్చాల్సిన సమయం 20 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళకి పెరిగి నా "కొంప" ని కొల్లేరు చేసాయి. ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. నేను ఇల్లు తీసుకొన్న కొత్తలో ఇంటి అద్దె EMI కి దాదాపుగా సరిపోయేది, ఇప్పుడు అది అద్దె లో సగానికి పడిపోయింది. నా సహోద్యుగులు కొంతమందికి హో లోన్ తీర్చాల్సిన సమయం 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళకి కూడా పెరిగిపోయింది. వాళ్ళతో పోల్చుకుంటె నా పరిస్థితి చాలా చాలా బెటరేమో! గుడ్డిలో మెల్ల, చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఇదే!! ఇప్పుడు అర్ధం అయింది నాకు మన ముందు తరానికి ఇల్లు కొనటానికి అంత సమయం ఎందుకు పట్టిందో. కాకపోతే వాళ్ళు డబ్బు దాచుకొని కొంచెం ఆలస్యంగా ఇల్లు కట్టుకొనే వాళ్ళు. మనం కొంచెం ముందు ఇల్లు కట్టుకొని డబ్బంతా వడ్డీ రూపంలో బేంకులకి దోచి పెడుతున్నాం. అంతే తేడా.
నేను చేసిన మొదటి తప్పు ఇల్లు కొనాలి అనుకోవడం. అదీ లోను తీసుకొని మరీ కొనాలనుకోవడం. "ఒన్ ఫైన్ మార్నింగ్" ఎందుకనిపించిందో ఏమో తెలియదు కాని ఇల్లు కొనాలి అనిపించింది. అంటే అప్పటినుండి నాక్కావల్సిన విధంగా ఉండే ఇంటి కోసం వేట మొదలెట్టా. ప్రతి వారాంతంలోను ఇలా వేటాడగా, వేటాడగా 4 నెలలకి నాకు అన్ని విధాల నచ్చిన నా కలల ఇల్లు నా బడ్జెట్ కి కూడా సరిపోయే ఇల్లు దొరికింది. నేను "సాప్ట్ వేర్ ఇంజినీర్" ని అని చెప్పగానే బిల్డర్ కళ్ళల్లో కొత్త మెరుపులు. డొనాల్డ్ డక్ కార్టూన్ షో లో "అంకుల్ స్క్రూచ్" కళ్ళల్లో డాలర్స్ కనపడతాయే అలాంటి మెరుపులన్నమాట. "సాప్ట్ వేర్ ఇంజినీర్" అనగానే వాడు రేటు అమాంతం పెంచేసాడు. పైగా "మీకేంటి సార్ సాప్ట్ వేర్ ఇంజినీర్లు" అని బోనస్ గా సెటైర్ ఒకటి. అక్కడికేదో నేనేదో బిల్ గేట్స్ కి అళ్ళుణ్ణయినట్లు లేకపొతే మా ఆఫీస్ వాళ్ళు నాకు ఫ్రీ గా జీతం ఇస్తునట్లు. సాప్ట్ వేర్ ఇంజినీర్లంటే ఈ "పెద్ద చూపు" ఎప్పుదు పోతుందో ఏంటో. వాడు చెప్పిన రేటుకి ఇల్లు నా బడ్జెట్ దాటిపోయింది కదా, ఇక కొంచెం లోను ఎక్కువ ఇచ్చెవాడి కోసం వేట మొదలెట్టా. తొందరగా పని అయిపోతుంది కదా అని ఒక ప్రైవేటు బేంకుకి లోను అప్ప్లై చేసా. వాడు కూడా అనుకున్న దానికంటె తొందరగా ఎడం చేత్తో లోను అప్లికేషన్ తీసుకొని, వెంటనే కుడిచేత్తో లోన్ శాంక్షన్ చేసేసాడు. తీసుకున్న తర్వాత నిజంగానే నా పని అయిపోయిందని నాకు తర్వాత మెల్లగా అర్ధమయింది. అది నేను చేసిన రెండో తప్పు. ఈ బేంకు వాళ్ళు చాలా అంటే చాలా ఫాస్టుగా ఉంటారు. చిదబరం గాని, RBI గాని "వడ్డీ రేట్లు పె" అంటే చాలు, "వడ్డీ రేట్లు పెంచుతున్నాం" అన్న వాక్యం పూర్తి కాకుండానే ఇక్కడ "వడ్డీ రేట్లు పెంచేసాం" అని మనకి లేఖలు కూడ పంపించేస్తారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మాత్రం, తగ్గిన తర్వాత 1-2 సంవత్సరాలు చూసి, నిజంగా తగ్గాయి అని అనుకుంటే అప్పుడు తగ్గిస్తారు అన్నమాట. నా అదృష్టం బాగుండి, నేను లోన్ తీసుకున్న తర్వాత పెరగడమే కాని తగ్గడం లేదు కాబట్టి EMI తగ్గడం అనే మహద్భాగ్యాన్ని కళ్ళారా చూడలేకపోయాను. ఇక ముందు చూస్తాను అనే నమ్మకం కూడా నాకు లేదు.
