27, ఆగస్టు 2008, బుధవారం

EMI కట్టి చూడు

పాత కాలంలో కాబట్టి "ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు" అన్నారు. ఇల్లు కట్టటం చాలా కష్టం. పెళ్ళి చేయడం ఇంకా కష్టం అని అర్ధం. కాబట్టే పెళ్ళి చేయడం ఇల్లు కట్టటం తర్వాత వరుసలో వచ్చింది. అదే ఆ సామెత చెప్పిన మహానుభావుడు గనక ఇప్పుడు ఉండుంటే, వీటికన్న హోం లోన్ కి EMI కట్టటం చాలా కష్టం అని అర్ధం అయ్యి "EMI కట్టి చూడు" అనే వాడు. మనిషికి కావల్సిన రోటి, కపడా, మకాన్ ల లో చివరిదానిని సంపాదించడం ఎంత కష్టమో తెలియజేసేవాడు.

అసలు ఇల్లు కొన్నప్పుడయితే నా ఆనందానికి అవధులు లేవు. ప్రైం లొకేషన్ లో మంచి ఇల్లు కొనేసానన్న సంతోషం నన్ను నిలవనీయలేదు. మన ముందు తరం వాళ్ళకి ఇల్లు కొనేసరికి రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసేది, అదే నేనైతే పిన్న వయసులోనే ఇల్లు కొనేసి ఒక ఇంటి వాడినయిపోయాను అని గొప్పగా ఫీల్ అయిపోయి, కొన్నాళ్ళు నేల మీద కాకుండా గాల్లోనే నడిచా. కాని పైన దేవుడు ఉంటాడు, కింద చిదంబరం, RBI వాళ్ళు కూడా ఉంటారు కదా. వీడు ఇంత ఆనందంగా ఎందుకు ఉండాలి అని అనుకున్నారేమో, RBI వాడు వడ్డీ రేటు పెంచుదాం అనుకున్నాడు. పైనుంచి దేవుడు కూడ "తధాస్తు" అన్నాడు. అంతే లోన్ మొదలయిన 4 నెలలకే వడ్డీ రేటు 1% పెరిగి, EMI రెండు వేలు పెరిగింది. మొదటి సారి EMI దెబ్బ రుచి చూసా. అంతే గాల్లో ఉన్న నా కాళ్ళు గబుక్కున నేల మీదకి వచ్చేసాయి (తరవాత క్రమ క్రమంగా భూమిలో కూరుకుపోయాయి).

అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకోసారి (కొన్ని సార్లు 4 నెలలకే) వడ్డీ రేట్లు పెరగయి. దాంతో పాటు EMI, లోన్ తీర్చాల్సిన సమయం రెండూ కూడా కొండవీటి చేంతాడులా, హనుమంతుడి తోకలా పెరిగిపోయాయి. ఇప్పటికి ఇంటికి తీసుకొన్న అప్పు వడ్డీ రేటు 5% పెరిగి, తీర్చాల్సిన సమయం 20 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళకి పెరిగి నా "కొంప" ని కొల్లేరు చేసాయి. ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. నేను ఇల్లు తీసుకొన్న కొత్తలో ఇంటి అద్దె EMI కి దాదాపుగా సరిపోయేది, ఇప్పుడు అది అద్దె లో సగానికి పడిపోయింది. నా సహోద్యుగులు కొంతమందికి హో లోన్ తీర్చాల్సిన సమయం 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళకి కూడా పెరిగిపోయింది. వాళ్ళతో పోల్చుకుంటె నా పరిస్థితి చాలా చాలా బెటరేమో! గుడ్డిలో మెల్ల, చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఇదే!! ఇప్పుడు అర్ధం అయింది నాకు మన ముందు తరానికి ఇల్లు కొనటానికి అంత సమయం ఎందుకు పట్టిందో. కాకపోతే వాళ్ళు డబ్బు దాచుకొని కొంచెం ఆలస్యంగా ఇల్లు కట్టుకొనే వాళ్ళు. మనం కొంచెం ముందు ఇల్లు కట్టుకొని డబ్బంతా వడ్డీ రూపంలో బేంకులకి దోచి పెడుతున్నాం. అంతే తేడా.

