20, ఆగస్టు 2008, బుధవారం

అమ్మ, బామ్మ, బెండకాయ పులుసు

పూత రేకులకి ఆత్రేయపురం ఫేమస్. కాజాలకి కాకినాడ ఫేమస్. లడ్డూలకి బందరు ఫేమస్. బిర్యానికి మన భాగ్యనగరం ఫేమస్. బిసి బేళి బాత్ కి బెంగుళూరు ఫేమస్. ఇలా కొన్ని కొన్ని పదార్ధాలకి కొన్ని కొన్ని ప్రాంతాలు ఎలా ఫేమస్సో మా బామ్మ (మా నాయనమ్మ) బెండకాయ పులుసుకి అంత ఫేమస్సు. ఇప్పుడు ఏ లోకాన బెండ కాయ పులుసు వండుతుందో తెలియదు కాని, బెండ కాయ పులుసు మాత్రం కత్తిలా చేసేది. చూడగానే నొట్లో నీళ్ళూరేవి (కొంచెం కారంగా ఉండేది కాబట్టి తింటే కంట్లో కూడా నీళ్ళొచ్చేవి).

బిర్యాని, బొమ్మిడాయల పులుసు, బిసి బేళి బాత్, బందరు లడ్డు, మా నానమ్మ చేసిన బెండకాయ పులుసు అన్ని ముందు పెట్టి ఏది కావాలని అడిగితే చటుక్కున బెండకాయ పులుసుకే నా వోటు వేసే వాడిని. అంత బాగుండేది. ఆ పులుసు వెనక ఏ రహస్య ఫార్ములా ఉందో తెలియదు గాని అంత బాగా వండటం ఇంకెవ్వరి వల్లా అయ్యేది కాదు. మా అత్తలకి, మా అమ్మ కి, మా పిన్నులెవ్వరికి కూడా అంత బాగా వండటం వారసత్వంగా అన్నా రాలేదు.

నా పేరు మా నానమ్మ పేరుతో కలిపి పెట్టటం వల్లనో, లేక వంశోధ్ధారకుడనో, మొత్తానికి మా నానమ్మకి నేనంటే చాలా ఇష్టం. బెండకాయ పులుసు వండినప్పుడల్లా మనకి "స్పెషల్" గా మా ఇంటికి పార్సిల్ వచ్చేది. ఇలా సంతోషంగా మూడు బెండకాయలు ఆరు పులుసులుగా రోజులు గడిపేస్తున్నాను.

అయితే - అన్ని రోజులు ఒకేలా ఉండవు

నేను కాలేజ్ చదువుల కోసం వేరే ఊరు వెళ్ళవలిసి వచ్చింది. రెసిడెన్షియల్ కాలేజ్ కాబట్టి హాస్టల్ లోనె ఉండేవాళ్ళం. మా హాస్టల్లో తిండి మాత్రం భలే అద్భుతం గా ఉండేది. ఆ తిండికి మా నాలుక మీదున్న రుచి మొగ్గలన్ని అంతరించి పోయాయి. రుచికరమైన తిండికి బాగా మొహం వాచిపోయాం. ఎంతగా మొహం వాచిపోయామంటే ఎవడైనా ఇంటి దగ్గర నుంచి వచ్చాడనే తెలిస్తే చాలు, కరువొచ్చినప్పుడు దుకాణాల మీద పడి దోచుకునే వాళ్ళ లాగా వాడి మీద దాడి చేసి, ఇంటి దగ్గర నుంచి ఏమి తెస్తే అది క్షణాల్లొ గుటుక్కుమనిపించే వాళ్ళం. అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి. (ఏంటో ఈ మధ్య మా ఆఫీస్ కేంటీన్ వాడు కూడ మా హాస్టల్ ని పదే పదే గుర్తు తెస్తున్నాడు). ఈ బాధ పడలేక ఒక సారి ఇంటికి చెక్కేసాను. డైరెక్ట్ గా మా నానమ్మ దగ్గరికి వెళ్ళి బెండకాయ పులుసు వండించుకున్నా. వరదల్లో పులిహోర పొట్లం సంపాందించి తింటున్న వాడిలా, వారం రోజుల నుంచి అన్నం తిననని వాడిలా కంగారు కంగారు గా తినేసా. తినేసి సంతోషంగా ఊరు మీదకి బలాదూరు బయలుదేరా.