పడ్డ వాళ్ళెప్పుడు చెడ్డ వాళ్ళు కారు అని సరి పెట్టేసుకుంటున్నా కాని, వడ్డీ రేట్లు ఇలా హైదరబాద్ ఆటో మీటర్ లా పెరుగుకుంటూ పోతే, పేద సాప్ట్ వేర్ ఇంజినీర్ ని ఇంత EMI నేను కట్టలేను. అందుకే అంటున్నా "EMI కట్టి చూడు, పెళ్ళి చేసుకొని చూడు అని".
మరి ఇల్లే ఇంత కష్టం అయితె పెళ్ళి ఇంకెంత కష్టమో. వా :(( నాకేడుపొస్తుంది.. వా.. వా .. వా :((
27, ఆగస్టు 2008, బుధవారం
EMI కట్టి చూడు
ప్రచురించినది బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ సమయం 3:53 AM 21 వ్యాఖ్యలు
20, ఆగస్టు 2008, బుధవారం
అమ్మ, బామ్మ, బెండకాయ పులుసు
పూత రేకులకి ఆత్రేయపురం ఫేమస్. కాజాలకి కాకినాడ ఫేమస్. లడ్డూలకి బందరు ఫేమస్. బిర్యానికి మన భాగ్యనగరం ఫేమస్. బిసి బేళి బాత్ కి బెంగుళూరు ఫేమస్. ఇలా కొన్ని కొన్ని పదార్ధాలకి కొన్ని కొన్ని ప్రాంతాలు ఎలా ఫేమస్సో మా బామ్మ (మా నాయనమ్మ) బెండకాయ పులుసుకి అంత ఫేమస్సు. ఇప్పుడు ఏ లోకాన బెండ కాయ పులుసు వండుతుందో తెలియదు కాని, బెండ కాయ పులుసు మాత్రం కత్తిలా చేసేది. చూడగానే నొట్లో నీళ్ళూరేవి (కొంచెం కారంగా ఉండేది కాబట్టి తింటే కంట్లో కూడా నీళ్ళొచ్చేవి).
బిర్యాని, బొమ్మిడాయల పులుసు, బిసి బేళి బాత్, బందరు లడ్డు, మా నానమ్మ చేసిన బెండకాయ పులుసు అన్ని ముందు పెట్టి ఏది కావాలని అడిగితే చటుక్కున బెండకాయ పులుసుకే నా వోటు వేసే వాడిని. అంత బాగుండేది. ఆ పులుసు వెనక ఏ రహస్య ఫార్ములా ఉందో తెలియదు గాని అంత బాగా వండటం ఇంకెవ్వరి వల్లా అయ్యేది కాదు. మా అత్తలకి, మా అమ్మ కి, మా పిన్నులెవ్వరికి కూడా అంత బాగా వండటం వారసత్వంగా అన్నా రాలేదు.
నా పేరు మా నానమ్మ పేరుతో కలిపి పెట్టటం వల్లనో, లేక వంశోధ్ధారకుడనో, మొత్తానికి మా నానమ్మకి నేనంటే చాలా ఇష్టం. బెండకాయ పులుసు వండినప్పుడల్లా మనకి "స్పెషల్" గా మా ఇంటికి పార్సిల్ వచ్చేది. ఇలా సంతోషంగా మూడు బెండకాయలు ఆరు పులుసులుగా రోజులు గడిపేస్తున్నాను.