నేను చేసిన మొదటి తప్పు ఇల్లు కొనాలి అనుకోవడం. అదీ లోను తీసుకొని మరీ కొనాలనుకోవడం. "ఒన్ ఫైన్ మార్నింగ్" ఎందుకనిపించిందో ఏమో తెలియదు కాని ఇల్లు కొనాలి అనిపించింది. అంటే అప్పటినుండి నాక్కావల్సిన విధంగా ఉండే ఇంటి కోసం వేట మొదలెట్టా. ప్రతి వారాంతంలోను ఇలా వేటాడగా, వేటాడగా 4 నెలలకి నాకు అన్ని విధాల నచ్చిన నా కలల ఇల్లు నా బడ్జెట్ కి కూడా సరిపోయే ఇల్లు దొరికింది. నేను "సాప్ట్ వేర్ ఇంజినీర్" ని అని చెప్పగానే బిల్డర్ కళ్ళల్లో కొత్త మెరుపులు. డొనాల్డ్ డక్ కార్టూన్ షో లో "అంకుల్ స్క్రూచ్" కళ్ళల్లో డాలర్స్ కనపడతాయే అలాంటి మెరుపులన్నమాట. "సాప్ట్ వేర్ ఇంజినీర్" అనగానే వాడు రేటు అమాంతం పెంచేసాడు. పైగా "మీకేంటి సార్ సాప్ట్ వేర్ ఇంజినీర్లు" అని బోనస్ గా సెటైర్ ఒకటి. అక్కడికేదో నేనేదో బిల్ గేట్స్ కి అళ్ళుణ్ణయినట్లు లేకపొతే మా ఆఫీస్ వాళ్ళు నాకు ఫ్రీ గా జీతం ఇస్తునట్లు. సాప్ట్ వేర్ ఇంజినీర్లంటే ఈ "పెద్ద చూపు" ఎప్పుదు పోతుందో ఏంటో. వాడు చెప్పిన రేటుకి ఇల్లు నా బడ్జెట్ దాటిపోయింది కదా, ఇక కొంచెం లోను ఎక్కువ ఇచ్చెవాడి కోసం వేట మొదలెట్టా. తొందరగా పని అయిపోతుంది కదా అని ఒక ప్రైవేటు బేంకుకి లోను అప్ప్లై చేసా. వాడు కూడా అనుకున్న దానికంటె తొందరగా ఎడం చేత్తో లోను అప్లికేషన్ తీసుకొని, వెంటనే కుడిచేత్తో లోన్ శాంక్షన్ చేసేసాడు. తీసుకున్న తర్వాత నిజంగానే నా పని అయిపోయిందని నాకు తర్వాత మెల్లగా అర్ధమయింది. అది నేను చేసిన రెండో తప్పు. ఈ బేంకు వాళ్ళు చాలా అంటే చాలా ఫాస్టుగా ఉంటారు. చిదబరం గాని, RBI గాని "వడ్డీ రేట్లు పె" అంటే చాలు, "వడ్డీ రేట్లు పెంచుతున్నాం" అన్న వాక్యం పూర్తి కాకుండానే ఇక్కడ "వడ్డీ రేట్లు పెంచేసాం" అని మనకి లేఖలు కూడ పంపించేస్తారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మాత్రం, తగ్గిన తర్వాత 1-2 సంవత్సరాలు చూసి, నిజంగా తగ్గాయి అని అనుకుంటే అప్పుడు తగ్గిస్తారు అన్నమాట. నా అదృష్టం బాగుండి, నేను లోన్ తీసుకున్న తర్వాత పెరగడమే కాని తగ్గడం లేదు కాబట్టి EMI తగ్గడం అనే మహద్భాగ్యాన్ని కళ్ళారా చూడలేకపోయాను. ఇక ముందు చూస్తాను అనే నమ్మకం కూడా నాకు లేదు.

పడ్డ వాళ్ళెప్పుడు చెడ్డ వాళ్ళు కారు అని సరి పెట్టేసుకుంటున్నా కాని, వడ్డీ రేట్లు ఇలా హైదరబాద్ ఆటో మీటర్ లా పెరుగుకుంటూ పోతే, పేద సాప్ట్ వేర్ ఇంజినీర్ ని ఇంత EMI నేను కట్టలేను. అందుకే అంటున్నా "EMI కట్టి చూడు, పెళ్ళి చేసుకొని చూడు అని".

మరి ఇల్లే ఇంత కష్టం అయితె పెళ్ళి ఇంకెంత కష్టమో. వా :(( నాకేడుపొస్తుంది.. వా.. వా .. వా :((

5, ఆగస్టు 2008, మంగళవారం

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందా!!