బొత్తిగా అత్తా కోడళ్ళ సీరియల్సు చూసే అలవాటు లేకపోవడం వల్లా, అజ్ఞానం తోను నేను చేసిన చారిత్రాత్మక తప్పిదం ఏంటో నాకు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అర్ధం అయింది. నాయనమ్మ ఇంటికి వచ్చి మా అమ్మతో నువ్వు నా మనవడికి సరిగా వండి పెట్టడం లేదు అందుకే నా దగ్గరికి వచ్చి బెండకాయ పులుసు చేయమని అడిగాడు అని దెప్పింది. అంతే మాట మాట పెరిగింది ఇద్దరి మధ్య పచ్చని బెండకాయ వేస్తే బగ్గున మండింది. యుధ్ధ నగారా మోగింది. చరిత్రలో ఒకటవ బెండకాయ యుధ్ధం మొదలయింది.

నానమ్మకు తోడుగా 2 మిత్ర దేశాలు(ఆ పక్కింటి వాళ్ళు), అమ్మకు తోడుగా 2 మిత్ర దేశాలు (ఈ పక్కింటి వాళ్ళు) సైన్యాన్ని మొహరించాయి. ఒకరి మీద ఒకరు యుద్ధాస్త్రాలు సంధిస్తున్నారు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. "బెండకాయ పులుసులో తుఫాను" అంటే ఇదేనేమో? వెంటనే ఇటువంటి విషయాలు పరిష్కరించడం లో ఆరితేరిన ఐక్య రాజ్య సమితి (మా నాన్న) ని రంగలో దించా. ఐ.రా.స. జ్యోక్యంతో ఇరు పక్షాలు యుధ్ధాన్ని విరమించాయి. ఆ విధంగా ఒకటవ బెండకాయ యుధ్ధానికి తెరపడింది.

ఆ తర్వాత తినాలనిపిస్తే నన్ను అడగచ్చు కదాని మా అమ్మ నాకు "ఫుల్లు" క్లాసు .అలాంటి తప్పు మళ్ళీ ఇంకెప్పుడు చేయకుండా మరిన్ని యుధ్ధాలు జరగకుండా జాగ్రత్తపడ్డాను. కాని బామ్మ వండిన బెండకాయ పులుసుని మనం వదుల్తామా? ఈ సారి తినాలనిపించినపుడు మా తాతతో బజారుకు వెళ్ళి బెండకాయలు కొనిపించేవాడిని. అంతే. యధావిధిగా మన "స్పెషల్ పార్సిల్" రెడీ !!

అలా నాకు మా నానమ్మ వండిన బెండకాయ పులుసు ఎంత ఇష్టం ఏర్పడిపోయింది అంటే. మా నానమ్మ లోకాన్ని వదిలి వెల్లిపోయిన తర్వాత నేను కూడా బెండకాయ పులుసుని వదిలేసాను. ఇంకెప్పుడు తినలేదు.

7, ఆగస్టు 2008, గురువారం

తుఫాను

వర్షం పడుతున్నప్పుడు చూస్తే మీకేమనిపిస్తుంది? తడవాలనిపిస్తుందా? పడవలు చేసి ఆడుకోవాలి అనిపిస్తుందా? కిటికీ లోంచి వర్షాన్ని చూస్తూ వేడి వేడి వేరు శెనక్కాయులు తింటూ ఏదైనా పుస్తకం చదుకోవాలి అనిపిస్తోందా?

నాకు మాత్రం .......

****************************************************************************************************************************

అప్పుడు నేను 8 వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడంటె తగ్గిపోయింది కాని, నాకు అప్పట్లో క్రికెట్ పిచ్చి బాగానే ఉండేది ( నిజం చెప్పాలంటే అప్పట్లో మన వాళ్ళు బాగానే ఆడేవాళ్ళు). మన వాళ్ళు "టైటాన్ కప్" ఫైనల్ కి వచ్చారు. ఫైనల్ లో ప్రత్యర్ధి సౌత్ ఆఫ్రికా.