అయితే - అన్ని రోజులు ఒకేలా ఉండవు
నేను కాలేజ్ చదువుల కోసం వేరే ఊరు వెళ్ళవలిసి వచ్చింది. రెసిడెన్షియల్ కాలేజ్ కాబట్టి హాస్టల్ లోనె ఉండేవాళ్ళం. మా హాస్టల్లో తిండి మాత్రం భలే అద్భుతం గా ఉండేది. ఆ తిండికి మా నాలుక మీదున్న రుచి మొగ్గలన్ని అంతరించి పోయాయి. రుచికరమైన తిండికి బాగా మొహం వాచిపోయాం. ఎంతగా మొహం వాచిపోయామంటే ఎవడైనా ఇంటి దగ్గర నుంచి వచ్చాడనే తెలిస్తే చాలు, కరువొచ్చినప్పుడు దుకాణాల మీద పడి దోచుకునే వాళ్ళ లాగా వాడి మీద దాడి చేసి, ఇంటి దగ్గర నుంచి ఏమి తెస్తే అది క్షణాల్లొ గుటుక్కుమనిపించే వాళ్ళం. అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి. (ఏంటో ఈ మధ్య మా ఆఫీస్ కేంటీన్ వాడు కూడ మా హాస్టల్ ని పదే పదే గుర్తు తెస్తున్నాడు). ఈ బాధ పడలేక ఒక సారి ఇంటికి చెక్కేసాను. డైరెక్ట్ గా మా నానమ్మ దగ్గరికి వెళ్ళి బెండకాయ పులుసు వండించుకున్నా. వరదల్లో పులిహోర పొట్లం సంపాందించి తింటున్న వాడిలా, వారం రోజుల నుంచి అన్నం తిననని వాడిలా కంగారు కంగారు గా తినేసా. తినేసి సంతోషంగా ఊరు మీదకి బలాదూరు బయలుదేరా.
బొత్తిగా అత్తా కోడళ్ళ సీరియల్సు చూసే అలవాటు లేకపోవడం వల్లా, అజ్ఞానం తోను నేను చేసిన చారిత్రాత్మక తప్పిదం ఏంటో నాకు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అర్ధం అయింది. నాయనమ్మ ఇంటికి వచ్చి మా అమ్మతో నువ్వు నా మనవడికి సరిగా వండి పెట్టడం లేదు అందుకే నా దగ్గరికి వచ్చి బెండకాయ పులుసు చేయమని అడిగాడు అని దెప్పింది. అంతే మాట మాట పెరిగింది ఇద్దరి మధ్య పచ్చని బెండకాయ వేస్తే బగ్గున మండింది. యుధ్ధ నగారా మోగింది. చరిత్రలో ఒకటవ బెండకాయ యుధ్ధం మొదలయింది.
నానమ్మకు తోడుగా 2 మిత్ర దేశాలు(ఆ పక్కింటి వాళ్ళు), అమ్మకు తోడుగా 2 మిత్ర దేశాలు (ఈ పక్కింటి వాళ్ళు) సైన్యాన్ని మొహరించాయి. ఒకరి మీద ఒకరు యుద్ధాస్త్రాలు సంధిస్తున్నారు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. "బెండకాయ పులుసులో తుఫాను" అంటే ఇదేనేమో? వెంటనే ఇటువంటి విషయాలు పరిష్కరించడం లో ఆరితేరిన ఐక్య రాజ్య సమితి (మా నాన్న) ని రంగలో దించా. ఐ.రా.స. జ్యోక్యంతో ఇరు పక్షాలు యుధ్ధాన్ని విరమించాయి. ఆ విధంగా ఒకటవ బెండకాయ యుధ్ధానికి తెరపడింది.
ఆ తర్వాత తినాలనిపిస్తే నన్ను అడగచ్చు కదాని మా అమ్మ నాకు "ఫుల్లు" క్లాసు .అలాంటి తప్పు మళ్ళీ ఇంకెప్పుడు చేయకుండా మరిన్ని యుధ్ధాలు జరగకుండా జాగ్రత్తపడ్డాను. కాని బామ్మ వండిన బెండకాయ పులుసుని మనం వదుల్తామా? ఈ సారి తినాలనిపించినపుడు మా తాతతో బజారుకు వెళ్ళి బెండకాయలు కొనిపించేవాడిని. అంతే. యధావిధిగా మన "స్పెషల్ పార్సిల్" రెడీ !!