ఒక రోజు ఉదయం ఆఫీస్ కి బయలుదేరాను. అప్పటికి ఒన్-వే టైం దాటిపోవడం తో, అమృత ఘడియలు అంతం అయిపోయి, రాహుకాలం & దుర్మూహర్తం కలసి కట్ట కట్టుకొని మొదలయ్యాయి. మా ఆఫీస్ కి వెళ్ళాలి అంటే దారిలో హైటెక్ సిటీ లోకల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సొరంగం దాటాలి. ఇక్కడికి రాగానే నాకు ఫ్లాష్-బాక్ లో వైజాగ్ నుంచి అరకు రైలు లో వెళ్ళినప్పుడు దారిలో వచ్చే సొరంగాలు గుర్తుకు వస్తాయి. ఆ సొరంగాలే కొంచెం నయమేమో, ఈ సొరంగం దాటడానికి ఎంత టైం పడుతుందో ఆ బ్రహ్మకి, ఈ బ్రహ్మికీ కూడా తెలియదు. భాగ్యనగరంలో ఏ మూలన చిన్న చినుకు పడినా ఇక్కడ పెద్ద ఈత కొలను తయారవుతుంది. అందులో కార్లు, బైకులు ఈదుకుంటూ వెళ్ళాలి.

ఈ పద్మవ్యూహం లో ద్విచక్ర వాహనంతో దూరటానికి నాకే కంత లేదంటె నా మెడకో డోలు అదనం. ఈ డోలునే మా ఆఫీస్ లో లాప్ టాప్ అంటూ ఉంటారు. ఎలగోలాగా కష్టపడి ఈ సొరంగాన్ని తొందరగా ఒక గంటలోనే దాటేసా. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, క్లచ్ తోను, బ్రేక్ తోను, లాప్ టాప్ బేలన్స్ చేస్తూ బిజీగా ముందుకు వెళ్తూండగా, నా ఆనదాన్ని భగ్నం చేస్తూ అకస్మాత్తుగా గా వర్షం మొదలయింది. ఏ చెట్టు కిందన్న నిలబడదాం అనుకున్నా ఆ రోడ్డులో ఒక్క చెట్టు కూడా ఉండదు. సగం పూర్తి అయినా ఓవర్ బ్రిడ్జ్ కూడా, మోడరన్ ఆర్ట్ లా, ఎక్కడ మొదలయ్యి, ఎక్కడ దిగుతుందో అర్ధం కాకుండా ఉంటుంది. ఇలా ముందుకు, వెనకకు కదలలేక లాప్ టాప్ తడవకుండా అవస్థ పడుతున్న సమయం లో, నా మనసు ఎంత వద్దంటున్న వినకుండా "దున్నపోతు మీద వర్షం పడినట్టు" లాంటి సామెతలన్ని గుర్తు చేయడం మొదలుపెట్టింది. నా మనసుని బుజ్జగించి "వానా వానా వందనం" అని పాడుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయాను.

ఉదయాన్నే ఈ దుశ్శకునాలేంటో అనుకుంటూనే ఆఫీస్ కి చేరుకున్నా. ఆఫీస్ కి చేరగానే ఆ రోజు మా టీం మెంబర్ వెంకి (వెంకటేశ్వర రావు) గాడి పెళ్ళి ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. "కష్టాల్లో తోడు నిలిచే వాళ్ళే నిజమైన స్నేహితులు", కాబట్టి మేమందరం స్నేహధర్మాన్ని పాటించటం కోసం వెంకి పెళ్ళికి తప్పనిసరిగా వెళ్ళాలని ముందే అనుకున్నాం. పొద్దున్న వర్షం ఎఫెక్ట్ డి.టి.ఎస్ లెవెల్ లో కనిపించటం తో, కారు లో వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. అనుకోకుండా మా డేమేజర్ సారీ! మా మేనేజర్ సుబ్బి ( సుబ్బా రావు ) ఆ రోజు కారు తీసుకువచ్చాడు. వాడు డ్రైవింగ్ నేర్చుకొని ఎంతో కాలం కాలేదు. వాడి డ్రైవింగ్ ప్రావీణ్యాన్ని చూపించాలని మాంచి ఉత్సాహం తో ఉన్నాడు. వాడి మనసులో ఇంత కుట్ర ఉందని నాకు తెలియదు.

కారులో వెంకి గాడి పెళ్ళికి బయలుదేరాం. దూరంగా హై టెక్ సిటీ సిగ్నల్, క్రికెట్ వరల్డ్ కప్ లా పచ్చగా వెలుగుతూ వూరిస్తూ కనపడింది. సిగ్నల్స్ క్రాస్ చేస్తామా? లేదా? అని అందరం టెన్షన్ లో ఉన్నాం. సుబ్బు గాడు టెన్షన్ తో గంగూలీ లాగా గోళ్ళు కొరుకుతున్నాడు. ఫైనల్ దాకా వచ్చేసాం, విజయం మనదే అనుకుంటుండగా, అకస్మాత్తుగా ఎవడో "పాంటింగ్" లాగా అడ్డుపడ్డాడు. ఫాం లో ఉన్న పాంటింగ్ లాగా రెచ్చిపోయి, మా కార్ ని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్ళి మలుపు తీసుకున్నాడు. వరల్డ్ కప్ చేజారిపోయింది. రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళి 4 సంవత్సరాలు వేచి చూసి సిగ్నల్ క్రాస్ చేసాం. సుబ్బు కార్ స్పీడ్ పెంచాడు. ఫరవాలేదు బానే డ్రైవ్ చేస్తున్నాడే అనిపించింది.