ఆ రోజు 1996 నవంబర్ 6. నేను, నాతో పాటు నా సహ క్రికెట్ పిచ్చోడు మా బాబాయి, వాళ్ళింట్లో మ్యాచ్ చూస్తున్నాం (పిచ్చి వాళ్ళలో సమైఖ్యత ఎక్కువుంటుంది !!!). మా బాబాయి వాళ్ళ ఇంటి వెనకాలే మా ఇల్లు కూడా ఉండేది. మ్యాచ్ ప్రారంభం అయింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు మొదట బ్యాటింగ్ చేసారు. ఎంత కొట్టారో గుర్తు లేదు కాని బాగానే కొట్టారు. మన వాళ్ళ బ్యాటింగ్ మొదలయింది. దాంతో పాటు బయట వర్షం కూడా మొదలయింది. వర్షం చినుకులు రాలినట్టు వికెట్లు కూడా టపా టపా రాలిపోతున్నాయి. కొట్టవలసిన స్కోరు ఇంకా చాలా ఉంది. బ్యాట్స్ మెన్ అందరు అవుతయిపోయారు. క్రీసులో కుంబ్లే, శ్రీనాథ్ ఉన్నారు. ఏమవుతుందో అన్న టెన్షన్. వర్షం ఇంకా పెద్దదయింది. కుంబ్లే, శ్రీనాథ్ ఇంకా ఆడుతున్నారు. అప్పుడె కరెంట్ కూడా పోయింది. గెలుస్తారన్న నమ్మకం లేకపోయినా మ్యాచ్ ఏమయిపోయిందో అన్న టెన్షన్. టి.వి. చూద్దామంటే కరెంట్ లేకుండా పోయింది. మేము వదులుతామా? రేడియో పెట్టి కామెంట్రీ వింటున్నాం. ఇక్కడ వర్షం ఇంకా విజృభించింది. అక్కడ కుంబ్లే, శ్రీనాథ్ పరుగుల వరద పారించారు. హుర్రే!! మనం ఫైనల్ గెలిచేసాం. "టైటాన్ కప్" మనదే.

మన వాళ్ళు ఫైనల్ గెలిచారో లేదో ప్రకృతి వైపరీత్యాలు మొదలయ్యాయి. వర్షం భారీ వర్షం గా, భారీ వర్షం తుఫాను గా మారింది. ఆ గాలికి మా బాబాయి వాళ్ళ ఇంటి పైన పెంకులు టపా టపా ఎగిరిపడసాగాయి. దీపావళికి 1000 వాలా బాంబులు పేల్చినట్టు గా ఉంది ఆ శబ్దం. కిటికి లోంచి చూస్తే సినిమాల్లో చుపించినట్టు చెట్లు గాలికి ఒక పక్కకి వంగిపోయి భయంకరంగా వూగుతున్నాయి. చాలా భయం వేసింది. ఎంత భయపడ్డానంటే మా బాబాయి వాళ్ళ ఇంటికి 4 అడుగుల దూరం లో ఉన్న మా ఇంటికి వెళ్ళడానికి కూడా నేను చాలా భయపడ్డాను. 2 గంటల తర్వాత వర్షం, గాలి కొంచెం తగ్గాయి. మా బాబాయి నన్ను ఇంట్లో దిగబెట్టాడు.