అలా నాకు మా నానమ్మ వండిన బెండకాయ పులుసు ఎంత ఇష్టం ఏర్పడిపోయింది అంటే. మా నానమ్మ లోకాన్ని వదిలి వెల్లిపోయిన తర్వాత నేను కూడా బెండకాయ పులుసుని వదిలేసాను. ఇంకెప్పుడు తినలేదు.
ప్రచురించినది బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ సమయం 9:40 AM 11 వ్యాఖ్యలు
విభాగాలు: జ్ఞాపకం
7, ఆగస్టు 2008, గురువారం
తుఫాను
వర్షం పడుతున్నప్పుడు చూస్తే మీకేమనిపిస్తుంది? తడవాలనిపిస్తుందా? పడవలు చేసి ఆడుకోవాలి అనిపిస్తుందా? కిటికీ లోంచి వర్షాన్ని చూస్తూ వేడి వేడి వేరు శెనక్కాయులు తింటూ ఏదైనా పుస్తకం చదుకోవాలి అనిపిస్తోందా?
నాకు మాత్రం .......
****************************************************************************************************************************
అప్పుడు నేను 8 వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడంటె తగ్గిపోయింది కాని, నాకు అప్పట్లో క్రికెట్ పిచ్చి బాగానే ఉండేది ( నిజం చెప్పాలంటే అప్పట్లో మన వాళ్ళు బాగానే ఆడేవాళ్ళు). మన వాళ్ళు "టైటాన్ కప్" ఫైనల్ కి వచ్చారు. ఫైనల్ లో ప్రత్యర్ధి సౌత్ ఆఫ్రికా.
ఆ రోజు 1996 నవంబర్ 6. నేను, నాతో పాటు నా సహ క్రికెట్ పిచ్చోడు మా బాబాయి, వాళ్ళింట్లో మ్యాచ్ చూస్తున్నాం (పిచ్చి వాళ్ళలో సమైఖ్యత ఎక్కువుంటుంది !!!). మా బాబాయి వాళ్ళ ఇంటి వెనకాలే మా ఇల్లు కూడా ఉండేది. మ్యాచ్ ప్రారంభం అయింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు మొదట బ్యాటింగ్ చేసారు. ఎంత కొట్టారో గుర్తు లేదు కాని బాగానే కొట్టారు. మన వాళ్ళ బ్యాటింగ్ మొదలయింది. దాంతో పాటు బయట వర్షం కూడా మొదలయింది. వర్షం చినుకులు రాలినట్టు వికెట్లు కూడా టపా టపా రాలిపోతున్నాయి. కొట్టవలసిన స్కోరు ఇంకా చాలా ఉంది. బ్యాట్స్ మెన్ అందరు అవుతయిపోయారు. క్రీసులో కుంబ్లే, శ్రీనాథ్ ఉన్నారు. ఏమవుతుందో అన్న టెన్షన్. వర్షం ఇంకా పెద్దదయింది. కుంబ్లే, శ్రీనాథ్ ఇంకా ఆడుతున్నారు. అప్పుడె కరెంట్ కూడా పోయింది. గెలుస్తారన్న నమ్మకం లేకపోయినా మ్యాచ్ ఏమయిపోయిందో అన్న టెన్షన్. టి.వి. చూద్దామంటే కరెంట్ లేకుండా పోయింది. మేము వదులుతామా? రేడియో పెట్టి కామెంట్రీ వింటున్నాం. ఇక్కడ వర్షం ఇంకా విజృభించింది. అక్కడ కుంబ్లే, శ్రీనాథ్ పరుగుల వరద పారించారు. హుర్రే!! మనం ఫైనల్ గెలిచేసాం. "టైటాన్ కప్" మనదే.
మన వాళ్ళు ఫైనల్ గెలిచారో లేదో ప్రకృతి వైపరీత్యాలు మొదలయ్యాయి. వర్షం భారీ వర్షం గా, భారీ వర్షం తుఫాను గా మారింది. ఆ గాలికి మా బాబాయి వాళ్ళ ఇంటి పైన పెంకులు టపా టపా ఎగిరిపడసాగాయి. దీపావళికి 1000 వాలా బాంబులు పేల్చినట్టు గా ఉంది ఆ శబ్దం. కిటికి లోంచి చూస్తే సినిమాల్లో చుపించినట్టు చెట్లు గాలికి ఒక పక్కకి వంగిపోయి భయంకరంగా వూగుతున్నాయి. చాలా భయం వేసింది. ఎంత భయపడ్డానంటే మా బాబాయి వాళ్ళ ఇంటికి 4 అడుగుల దూరం లో ఉన్న మా ఇంటికి వెళ్ళడానికి కూడా నేను చాలా భయపడ్డాను. 2 గంటల తర్వాత వర్షం, గాలి కొంచెం తగ్గాయి. మా బాబాయి నన్ను ఇంట్లో దిగబెట్టాడు.