ఇంతలో ఎవడో అకస్మాత్తుగా అడ్డం రావడంతో సడెన్ బ్రేక్ వేసాడు. పెద్ద శబ్దం తో కార్ ఆగింది. వాడిని తిట్టటం అయ్యాక మా వాడు సంచలన ప్రకటన ఒకటి చేసాడు. "కార్లని సరిగా డిజైన్ చేయలేదయ్యా! ఆర్కిటెక్చర్ అంత బాగుండదు. బ్రేకుకి, ఏక్సిలేటరుకి ఒకే కాలు ఉపయోగించాలి. పొరపాటున బ్రేక్ బదులు ఏక్సిలేటర్ తొక్కితే ప్రాబ్లెం కదా?!" అన్నాడు.
అంటే దాని అర్ధం ఏంటి? పొరపాటున బ్రేక్ బదులు ఏక్సిలేటర్ వాడితే ఆర్కిటెక్చర్ ప్రాబ్లెం నాది కాదు అనా? ఆర్కిటెక్చర్ బాలేని ప్రాజెక్ట్ ఇస్తే మేము వర్క్ చేయలేదా? నీ ఆర్కిటెక్చర్ ప్రాబ్లెం దొంగలెత్తుకెళ్ళా? ఏదైనా పొరపాటు జరిగితే ఇదే విషయాలు వూచలు లెక్కపెట్టుకుంటూ ఆలోచించాలి.

ఆ దెబ్బ తో, మేమందరం అటెన్షన్ లోకి వచ్చేసాం. మా భయానికి ట్రాఫిక్ జాం తోడయ్యింది. ముందు కి వెళ్ళడానికి లేదు. వెనక్కి వెళ్ళడానికి లేదు. సుబ్బు గాడు ఫస్ట్ గేర్ లో మెల్లి మెల్లిగా కార్ ని ముందుకు నడిపిస్తున్నాడు. అప్పటికి గంట నుంచి ఫస్ట్ గేర్ లోనే నడిపిస్తూ, క్లచ్ మీద కాలు ఉంచి, తీసి విసుగొచ్చిన సుబ్బు గాడు "నా వల్ల కాదు. నాకు కాళ్ళు నెప్పెడుతున్నాయి. నేను కార్ వదిలేసి వెళ్ళిపోతా" గోల చేయడం మొదలెట్టాడు. అన్యాయం. అక్రమం. కుట్ర. ఇలాగే ముందుకి, వెనకకి వెళ్ళడానికి లేని పరిస్థితిలో ఉన్న ప్రాజెక్ట్ ని వదిలి పెట్టి నేనుప్పుడైనా వెళ్ళిపోయానా? అమ్మో! ఇప్పుడు నన్ను గాని డ్రైవ్ చెయ్యమంటే నా పరిస్థితి ఏంటి? నాకు లైసెన్స్ అయితే ఉంది కాని డ్రైవింగ్ రాదు ( ష్! ఎవరితోను చెప్పకండే! ). కోడింగ్ అయితే గూగుల్ లో వెతికి కాపీ పేస్ట్ చేయగలను గాని, డ్రైవింగ్ కాపీ పేస్ట్ చేయలేను కదా (అలాంటి వెబ్ సైట్లు ఏమైనా ఉంటే చెప్పండి. ఎంత ఫీజు అయినా జాయిన్ అయిపోతా ). ఉదయాన్నే కనిపించిన దుశ్శకునాల అర్ధం, పరమార్ధం ఏంటో నాకప్పుడు అర్ధం అయింది. ఏదో రకంగా మా మేనేజర్ గారినే, ఆ వీకెండ్ ఆఫిస్ కి వచ్చి వర్క్ చేస్తామని, బోనస్ అడగమని, అదని, ఇదని చెప్పి డ్రైవింగ్ కి ఒప్పించేప్పటికి మా తల ప్రాణం తోకకి, తోక ప్రాణం తలకి రెండు, మూడు రౌండ్లు కొట్టింది.