వర్షం బాగా తగ్గిన తర్వాత మా వీధి లో ఉన్న బాషా మేష్టారు నా వయసు కుర్రాళ్ళని కొంతమందిని పిలుచుకెళ్ళారు. పిలిచారు కాబట్టి వెళ్ళాం ఎందుకో నాకో తెలియదు. మేష్టారి వెనకాల మేమందరం టార్చి లైట్లు పట్టుకొని వీది మొదట్ళో ఉన్న "సూరమ్మ" గారింటికి వెళ్ళాం. మేష్టారు సూరమ్మ గారిని "ఏమ్మా ఇంట్లో అందరు బాగానే ఉన్నారు కదా? ఎవరికి ఏమి కాలేదు కదా?" అని వాకబు చేసారు. "అందరు బతికే ఉన్నారు కదామ్మా?" అనే అర్ధం ధ్వనించింది ఆ మాటల్లో. పరిస్థితి అంత సీరియస్ గా ఉన్న విషయం నాకప్పటికి వరకు అర్ధం కాలేదు. నా లాంటి పిల్ల కాకికేం తెలుసు తుఫాను దెబ్బ. అలా మా వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాని కనుక్కొని వచ్చాం. అదృష్టవశాత్తు మా వీధిలొ ఎవరికి ఏమి కాలేదు కాని ఇద్దరు గల్లంతయ్యారు.

మిగతా ప్రపంచం తో కమ్యూనికేషన్ తెగిపోయింది. వారం రోజులు కరెంట్ లేదు. కరెంట్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు సైతం ఎక్కడిక్కడ రోడ్డుకడ్డంగా పడిపోయాయి. నేను పెంచుకున్న మామిడి చెట్టు కూడా కూలిపోయింది. వర్షానికి ఇంట్లోకి నీళ్ళొచ్చాయి. 2 రోజులు నీళ్ళు అలాగే నిలిచిపోయాయి. నీళ్ళలో అక్కడక్కడ పాములు తిరుగుతున్నాయి. పురుగు, పుట్ర వస్తాయేమో అన్న భయం తో ఆ 2 రోజులు మా అమ్మ, నాన్న నిద్రపోకుండా కాపలా కాసారు. కిరోసిన్ దీపాలతో, ఇంట్లో ఉన్న కొద్ది పాటి వంట సామాగ్రి తో నెట్టుకొచ్చాం. ఇంట్లో ఉన్న సామాను కొద్ది రోజులకే సరిపోతుంది. అన్నీ పొదుపు గా వాడవలసి వచ్చింది. 4-5 రోజుల తర్వాత రేషన్ షాపులో కిరోసిన్, బియ్యం ఇచ్చారు.

2 రోజుల తర్వాత కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత నేను, మా బాబాయి వూరు ఎలా ఉందో చూడటనికి వెళ్ళాం. ఏ వీదిలో చూసినా మోకాలు లోతు నీళ్ళు, పడిపోయిన చెట్లు. తలకోన అడవి లో ఉన్నామా అనిపించింది. వందల ఏళ్ళ నాటి పెద్ద పెద్ద మర్రి చెట్లు కూడ కూలిపోయాయి. 10 రోజులు పరిస్థితి అలాగే ఉంది. 10 రోజుల తర్వాత స్కూలుకు వెళ్ళా. మా స్కూలు చూడగానే నిజంగా ఏడుపొచ్చింది. అప్పటికి 100 ఏళ్ళు నిండిన మా స్కూలు లో 1500 మంది విద్యార్ధులతో, 10 ఎకరాల్లో ఉండేది. తుఫాను దెబ్బతో తరగతి గదుల రేకులన్ని ఎగిరిపోయి, క్లాసు రూములు నిండా బురద, చెత్త చెదారం.. అబ్బా. అలాంటి స్కూలు ఎలా అయిపోయిందో తలుచుకుంటే ఇప్పటికీ అదోలా ఉంటుంది.

****************************************************************************************************************************

అందుకే వర్షాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. నవంబర్ 6 వస్తే నాకు వణుకు పుడుతుంది.

కొసమెరుపు: తుఫాను వచ్చిన 3 రోజుల తర్వాత మా తాతయ్య నాకు పదేళ్ళ కిందటి "కృష్ణా పత్రిక" ఒకటి చూపించారు. ఖచ్చింతంగా పదేళ్ళ కిందటిది అంటే 1986, నవంబర్ 6 తేదిన వచ్చిన పేపర్. ఆ పేపర్ చూడగానే నా భయం ఇంకా రెట్టింపయింది. ఆ రోజు పేపర్ హెడ్ లైన్ "దివి సీమ లో ఉప్పెన".

blogger templates 3 columns | Make Money Online