వర్షం బాగా తగ్గిన తర్వాత మా వీధి లో ఉన్న బాషా మేష్టారు నా వయసు కుర్రాళ్ళని కొంతమందిని పిలుచుకెళ్ళారు. పిలిచారు కాబట్టి వెళ్ళాం ఎందుకో నాకో తెలియదు. మేష్టారి వెనకాల మేమందరం టార్చి లైట్లు పట్టుకొని వీది మొదట్ళో ఉన్న "సూరమ్మ" గారింటికి వెళ్ళాం. మేష్టారు సూరమ్మ గారిని "ఏమ్మా ఇంట్లో అందరు బాగానే ఉన్నారు కదా? ఎవరికి ఏమి కాలేదు కదా?" అని వాకబు చేసారు. "అందరు బతికే ఉన్నారు కదామ్మా?" అనే అర్ధం ధ్వనించింది ఆ మాటల్లో. పరిస్థితి అంత సీరియస్ గా ఉన్న విషయం నాకప్పటికి వరకు అర్ధం కాలేదు. నా లాంటి పిల్ల కాకికేం తెలుసు తుఫాను దెబ్బ. అలా మా వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాని కనుక్కొని వచ్చాం. అదృష్టవశాత్తు మా వీధిలొ ఎవరికి ఏమి కాలేదు కాని ఇద్దరు గల్లంతయ్యారు.
మిగతా ప్రపంచం తో కమ్యూనికేషన్ తెగిపోయింది. వారం రోజులు కరెంట్ లేదు. కరెంట్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు సైతం ఎక్కడిక్కడ రోడ్డుకడ్డంగా పడిపోయాయి. నేను పెంచుకున్న మామిడి చెట్టు కూడా కూలిపోయింది. వర్షానికి ఇంట్లోకి నీళ్ళొచ్చాయి. 2 రోజులు నీళ్ళు అలాగే నిలిచిపోయాయి. నీళ్ళలో అక్కడక్కడ పాములు తిరుగుతున్నాయి. పురుగు, పుట్ర వస్తాయేమో అన్న భయం తో ఆ 2 రోజులు మా అమ్మ, నాన్న నిద్రపోకుండా కాపలా కాసారు. కిరోసిన్ దీపాలతో, ఇంట్లో ఉన్న కొద్ది పాటి వంట సామాగ్రి తో నెట్టుకొచ్చాం. ఇంట్లో ఉన్న సామాను కొద్ది రోజులకే సరిపోతుంది. అన్నీ పొదుపు గా వాడవలసి వచ్చింది. 4-5 రోజుల తర్వాత రేషన్ షాపులో కిరోసిన్, బియ్యం ఇచ్చారు.
2 రోజుల తర్వాత కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత నేను, మా బాబాయి వూరు ఎలా ఉందో చూడటనికి వెళ్ళాం. ఏ వీదిలో చూసినా మోకాలు లోతు నీళ్ళు, పడిపోయిన చెట్లు. తలకోన అడవి లో ఉన్నామా అనిపించింది. వందల ఏళ్ళ నాటి పెద్ద పెద్ద మర్రి చెట్లు కూడ కూలిపోయాయి. 10 రోజులు పరిస్థితి అలాగే ఉంది. 10 రోజుల తర్వాత స్కూలుకు వెళ్ళా. మా స్కూలు చూడగానే నిజంగా ఏడుపొచ్చింది. అప్పటికి 100 ఏళ్ళు నిండిన మా స్కూలు లో 1500 మంది విద్యార్ధులతో, 10 ఎకరాల్లో ఉండేది. తుఫాను దెబ్బతో తరగతి గదుల రేకులన్ని ఎగిరిపోయి, క్లాసు రూములు నిండా బురద, చెత్త చెదారం.. అబ్బా. అలాంటి స్కూలు ఎలా అయిపోయిందో తలుచుకుంటే ఇప్పటికీ అదోలా ఉంటుంది.