ఇలా అడ్డంగా అడ్డొచ్చే ఆటో వాళ్ళని తిట్టుకొంటూ, ఫోన్ మాట్లాడుకొంటూ రోడ్డు దాటే "సైంధవులని" దాటుకుంటూ, రాంగ్ రూట్లొ ఎదురొచ్చి మనమే రాంగ్ రూట్లో వచ్చామని భ్రమింపచేసే రాంగ్ రూట్ గాళ్ళని ఎదుర్కుంటూ, రోడ్డు మధ్యలోకొచ్చిన తర్వాత వెళ్దామా? వద్దా? అని ఆలోచించే మేధావులని ఆశ్చర్యంగా చూస్తూ, అప్పుడప్పుడు ఎద్దుల బండిలో వెళ్ళే వాళ్ళని చేజింగులు చేస్తూ, ట్రాఫిక్ జాములు, సిగ్నల్సు అన్ని దాటుకొని పెళ్ళికి వెళ్ళేప్పటికి మాకు సప్త సముద్రాలు దాటి భైరవ ద్వీపం లో ఉన్న చిలకని, ఆ చిలకలో ఉన్న మాంత్రికుడి ప్రాణాన్ని పట్టుకొన్నంత ఆనందం కలిగింది. కార్ దిగీ, దిగగానె ముందు అందరం వరద బాధితుల్లా అందరం భోజనానికి పరిగెట్టాం. అసలే బయలుదేరి చాలాసేపు అయిందేమో విపరీతమైన ఆకలి. లేట్ గా వస్తే తినడానికేమి ఉండదేమో అన్న డౌటు. పెళ్ళి వాళ్ళు, అప్పుడే పాత్రలు అన్నీ కడగటానికి రెడీ అయ్యారు. పాపం మా మొహాలు చూసి వాళ్ళు కొంచెం జాలి పడి, ఏదో మిగిలింది కొంచెం మాకు పెట్టారు. భోజనం కాగానే అందరం మా వెంకి ని పరామర్శించటానికి సారీ! పలకరించటానికి వెళ్ళాం. మనసులో బాధగానే ఉన్న, వాడు పాపం నవ్వుతూనే పలకరించాడు.

వాడి బాధ ఏమో కాని, మా వెంకి గాడి పెళ్ళి సుబ్బి గాడి చావుకి, మా చావుకి వచ్చినట్టనిపించింది.

26, జులై 2008, శనివారం

"రాగాల" ఋతువు

వెనక గది నుంచి పెద్ద పెట్టున ఏడుపులు వినిపించాయి. నేను ఉలిక్కిపడ్డాను. ముందు గదిలో ముందు నెల పేపర్ చదువుతూ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అప్ డేట్ చేసుకుంటున్న నేను వెంటనే పేపర్ అక్కడ పడేసి వెనక గది లోకి వెనక గదిలోకి పరిగెట్టాను. మా నాయనమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరికి నాయకత్వం వహిస్తూ పెద్ద పెట్టున ఏడుస్తోంది. నాకు ఏమి జరిగిందో, ఎవరికి ఏమైందో అర్ధం కాలేదు. ఎవరినైనా అడుగుదాం అనుకున్నా వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి అడగటానికి భయం వేసింది. అదే సమయం లో పక్కింటి లోంచి, ఎదురింటి లోంచి, వెనకింటి లోంచి కూడా కోరస్ గా ఏడుపులు వినిపించాయి. ఆహా ఏం కో-ఆపరేషను. ఎంత ఎంత పక్క పక్క ఇళ్ళలో ఉంటే మాత్రం ఏడవడం లో కూడ మరీ ఇంత తక్షణ సహాయమా? ఇంతలో మా నాయనమ్మ ఒకేసారి ఏడుపు లెవెల్ పెంచింది. "ఓరి మాయదారి దేవుడో! అప్పుడే తీసుకెళ్ళిపోయావా?" అని పెద్దగా ఏడవడం మొదలెట్టింది. అక్కడ కూర్చున వాళ్ళు కోరస్ గా పెద్ద పెట్టున ఏడుపు సౌండ్ పెంచారు.

అప్పుడు లోపలికి వెళ్ళి చూద్దున కదా! నా ఫ్యూజ్ ఎగిరిపోయింది. వాళ్ళు ఏడుస్తున్నది ఎవరో దగ్గరి వాళ్ళకి ఏదో అయినందుకు కాదు, టి.వి. లో వస్తున్న "ఋతు రాగాలు" సీరియల్ లో ఏదో పాత్ర ( రాజీవ్ కనకాల అనుకుంటా) చనిపోయినందుకు!!. ఎవరికి ఏమి కాలేదన్న కొంచెం ఆనంద పడినా, నాకు జీవితం మీద విరక్తి మొదలయ్యింది. అప్పటికి మా నాయనమ్మ కి, సీరియల్స్ మిస్ అవ్వకుండా ఒక "బ్రేక్" లో వంట చేసి, ఇంకో "బ్రేక్" లో తిండి పెట్టడం లాంటి కళలలో చేయి తిరిగిపోయిందని తెలుసు కాని, మరీ ఇంతలా సీరియల్స్ పాత్రలని ఇంట్లో వాళ్ళలా ఫీల్ అయిపోతుందని నాకు అప్పుడే తెలిసింది.

అసలు "ఋతు రాగాలు" కొంచెం ఫరవాలేదు. నా జీవితం లో కొద్దో, గొప్పో ఫాలో అయిన సీరియల్ అదే. చివరిలో సీరీయల్ ని సాగదీయడం. "దేవదాస్ కనకాల" పాత్ర మృతృయుంజయుడులా ఎన్ని తరాలైనా అంతే యవ్వనంతో ఉండటం లాంటి కొన్ని విషయాల వల్ల చూడటం మానేసాను.

ఇంకొన్ని సీరియల్స్ అయితే మరీ ఘోరం. ఎపిసోడ్ మొదలయ్యెప్పుడు "టైటిల్ సాంగ్" ఒక 5 నిముషాలు, "జరిగిన కధ" ఒక 5 నిముషాలు, అయిపోయెప్పుడు మళ్ళి "టైటిల్ సాంగ్" 5 నిముషాలు, ఇలా 15 నిముషాలు, 30 నిముషాల సీరియల్ టైం లో పోగా. మిగతా 15 నిముషాలలో సీరీయల్ ని సాగదీయడానికి వీలయినంత కృషి చేస్తుంటారు. కింద గది లో ఫోన్ మోగుతూంటుంది. 26 మెట్లున్న మేడ దిగడానికి మెట్టుకి 30 సెకన్ల చొప్పున 13 నిముషాలు పడుతుంది. ఇంకో 2 నిమిషాలు ఫోన్ తీయాలా? లేదా? అని పాత్ర తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపుల కెమేరాని ఎడం వైపు పది నుంచి సార్లు, కుడి వైపు నుంచి పది సార్లు , పై నుంచి పది సార్లు , కింద నుంచి పది సార్లు చూపిస్తారు. ఇన్ని సార్లు చూసి మనకి కళ్ళు తిరుగుతుండగా పెద్ద సౌండ్ తో "టైటిల్ సాంగ్" మొదలు అవుతుంది. "తరవాయి భాగం రేపు" అన్నమాట. ఫోన్ తీస్తాడా? తీయడా? అనే సస్పెన్స్ మనకి బోనస్. ఈ సస్పెన్స్ తో ఈ సారి మనకి బుర్ర కూడా తిరుగుతుంది. ఇంకా మనం బతుకుంటే తర్వాత సీరీయల్ చూసె సహనం సారీ!! కెపాసిటీ మనకి వచ్చేసినట్టే. అత్త కోడళ్ళ సీరియల్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు.

మన టి.వి. వీక్షకుల సహనం చూసిన తరవాత నాకు కూడ "జీడి పాకం" అనే సీరియల్ తీద్దామని ఉంది !!! కధ కొంచెమైనా లేకుండా సీరియల్ ని "బబుల్ గం" లాగా సాగదీసే సామర్ధ్యం ఉన్న ఉత్సాహవంతులైన రచయితలకి ఇదే నా ఆహ్వానం. ఇంతకు ముందు "జీళ్ళు" తయారుచేసిన వారికి ఫ్రిపరెన్స్ ఇవ్వబడును.

24, జులై 2008, గురువారం

"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?

కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు.

బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.
బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు.

లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.

ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ "OK" చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు.

ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు.

ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు.

అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి
"అర్జునా !
బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!
బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!
మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.
నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"
అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు.

అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు.

ఈ కథ పది సార్లు పారాయణ చేసిన వారికి పది బగ్గులు తక్కువ వస్తాయి !!!

గమనిక : సరదాకి రాసింది మాత్రమే!