****************************************************************************************************************************
అందుకే వర్షాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. నవంబర్ 6 వస్తే నాకు వణుకు పుడుతుంది.
కొసమెరుపు: తుఫాను వచ్చిన 3 రోజుల తర్వాత మా తాతయ్య నాకు పదేళ్ళ కిందటి "కృష్ణా పత్రిక" ఒకటి చూపించారు. ఖచ్చింతంగా పదేళ్ళ కిందటిది అంటే 1986, నవంబర్ 6 తేదిన వచ్చిన పేపర్. ఆ పేపర్ చూడగానే నా భయం ఇంకా రెట్టింపయింది. ఆ రోజు పేపర్ హెడ్ లైన్ "దివి సీమ లో ఉప్పెన".
ప్రచురించినది బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ సమయం 8:07 AM 9 వ్యాఖ్యలు
విభాగాలు: చేదు జ్ఞాపకం, జ్ఞాపకం
5, ఆగస్టు 2008, మంగళవారం
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందా!!
ఒక రోజు ఉదయం ఆఫీస్ కి బయలుదేరాను. అప్పటికి ఒన్-వే టైం దాటిపోవడం తో, అమృత ఘడియలు అంతం అయిపోయి, రాహుకాలం & దుర్మూహర్తం కలసి కట్ట కట్టుకొని మొదలయ్యాయి. మా ఆఫీస్ కి వెళ్ళాలి అంటే దారిలో హైటెక్ సిటీ లోకల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సొరంగం దాటాలి. ఇక్కడికి రాగానే నాకు ఫ్లాష్-బాక్ లో వైజాగ్ నుంచి అరకు రైలు లో వెళ్ళినప్పుడు దారిలో వచ్చే సొరంగాలు గుర్తుకు వస్తాయి. ఆ సొరంగాలే కొంచెం నయమేమో, ఈ సొరంగం దాటడానికి ఎంత టైం పడుతుందో ఆ బ్రహ్మకి, ఈ బ్రహ్మికీ కూడా తెలియదు. భాగ్యనగరంలో ఏ మూలన చిన్న చినుకు పడినా ఇక్కడ పెద్ద ఈత కొలను తయారవుతుంది. అందులో కార్లు, బైకులు ఈదుకుంటూ వెళ్ళాలి.
ఈ పద్మవ్యూహం లో ద్విచక్ర వాహనంతో దూరటానికి నాకే కంత లేదంటె నా మెడకో డోలు అదనం. ఈ డోలునే మా ఆఫీస్ లో లాప్ టాప్ అంటూ ఉంటారు. ఎలగోలాగా కష్టపడి ఈ సొరంగాన్ని తొందరగా ఒక గంటలోనే దాటేసా. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, క్లచ్ తోను, బ్రేక్ తోను, లాప్ టాప్ బేలన్స్ చేస్తూ బిజీగా ముందుకు వెళ్తూండగా, నా ఆనదాన్ని భగ్నం చేస్తూ అకస్మాత్తుగా గా వర్షం మొదలయింది. ఏ చెట్టు కిందన్న నిలబడదాం అనుకున్నా ఆ రోడ్డులో ఒక్క చెట్టు కూడా ఉండదు. సగం పూర్తి అయినా ఓవర్ బ్రిడ్జ్ కూడా, మోడరన్ ఆర్ట్ లా, ఎక్కడ మొదలయ్యి, ఎక్కడ దిగుతుందో అర్ధం కాకుండా ఉంటుంది. ఇలా ముందుకు, వెనకకు కదలలేక లాప్ టాప్ తడవకుండా అవస్థ పడుతున్న సమయం లో, నా మనసు ఎంత వద్దంటున్న వినకుండా "దున్నపోతు మీద వర్షం పడినట్టు" లాంటి సామెతలన్ని గుర్తు చేయడం మొదలుపెట్టింది. నా మనసుని బుజ్జగించి "వానా వానా వందనం" అని పాడుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయాను.