22, జులై 2008, మంగళవారం

లెక్కల మాష్టారి ఫిలాసఫీ

నేను పాలిటెక్నిక్(డిప్లొమా) చదివేరొజుల్లో మాకు మొదటి సంవత్సరం సిలబస్ లో లెక్కలు కూడా ఉండేది. మా లెక్కల మాష్టారికి లెక్కలతో పాటు ఫిలాసఫీలో కూడా ఏదో పెద్ద డిగ్రీ(ఎం.ఫిల్ అనుకుంటా) ఉండేది. మా లెక్కల మాస్టారు ఫిలాసఫీ తోనే మాకు ఇంట్రడక్షన్ క్లాసు మొదలు పెట్టారు. "ప్రవహించే నీరు రాళ్ళ మీద ప్రవహించినప్పుడు ఎంత అందమైన శబ్దం వస్తుందో, మనం కూడ జీవితం అనే ప్రవాహం లో కష్టాలు అనే రాళ్ళు వచ్చినప్పుడు ఆగిపోకుండా సాగిపోయినప్పుడే మన జీవితం అందంగా అనందంగా మారుతుంది." ఇదీ ఆయన మాకు మొదటి క్లాసులో చెప్పిన మొదటి పాటం. అప్పట్లో ఏమి అర్ధం కాకపొయినా అద్భుతంగా ఉంది అనిపించింది.

తర్వాత క్లాసు నుంచి మాకు లెక్కలు చెప్పటం మొదలుపెట్టారు. బోర్దు మీద ఏదో లెక్క వేసారు. తర్వాత వెంటనే ఆన్సర్ వేసారు. నాకేమి అర్ధం కాలేదు. ఒకడిని లేపి "అర్ధం అయిందా?" అని అడిగారు. వాడు అర్ధం కాలేదు అని చెప్పాడు. ఏమిటోయ్ ఇది కూడ తెలియకపొతే ఎలా? అని కసురుకొన్నారు. ఇంకొకడిని లేపి "అర్ధం అయిందా?" అని అడిగారు. పాపం వాడు వెంటనే అర్ధం అయింది సార్ అని చెప్పాడు. ఇంతే కదోయ్ దీనిలో అర్ధం కాకపోవడానికి ఏముంది అని తేల్చెసారు. దెబ్బతో "రాళ్ళూ-నీళ్ళు" ఫిలాసఫీ నాకు అప్పుడప్పుడే మెల్లిగా అర్ధం అవుతూ ఉన్నట్టు అనిపించింది. ఫస్టు క్లాసులో చెప్పిన ఫిలాసఫీ నెక్స్ట్ క్లాసుకే జీవితం లో ఎదురవడం నాతో పాటు చాలా మంది జీర్ణించుకొలేకపొయారు.

ఈ దెబ్బతో పదో తరగతిలో మా లెక్కల మాష్టారి ప్రియ శిష్యుడైన నాకు లెక్కలంటె భయం వచ్చేసింది. లెక్కల్లో నా పొజిషన్ "Cos O" గా ఫీల్ అయ్యే నేను "Sin O" అయిపొయాను అని తెలుసుకొవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. దీనికి తోడు సర్వాంతర్యామి లాంటి త్రికోణమితి (Trigonometry) త్రికోణమితి లోను, కాలుక్యులస్ లోను , నా మొహం లోను, అన్నిటిలోను ఉండేది. త్రికోణమితి పెట్టినప్పుడు ఒక చాప్టర్ లో పెట్టచ్చు కదా. అన్నిటిలోను ఇదే పెట్టాలా? అసలు నేను లెక్కలు ఎందుకు చెయ్యాలి? భవిష్యత్తులో "C" లో "printf" లు "Java" లో "println" రాయాల్సిన వాడికి ఈ తొక్కలో లెక్కలు అవసరమా? ఇలాంటి కొత్త కొత్త ఫిలాసిఫీలు నాకు కూడా వచ్చేసేవి.

ఫ్రిన్సిపాల్ గారికి చెప్దామా అంటే, అసలే మా లెక్కల మాష్టారు మన ముందు చంద్ర బాబు నాయుడు ని నిలబెట్టి వై.యస్.రాజశేఖర్ రెడ్డి అని మన చేతే ఒప్పించగల సమర్ధుడు. మొదటికే మోసం వస్తుంది అని డ్రాపయిపోయాం.

ఇలాంటి కొన్ని దురదృష్టకరమైన క్లాసుల మధ్య ఆ సంవత్సరం గడిచిపోయింది. పరీక్షలు వచ్చేసాయి. జీవితంలో మొదటి సారి పరీక్షలు అంటే భయపడ్డాను. ఏదో లాగా ఎగ్జాం రాసేసాను. సెలవలు నుంచి వచ్చిన తర్వాత మార్కులు చూసుకుంటె 50 కంటె కొంచెం ఎక్కువ వచ్చాయి. జీవితం లో ఎప్పుడూ 70 కంటె తక్కువ మార్కులు చూడని నేను ఆ మార్కులు చూసి ఏంచేస్తాం అదే ఎక్కువ అని ఫీల్ అవ్వల్సి వచ్చింది.

ఇలా మీరు ఎప్పుడైనా బాధపడ్డారా?

19, జులై 2008, శనివారం

నా మనోభావాలు కూడా దెబ్బ తిన్నాయి

నా మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వెంటనే "ఆడు వారి మాటలకు అర్ధాలు వేరులే" సినిమా నుంచి అభ్యంతకరమైన సన్నివేశాలు తొలగించి దర్శక నిర్మాతలు బేషరతుగా క్షమపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇదేం కొత్త వివాదం అనుకుంటున్నారా? ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాల గురించి వివాదాలు రేగుతున్నప్పుడు నేను కూడా గత కొన్ని సినిమాలగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకి జరుగుతున్న సాంస్కృతిక అన్యాయాలను ఎందుకు నిలదీయలకూడదు అని ప్రశ్నిస్తున్నాను. "పోకిరి" సినిమా నుంచీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లని కించపరుస్తూనే ఉన్నారు. ఇంతకీ నన్ను మనోవేదనకి గురి చేసిన సన్నివేశం ఏంటంటె "ఆడు వారి మాటలకు అర్ధాలు వేరులే" సినిమాలో హీరొ అయిన వెంకటేష్ గారికి ఒక సమస్య వస్తుంది. హీరో గారి అనుకోకుండా చేసిన ఒక పని వల్ల సాప్ట్ వేర్లో పరమ భయకరమైన సమస్యలు వచ్చి పని చెయడం మానేస్తుంది. తర్వాత రోజుకల్లా ఆ సమస్యని పరిష్కరించాలి. హీరో గారికి జన్మతః పైట్లు & పాటలు అయితే వచ్చు కాని జావా రాదు కదా. హీరో గారు తీవ్రంగా ఆలోచించి ఒక బ్రహ్మాండమైన నిర్ణయానికి వస్తారు. అంతే మన హీరో గారు క్వార్టెర్ మందు తాగి కోడింగ్ మొదలు పెట్టేస్తారు. ఒక రాత్రి లో జావా నేర్చుకొని సమస్యని అద్భుతంగా పరిష్కరిస్తారు.

ఇదే నిజమైతే సాప్ట్ వేర్ ఇంజినీర్లు అందరు తాగుబోతులు అయ్యి ఉండాలి, సాప్ట్ వేర్ కంపనీలు అన్నిటిలోను 24 గంటలు బార్లు బార్లా తెరిచి ఉండాలి. అసలే ఈ సీను చూసి నేను బాధ పడుతుంటే, వేరే వాడి బగ్గు నాకు అసైన్ చెసినట్టు మా మరదలు "బావ జావా అంత వీజీనా?" అని అడిగింది. అసలే సాప్ట్ అయిన నా సాప్ట్ వేర్ హృదయం బాధగా మూలిగింది. ఎడ్యుకేటెడ్ అయిన మా మరదలే ఇలా ఆలోచిస్తే ఇంక నిరక్షరాస్యుల పరిస్థితి ఏంటి?

అందుకే సాప్ట్ వేర్ ఇంజినీర్లు అందరు ఏకమై ముక్త కంఠంతో ఈ సాంస్కృతిక అన్యాయాన్ని ఖండించాలి. ఈ సందర్భంగా మనం ఈ కింది పనులు చేద్దాం.

1. జూలై 21 న మనం అందరం ఆఫీస్ లో పనులు మానెసి నిరసన తెలపాలి. ( రోజూ పని చేస్తున్నామా ఏంటి అనుకుంటె ఆ రోజు ఈ కారణం చెప్పి పని మానెయ్యండి)
2. పంజాగుట్ట నుంచి సి.యం. కేంప్ ఆఫిస్ వరకు పాద యాత్ర.
3. సెన్సార్ వాళ్ళు కొత్త రూల్సు పెడుతున్నారట. సాప్ట్ వేర్ ఇంజినీర్లని కించపరచే సన్నివేశాలు ఉందకూడదని డిమాండ్ చేద్దాం.
4. ఒక వేళ అలాంటి సన్నివేశాలు ఉంటే ఆ సినిమా నిర్మాతని కఠినంగా శిక్షించాలి. అంటే కనిసం 3 సంవత్సరాలు మా మేనేజర్ కింద ఆన్ సైట్ కి సహారా ఎడారికి పంపించాలి.

గమనిక : ఈ టపా సరదాకి రాసింది మాత్రమే

blogger templates 3 columns | Make Money Online