ఉదయాన్నే ఈ దుశ్శకునాలేంటో అనుకుంటూనే ఆఫీస్ కి చేరుకున్నా. ఆఫీస్ కి చేరగానే ఆ రోజు మా టీం మెంబర్ వెంకి (వెంకటేశ్వర రావు) గాడి పెళ్ళి ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. "కష్టాల్లో తోడు నిలిచే వాళ్ళే నిజమైన స్నేహితులు", కాబట్టి మేమందరం స్నేహధర్మాన్ని పాటించటం కోసం వెంకి పెళ్ళికి తప్పనిసరిగా వెళ్ళాలని ముందే అనుకున్నాం. పొద్దున్న వర్షం ఎఫెక్ట్ డి.టి.ఎస్ లెవెల్ లో కనిపించటం తో, కారు లో వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. అనుకోకుండా మా డేమేజర్ సారీ! మా మేనేజర్ సుబ్బి ( సుబ్బా రావు ) ఆ రోజు కారు తీసుకువచ్చాడు. వాడు డ్రైవింగ్ నేర్చుకొని ఎంతో కాలం కాలేదు. వాడి డ్రైవింగ్ ప్రావీణ్యాన్ని చూపించాలని మాంచి ఉత్సాహం తో ఉన్నాడు. వాడి మనసులో ఇంత కుట్ర ఉందని నాకు తెలియదు.
కారులో వెంకి గాడి పెళ్ళికి బయలుదేరాం. దూరంగా హై టెక్ సిటీ సిగ్నల్, క్రికెట్ వరల్డ్ కప్ లా పచ్చగా వెలుగుతూ వూరిస్తూ కనపడింది. సిగ్నల్స్ క్రాస్ చేస్తామా? లేదా? అని అందరం టెన్షన్ లో ఉన్నాం. సుబ్బు గాడు టెన్షన్ తో గంగూలీ లాగా గోళ్ళు కొరుకుతున్నాడు. ఫైనల్ దాకా వచ్చేసాం, విజయం మనదే అనుకుంటుండగా, అకస్మాత్తుగా ఎవడో "పాంటింగ్" లాగా అడ్డుపడ్డాడు. ఫాం లో ఉన్న పాంటింగ్ లాగా రెచ్చిపోయి, మా కార్ ని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్ళి మలుపు తీసుకున్నాడు. వరల్డ్ కప్ చేజారిపోయింది. రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళి 4 సంవత్సరాలు వేచి చూసి సిగ్నల్ క్రాస్ చేసాం. సుబ్బు కార్ స్పీడ్ పెంచాడు. ఫరవాలేదు బానే డ్రైవ్ చేస్తున్నాడే అనిపించింది.
ఇంతలో ఎవడో అకస్మాత్తుగా అడ్డం రావడంతో సడెన్ బ్రేక్ వేసాడు. పెద్ద శబ్దం తో కార్ ఆగింది. వాడిని తిట్టటం అయ్యాక మా వాడు సంచలన ప్రకటన ఒకటి చేసాడు. "కార్లని సరిగా డిజైన్ చేయలేదయ్యా! ఆర్కిటెక్చర్ అంత బాగుండదు. బ్రేకుకి, ఏక్సిలేటరుకి ఒకే కాలు ఉపయోగించాలి. పొరపాటున బ్రేక్ బదులు ఏక్సిలేటర్ తొక్కితే ప్రాబ్లెం కదా?!" అన్నాడు.
అంటే దాని అర్ధం ఏంటి? పొరపాటున బ్రేక్ బదులు ఏక్సిలేటర్ వాడితే ఆర్కిటెక్చర్ ప్రాబ్లెం నాది కాదు అనా? ఆర్కిటెక్చర్ బాలేని ప్రాజెక్ట్ ఇస్తే మేము వర్క్ చేయలేదా? నీ ఆర్కిటెక్చర్ ప్రాబ్లెం దొంగలెత్తుకెళ్ళా? ఏదైనా పొరపాటు జరిగితే ఇదే విషయాలు వూచలు లెక్కపెట్టుకుంటూ ఆలోచించాలి.
ఆ దెబ్బ తో, మేమందరం అటెన్షన్ లోకి వచ్చేసాం. మా భయానికి ట్రాఫిక్ జాం తోడయ్యింది. ముందు కి వెళ్ళడానికి లేదు. వెనక్కి వెళ్ళడానికి లేదు. సుబ్బు గాడు ఫస్ట్ గేర్ లో మెల్లి మెల్లిగా కార్ ని ముందుకు నడిపిస్తున్నాడు. అప్పటికి గంట నుంచి ఫస్ట్ గేర్ లోనే నడిపిస్తూ, క్లచ్ మీద కాలు ఉంచి, తీసి విసుగొచ్చిన సుబ్బు గాడు "నా వల్ల కాదు. నాకు కాళ్ళు నెప్పెడుతున్నాయి. నేను కార్ వదిలేసి వెళ్ళిపోతా" గోల చేయడం మొదలెట్టాడు. అన్యాయం. అక్రమం. కుట్ర. ఇలాగే ముందుకి, వెనకకి వెళ్ళడానికి లేని పరిస్థితిలో ఉన్న ప్రాజెక్ట్ ని వదిలి పెట్టి నేనుప్పుడైనా వెళ్ళిపోయానా? అమ్మో! ఇప్పుడు నన్ను గాని డ్రైవ్ చెయ్యమంటే నా పరిస్థితి ఏంటి? నాకు లైసెన్స్ అయితే ఉంది కాని డ్రైవింగ్ రాదు ( ష్! ఎవరితోను చెప్పకండే! ). కోడింగ్ అయితే గూగుల్ లో వెతికి కాపీ పేస్ట్ చేయగలను గాని, డ్రైవింగ్ కాపీ పేస్ట్ చేయలేను కదా (అలాంటి వెబ్ సైట్లు ఏమైనా ఉంటే చెప్పండి. ఎంత ఫీజు అయినా జాయిన్ అయిపోతా ). ఉదయాన్నే కనిపించిన దుశ్శకునాల అర్ధం, పరమార్ధం ఏంటో నాకప్పుడు అర్ధం అయింది. ఏదో రకంగా మా మేనేజర్ గారినే, ఆ వీకెండ్ ఆఫిస్ కి వచ్చి వర్క్ చేస్తామని, బోనస్ అడగమని, అదని, ఇదని చెప్పి డ్రైవింగ్ కి ఒప్పించేప్పటికి మా తల ప్రాణం తోకకి, తోక ప్రాణం తలకి రెండు, మూడు రౌండ్లు కొట్టింది.
ఇలా అడ్డంగా అడ్డొచ్చే ఆటో వాళ్ళని తిట్టుకొంటూ, ఫోన్ మాట్లాడుకొంటూ రోడ్డు దాటే "సైంధవులని" దాటుకుంటూ, రాంగ్ రూట్లొ ఎదురొచ్చి మనమే రాంగ్ రూట్లో వచ్చామని భ్రమింపచేసే రాంగ్ రూట్ గాళ్ళని ఎదుర్కుంటూ, రోడ్డు మధ్యలోకొచ్చిన తర్వాత వెళ్దామా? వద్దా? అని ఆలోచించే మేధావులని ఆశ్చర్యంగా చూస్తూ, అప్పుడప్పుడు ఎద్దుల బండిలో వెళ్ళే వాళ్ళని చేజింగులు చేస్తూ, ట్రాఫిక్ జాములు, సిగ్నల్సు అన్ని దాటుకొని పెళ్ళికి వెళ్ళేప్పటికి మాకు సప్త సముద్రాలు దాటి భైరవ ద్వీపం లో ఉన్న చిలకని, ఆ చిలకలో ఉన్న మాంత్రికుడి ప్రాణాన్ని పట్టుకొన్నంత ఆనందం కలిగింది. కార్ దిగీ, దిగగానె ముందు అందరం వరద బాధితుల్లా అందరం భోజనానికి పరిగెట్టాం. అసలే బయలుదేరి చాలాసేపు అయిందేమో విపరీతమైన ఆకలి. లేట్ గా వస్తే తినడానికేమి ఉండదేమో అన్న డౌటు. పెళ్ళి వాళ్ళు, అప్పుడే పాత్రలు అన్నీ కడగటానికి రెడీ అయ్యారు. పాపం మా మొహాలు చూసి వాళ్ళు కొంచెం జాలి పడి, ఏదో మిగిలింది కొంచెం మాకు పెట్టారు. భోజనం కాగానే అందరం మా వెంకి ని పరామర్శించటానికి సారీ! పలకరించటానికి వెళ్ళాం. మనసులో బాధగానే ఉన్న, వాడు పాపం నవ్వుతూనే పలకరించాడు.
వాడి బాధ ఏమో కాని, మా వెంకి గాడి పెళ్ళి సుబ్బి గాడి చావుకి, మా చావుకి వచ్చినట్టనిపించింది.
ప్రచురించినది బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ సమయం 4:42 AM 22 వ్యాఖ్యలు
విభాగాలు: హాస్యం